కొవిడ్‌ చికిత్సకు తొలి ముక్కు స్ర్పే

ABN , First Publish Date - 2022-02-10T07:04:44+05:30 IST

వయోజనుల కొవిడ్‌ చికిత్స కోసం గ్లెన్‌మార్క్‌ ఫార్మా సరికొత్త ఔషధాన్ని ఆవిష్కరించింది. ఇందుకు దోహదపడే నైట్రిక్‌ ఆక్సైడ్‌ ముక్కు స్ర్పేను ‘ఫ్యాబీ స్ర్పే’ బ్రాండ్‌ పేరుతో బుధవారం మార్కెట్లోకి విడుదల...

కొవిడ్‌ చికిత్సకు తొలి ముక్కు స్ర్పే

కరోనా వైరస్‌పై కొత్త అస్త్రం ‘ఫ్యాబీ స్ర్పే’

ఆవిష్కరించిన గ్లెన్‌మార్క్‌ ఫార్మా 

ముక్కులోనే వైరస్‌ను చంపే సామర్థ్యం

ఊపిరితిత్తుల్లోకి చొరబడకుండా 

ఆదిలోనే అంతమయ్యే వైరస్‌


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 : వయోజనుల కొవిడ్‌ చికిత్స కోసం గ్లెన్‌మార్క్‌ ఫార్మా సరికొత్త ఔషధాన్ని ఆవిష్కరించింది. ఇందుకు దోహదపడే నైట్రిక్‌ ఆక్సైడ్‌ ముక్కు స్ర్పేను ‘ఫ్యాబీ స్ర్పే’ బ్రాండ్‌ పేరుతో బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ తీవ్రత పెరిగే అవకాశాలున్న హైరిస్క్‌ వర్గాల చికిత్సకు దీన్ని అందించవచ్చని గ్లెన్‌మార్క్‌ ఫార్మా తెలిపింది. ‘ఫ్యాబీ స్ర్పే’ తయారీ, మార్కెటింగ్‌కు సంబంధించిన అనుమతులను డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి పొందినట్లు పేర్కొంది. కెనడా ఫార్మా కంపెనీ ‘సానోటైజ్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌’తో కలిసి దీన్ని రూపొందించినట్లు వెల్లడించింది. కరోనా వైర్‌సపై నేరుగా ప్రభావాన్ని చూపే యాంటీ-మైక్రోబయల్‌ సామర్థ్యం నేసల్‌ స్ర్పేలోని ఔషధానికి ఉందని వివరించింది. ముక్కులోని శ్లేష్మపొరపై ‘ఫ్యాబీ స్ర్పే’ చేసిన తర్వాత.. అది కరోనా వైర్‌సకు భౌతిక, రసాయనికపరమైన ఆటంకంగా మారుతుందని గ్లెన్‌మార్క్‌ తెలిపింది. ముక్కును వైరస్‌ ఆవాసంగా మార్చుకోకుండా, అక్కడి నుంచి ఊపిరితిత్తులకు వ్యాపించకుండా ఆదిలోనే అంతం చేసేందుకు ఫ్యాబీ స్ర్పే దోహదం చేస్తుందని పేర్కొంది. ‘‘ఫ్యాబీ స్ర్పేలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఉంటుంది. ఇది పూర్తిగా సురక్షితమైంది. దీన్ని అందించిన వారిలో వైరల్‌ లోడ్‌ 24 గంటల్లో 94 శాతం, 48 గంటల్లో 99 శాతం మేర తగ్గినట్లు భారత్‌లో నిర్వహించిన మూడోదశ ప్రయోగ పరీక్షల్లో తేలింది’’ అని గ్లెన్‌మార్క్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికాలోని ఉతా స్టేట్‌ యూనివర్సిటీలో ఫ్యాబీ స్ర్పేతో నిర్వహించిన ట్రయల్స్‌లో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా సహా పలు కరోనా వేరియంట్లను రెండు నిమిషాల్లోనే 99.9 శాతం నిర్మూలించినట్లు వెల్లడైందని గ్లెన్‌మార్క్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ మోనికా టాండన్‌ తెలిపారు. కాగా, బహ్రెయిన్‌, ఇజ్రాయెల్‌ దేశాల్లో ‘ఎన్‌వోయిడ్‌’ పేరుతో ఫ్యాబీ స్ర్పేను విక్రయించేందుకు గ్లెన్‌మార్క్‌కు అనుమతులు వచ్చాయి. 

Updated Date - 2022-02-10T07:04:44+05:30 IST