కొవిడ్‌ సిబ్బందికి జీతాల్లేవ్‌!

ABN , First Publish Date - 2021-07-26T06:00:20+05:30 IST

కరోనా సెకండ్‌వేవ్‌ సమయంలో నియమితులైన హెల్ప్‌ డెస్క్‌ మేనేజర్లకు ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్క నెల జీతం కూడా చెల్లించలేదు.

కొవిడ్‌ సిబ్బందికి జీతాల్లేవ్‌!

సెకండ్‌ వేవ్‌లో మూడు నెలలపాటు పనిచేసిన హెచ్‌డీఎంలు

రూ.15 వేల చొప్పున వేతనం చెల్లిస్తామని రిక్రూట్‌ చేసిన అధికారులు

ఇంతవరకు ఒక్క నెల కూడా  జీతాలు అందని వైనం

కొవిడ్‌ తీవ్రత సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో విధులు

కొవిడ్‌ డ్యాష్‌బోర్డులో సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయడంలో కీలకం

జీతాలు ఆలస్యమవుతాయి.. నచ్చితే చేయండి లేదంటే మానేయండంటున్న అధికారులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కరోనా సెకండ్‌వేవ్‌ సమయంలో నియమితులైన హెల్ప్‌ డెస్క్‌ మేనేజర్లకు ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్క నెల జీతం కూడా చెల్లించలేదు. ఆస్పత్రుల్లో చేరిన వైరస్‌ బాధితులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాలోని 50 నోటిఫైడ్‌ కొవిడ్‌ ఆస్పత్రుల్లో పనిచేసేందుకు 150 మంది హెల్ప్‌ డెస్క్‌ మేనేజర్లను నియమించింది. వీరంతా మే నుంచి ఆయా ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే మూడు నెలలవుతున్నా ఇప్పటికి ఒక్క నెల వేతం కూడా ప్రభుత్వం చెల్లించలేదని వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ విపత్తులో ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించిన తమకు ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం అన్యాయమని వాపోతున్నారు. కొవిడ్‌ ఆస్పత్రుల్లో చేస్తుండడం వల్ల ఇంటికి వెళితే.. ఇబ్బందులుంటాయని అద్దె రూముల్లో ఉంటూ మూడు నెలలపాటు సేవలు అందించామని, రూము అద్దెలు, తిండి ఖర్చులు కూడా అప్పులు చేసి కట్టుకున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా జీతాలు విడుదల చేస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయని వారంతా వేడుకుంటున్నారు. 


నచ్చితే చేయండి.. లేదంటే మానేయండి.. 

హెల్ప్‌ డెస్క్‌ మేనేజర్లను కొవిడ్‌ స్టేట్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూముకు చెందిన అధికారులు నియమించారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ దగ్గర నుంచి వారికి ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించడం, ఎంపిక చేయడం వరకు నియామక ప్రక్రియ మొత్తాన్నీ వారే చూశారు. అనంతరం ఆంధ్రా మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌ పేరుతో నియమాక పత్రాలను అందించారు. రూ.15 వేల వేతనం చెల్లిస్తామని, మూడు నెలలపాటు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, అవసరమైతే మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని వేతన పత్రంలో స్పష్టం చేశారు. విధుల్లో చేరి మూడు నెలలు దాటుతున్నప్పటికీ జీతం చెల్లించకపోవడంతో అధికారులను సంప్రతించిన సదరు హెల్ప్‌ డెస్క్‌ మేనేజర్లకు ఊహించని సమాధానం ఎదురైంది. జీతాలు చెల్లించడానికి సమయం పడుతుందని, నచ్చితే చేయండి...లేదంటే మానేయండి అన్నట్టు పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ సమయంలో పని చేసిన ప్రతి ఒక్కరికీ గౌరవాన్ని ఇవ్వాలని సీఎం చెబుతుంటే... అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పలువురు సిబ్బంది వాపోతున్నారు. సమస్యను జిల్లా అధికారులు దృష్టికి తీసుకెళ్లగా... తమ చేతుల్లో ఏమీ లేదని చెబుతున్నారని, అక్కడ అధికారులు మానేయండంటూ మాట్లాడుతున్నారని, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని పలువురు వాపోతున్నారు. 


డ్యాష్‌బోర్డ్‌ నిర్వహణలో కీలకం

కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆయా ఆస్పత్రుల్లోని పడకలు, రోగులు వివరాలను తెలుసుకునేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా డ్యాష్‌బోర్డును నిర్వహించింది. దీనిని హెల్ప్‌ డెస్క్‌ మేనేజర్లు క్షేత్రస్థాయిలో సమర్థంగా నిర్వహించడం వల్లే ఇది సాధ్యమైంది. ఆయా ఆస్పత్రుల్లో నమోదయ్యే మరణాలు, కొత్త అడ్మిషన్లు, డిశ్చార్జ్‌లు, పడకల ఖాళీల వివరాలను ప్రతి మూడు గంటలకు ఒకసారి డ్యాష్‌ బోర్డులో అప్‌లోడ్‌ చేయడం వీరి బాధ్యత. దీనివల్ల ఉన్నతాధికారులకు రాష్ట్రంలో పరిస్థితి పట్ల ఎప్పటికప్పుడు ఒక అవగాహనకు వచ్చి.. మరిన్ని చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది. క్లిష్ట పరిస్థితుల్లో మెరుగైన సేవలు అందించిన సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా ఆకలి కేకలు పెట్టేలా చేయడం ఎంత వరకు సమంజసమని వారంతా ప్రశ్నిస్తున్నారు. సెకండ్‌ వేవ్‌లో పని చేసినందుకు జీతాలు ఇవ్వాలని ఒకపక్క కోరుతుంటే పట్టించుకోని అధికారులు.. మూడో వేవ్‌కు సిద్ధం కావాలని ఆదేశించడం ఎంత వరకు సమంజసమని ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తమ ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై ఆంధ్రా మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌ను వివరణ కోరగా.. హెల్ప్‌ డెస్క్‌ మేనేజర్ల జీతాల చెల్లింపులో ఎటువంటి ఇబ్బందులు లేవని, వారి బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ను ఇప్పటికే అధికారులకు పంపించామన్నారు. సీఎఫ్‌ఎంఎస్‌లో ఇబ్బందులు వల్ల వారి బ్యాంకు ఖాతాల్లోకి జీతాల సొమ్ము జమ కాలేదని, రెండు, మూడు రోజుల్లో సమస్య క్లియర్‌ అవుతుందన్నారు. 


Updated Date - 2021-07-26T06:00:20+05:30 IST