మాస్కు లేకుంటే మద్యం ఇచ్చేది లేదు

ABN , First Publish Date - 2022-06-29T13:16:35+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రజలందరూ తప్పకుండా మాస్కులు ధరించాల్సిందేనని ఆరోగ్యశాఖ

మాస్కు లేకుంటే మద్యం ఇచ్చేది లేదు

                             - Covid నిబంధనలు అమలు


చెన్నై, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రజలందరూ తప్పకుండా మాస్కులు ధరించాల్సిందేనని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో ఇటీవల కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ఈ జిల్లాల్లోని ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లోని వాణిజ్య సంస్థలు, దుకాణాల్లో ఏసీ కూడా నిలిపివేయాలని కూడా స్పష్టం చేసింది. కోడంబాక్కం, రాయపురం, అన్నానగర్‌ జోన్లలోనూ కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. చెన్నై నగరవాసులు తప్పకుండా మాస్కులు ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరాన్ని పాటించాలని ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా ఆదేశించింది. ఈ విషయమై ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ... చెన్నై సహా నాలుగు జిల్లాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికమవుతున్నా బాధితులు చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేకున్నా కరోనా బారిన పడకుండా నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా నిరోధక నిబంధనల పాటింపుపై ప్రజల్లో మళ్ళీ అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు. ఇందులో భాగంగా మైలాపూర్‌ లజ్‌కార్నర్‌లో బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తానే స్వయంగా కరోనా అవగాహన ప్రచారంలో పాల్గాంటానన్నారు. 


మాస్కు లేకుంటే మద్యం పోయం : టాస్మాక్‌

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మళ్ళీ కరోనా నిరోధక నిబంధనలు పాటించాలంటూ టాస్మాక్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కఠిన నిబంధనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. మాస్కులతో వచ్చిన వచ్చేవారికే మద్యం విక్రయించాలని, క్యూలైన్‌లో వుంటేనే సరకివ్వాలని సిబ్బందిని ఆదేశించింది. మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది కూడా తప్పకుండా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. అధికారులు దుకాణాల వద్ద ఆకస్మిక తనిఖీలు జరిపి, మాస్కులు ధరించని సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించింది. 

Updated Date - 2022-06-29T13:16:35+05:30 IST