భౌతిక దూరానికి రాం రాం

ABN , First Publish Date - 2021-04-16T05:33:49+05:30 IST

కరోనా రెండో దశ విజృంభణతో పాఠశాలల నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. ప్రతి విద్యార్థీ మాస్క్‌ ధరించాలన్న నిబంధన విధించారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల చేతులను శానిటైజ్‌ చేస్తున్నారు.

భౌతిక దూరానికి రాం రాం
నర్సీపట్నం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌(తురకబడి) తరగతి గదిలో దగ్గరగా కుర్చున్న విద్యార్థినులు

పాఠశాలల్లో కనిపించని కొవిడ్‌ నిబంధనలు


కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ దఫా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది వైరస్‌ బారినపడుతున్నారు. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనల అమలు తీరును ‘ఆంధ్రజ్యోతి’ బృందం గురువారం పరిశీలించగా విద్యార్థులు మాస్కులు ధరిస్తున్నప్పటికీ, భౌతిక దూరం పాటించడం లేదని తేలింది. అంతేకాదు విద్యార్థుల చేతులను శానిటైజ్‌ చేయడం, వారి ఉష్ణోగ్రతను పరిశీలించడంలోనూ నిర్లక్ష్యం కనిపించింది.


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

కరోనా రెండో దశ విజృంభణతో పాఠశాలల నిర్వాహకులు అప్రమత్తమయ్యారు.  ప్రతి విద్యార్థీ మాస్క్‌ ధరించాలన్న నిబంధన విధించారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల చేతులను శానిటైజ్‌ చేస్తున్నారు. అయితే కరోనాను ఎదుర్కోవడంలో ముఖ్యమైనది భౌతికదూరం పాటించడం...ఇది మాత్రం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కనిపించడం లేదు. విద్యార్థులు ఎక్కువగా వున్నచోట గదులు లేకపోవడం సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల ప్రధానోపాధ్యాయులు అప్రమత్తమై పదో తరగతి మినహా మిగిలిన తరగతుల విద్యార్థులకు రోజు తప్పించి రోజు పాఠాలు బోధిస్తున్నారు. చంద్రంపాలెం, గాజువాక, ఎలమంచిలిలో రోజు విడిచి రోజు తరగ తులు జరుగుతున్నాయి. జిల్లాలో కరోనా ఉధృతి నేప థ్యంలో పాఠశాలల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినట్టు ఇన్‌చార్జి డీఈవో/ఆర్జేడీ నాగేశ్వరరావు తెలిపారు. విద్యార్థులు ఎక్కువగా ఉన్నచోట రోజు విడిచి రోజు తరగతుల నిర్వహణకు అనుమతి ఉందన్నారు. 45 సంవత్సరాలు దాటిన ఉపా ధ్యాయులంతా వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించామన్నారు. దీనిపై ఎంఈవోలను అప్రమత్తం చేస్తామన్నారు. 


కొన్ని చోట్ల అలా...మరిన్ని చోట్ల ఇలా...

పాడేరు మండలంలోని కొన్ని పాఠశాలలు కొవిడ్‌ నిబంధనలను అమలు చేస్తుండగా మరికొన్ని పాఠశాలల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో స్పష్టమైంది. పాడేరులోని గుడివాడ ఎంపీపీ స్కూల్‌లో విద్యార్థులు మాస్క్‌లు ధరించారు. ఇక్కడ శానిటైజర్‌, ఉష్ణోగ్రతను పరిశీలించే పరికరాలున్నప్పటికీ వినియోగించడం లేదు. అక్షర ప్రైవేటు పాఠశాలలోనూ ఇదే పరిస్థితి.


చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు గురువారం చాలామంది విద్యార్థులు మాస్కులు లేకుండానే వచ్చారు. ఉపాధ్యాయులు కూడా మాస్కులు ధరించడం లేదు. ఉన్నత పాఠశాలలో భౌతికదూరం పాటించడం లేదు. గుంపులుగా కూర్చుని భోజనం చేస్తున్నారు. వడ్డాది కేఏడీ జడ్పీ ఉన్నత పాఠశాలలో థర్మల్‌ స్ర్కీనింగ్‌, భౌతికదూరం పాటించడం లేదు.  


నర్సీపట్నంలోని పాఠశాలల్లో విద్యార్థులు భౌతికదూరం, మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నత పాఠశాల (తురకబడి)లో గురువారం బెంచీకి ముగ్గురు చొప్పున కూర్చున్నారు. విద్యార్థులకు శానిటైజర్‌, థర్మల్‌ స్ర్కీనింగ్‌ ఉపయోగిస్తున్నారు. శివపురం మాంటీస్సోరి ప్రైవేటు పాఠశాలలోనూ భౌతికదూరం, మాస్కులపై శ్రద్ధ కనిపించడం లేదు.  


గాజువాకలో అప్రమత్తం

గాజువాక పారిశ్రామిక ప్రాంత ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలను పక్కాగా అమలుచేస్తున్నారు. గేటు వద్దే శానిటైజేషన్‌, థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసి అనుమతిస్తున్నారు. రెండు రోజులకు ఒకసారి తరగతి గదులను శానిటైజ్‌ చేయిస్తున్నారు.   


గోపాలపట్నంలోని జడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులంతా మాస్కులు ధరించి వస్తున్నారు. భౌతికదూరం పాటించడం లేదు. తరగతి గదుల్ని శానిటైజ్‌ చేయడం లేదు. 


జీవీఎంసీ పాఠశాలల్లో నిబంధనలు గాలికి....

నక్కవానిపాలెం జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో శానిటైజ్‌ చేయడం, థర్మల్‌ స్ర్కీనింగ్‌ కనిపించడం లేదు. మాస్కులు ధరిస్తున్నారు. శారద విద్యా నిలయంలో నిబంధనలు అమలవుతున్నాయి. 


మధురవాడలోని చంద్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో  కరోనా నిబంధనలు పక్కాగా అమలుచేస్తున్నారు. విద్యార్థుల చేతులను శానిటైజ్‌ చేసి,  టెంపరేచర్‌ పరిశీలించి అనుమతిస్తున్నారు. తరగతి గదిలో బెంచీకి ఇద్దరిని మాత్రమే కూర్చోబెడుతున్నారు.  


కనిపించని కరోనా భయం 

అనకాపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో పలువురు విద్యార్థులు, ఉపాఽధ్యాయులు వైరస్‌ బారినపడినా నిబంధనలు పాటించడం లేదు. భాష్యం పాఠశాల తరగతి గదుల్లో కొన్ని నిబంధనలు అమల తున్నాయి.

Updated Date - 2021-04-16T05:33:49+05:30 IST