విశాఖలో ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రుల దందా.. సెల్ఫీ వీడియోలో ఆవేదన

ABN , First Publish Date - 2020-08-10T22:43:28+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తుండటంతో

విశాఖలో ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రుల దందా.. సెల్ఫీ వీడియోలో ఆవేదన

విశాఖపట్నం : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తుండటంతో దీన్నే అదనుగా చేసుకుని చికిత్స చేస్తామంటూ ప్రైవేట్ ఆస్పత్రులు రోగుల నుంచి లక్షల రూపాయిలు దండుకుంటున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో ఇలా భారీగా డబ్బులు దండుకున్న రెండు ప్రైవేట్ ఆస్పత్రులకు కేసీఆర్ సర్కార్ షాకిచ్చింది. ఆ రెండు ఆస్పత్రుల్లో కరోనా వైద్యం చేయడానికి వీల్లేదని వేటు వేసింది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో ప్రైవేట్ ఆస్పత్రుల దందా వెలుగు చూసింది. సెల్ఫీ వీడియో ద్వారా కోవిడ్ లక్షణాల అనుమానిత బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.


అసలేం జరిగిందంటే..

ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే 11 రోజుల తర్వాత నెగిటివ్ అని రిజల్ట్ వచ్చింది. ప్రభుత్వాస్పత్రిలో చేరాలంటే పాజిటివ్ నిర్ధారణ సర్టిఫికెట్ కావాలని అధికారులు అడుగుతున్నారు. ఈ లోపు నేను చెస్ట్ స్కాన్ చేయిస్తే, కోవిడ్  ఐదవ దశ అని రిపోర్ట్ వచ్చింది. కోవిడ్ అనుమానంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాను. నాలుగు రోజులకు లక్షా 30 వేల రూపాయలు వసూలు చేశారు. నా అన్నయ్య వద్ద ఏకంగా 13 రోజులకి ఏడు లక్షలు విజయవాడలోని ఓ ఆస్పత్రిలో వసూలు చేశారు. దయచేసి ప్రైవేట్ ఆస్పత్రుల దందాను అరికట్టాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. ప్రభుత్వం ఆలస్యంగా రిపోర్టు ఇచ్చినందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది. నిజంగా పాజిటివ్ ఉన్న వాళ్లయితే ప్రాణాలు ప్రాణాలు పోవాల్సిందేనా..?. టెస్ట్‌లు చేసి త్వరగా రిపోర్టు ఇవ్వాలిఅని ఆ బాధితుడు సెల్ఫీ వీడియోలో డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారులు, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా.. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రిలో టెస్ట్ మొదలుకుని చికిత్స, రోజుకు బెడ్‌కు ఎంత తీసుకోవాలి..? ఇలా అన్నింటికి ధరలు ఖరారు చేసిన విషయం విదితమే.

Updated Date - 2020-08-10T22:43:28+05:30 IST