పోలీసుశాఖలో Covid కలకలం

ABN , First Publish Date - 2022-01-13T13:25:21+05:30 IST

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్న పోలీస్‌శాఖనే ఆ వైరస్‌ కమ్మేస్తోంది. ఆ శాఖకు చెందిన ఐపీఎస్‌ అధికారులు సహా, ఎంతోమంది పోలీసులకు కరోనా సోకగా, లెక్కకు రాని కేసులు ఇంతకు నాలుగింతలుండవచ్చని పోలీ

పోలీసుశాఖలో Covid కలకలం

- నగరంలోనే 160 మందికి పాజిటివ్‌ 

- ఐఐటీలో 58 మందికి సోకిన వైరస్‌


చెన్నై: కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్న పోలీస్‌శాఖనే ఆ వైరస్‌ కమ్మేస్తోంది. ఆ శాఖకు చెందిన ఐపీఎస్‌ అధికారులు సహా, ఎంతోమంది పోలీసులకు కరోనా సోకగా, లెక్కకు రాని కేసులు ఇంతకు నాలుగింతలుండవచ్చని పోలీసు వర్గాలే ఆందోళన చెందుతున్నాయి. మరీ ముఖ్యంగా రాజధాని నగరం చెన్నైలోని పోలీస్‌శాఖలో ఈ వైరస్‌ విస్త్రతంగా ఆందోళన రేపుతోంది. నగరంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక డ్యూటీల్లో పాల్గొంటున్న పోలీసులు వైరస్‌ తాకిడికి గురవుతున్నారు. రెండు రోజుల వ్యవధిలో నగరం మొత్తం 160 మంది పోలీసులు కరోనా బారినపడినట్లు తేలింది. వీరంతా ప్రస్తుతం నగరంలోని నాలుగు ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పోలీసు శాఖలో ఉన్నతాధికారులను సైతం కరోనా వైరస్‌ విడిచిపెట్టడం లేదు. మూడు రోజుల క్రితం ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు పాజిటివ్‌ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. తాజాగా ఓ డీసీపీ కరోనా తాకిడికి గురయ్యారు. మూడు రోజుల క్రితం నగరంలో కరోనా బాధిత పోలీసుల సంఖ్య 70 ఉండగా మంగళవారానికి 140, బుధవారం ఉదయానికి మరో 20 మంది పోలీసులకు పాజిటివ్‌ లక్షణాలు బయటపడటంతో మొత్తం బాధితుల సంఖ్య 160కి చేరింది. ఇదిలా ఉండగా పల్లావరం స్టేషన్‌లో పనిచేస్తున్న పోలీసులు జలుబు, దగ్గు, జ్వరంతో అస్వస్థతకు గురై అందరూ కరోనా  వైద్య పరీక్షలు చేయించుకున్నారు. బుధవారం ఉదయం వెలువడిన ఫలితాల్లో సీఐ సహా ఎనిమిది పోలీసులకు పాజిటివ్‌ లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. వెంటనే వీరిలో ఇద్దరిని ఆస్పత్రులకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 మంది పోలీసులు, కరోనా, ఒమైక్రాన్‌ బారినపడి చికిత్సలు పొందుతున్నట్లు పేర్కొన్నారు.


ఐఐటీ మద్రాస్‌లో...

స్థానిక ఐఐటీ మద్రాస్‌ విద్యా సంస్థలో 17 మంది విద్యార్థులు సహా 58 మంది పాజిటివ్‌తో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నెల ఐదు నుంచి తొమ్మిదో తేదీ వరకు ఆ విద్యా సంస్థలో వరుసగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా ఆ విద్యా సంస్థలో స్వల్ప అస్వస్థతకు గురైనవారందరికీ కొవిడ్‌ పరీక్షలు జరిపారు. ఆ ఫలితాలు బుధవారం ఉదయం రాగా 17 మంది విద్యార్థులు సహా 58 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఐఐటీ మద్రాసులో విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది రెండు వ్యాక్సిన్లు వేసుకున్నట్లు సర్టిఫికెట్‌ ఉంటేనే విద్యా సంస్థలోకి అనుమతి స్తామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-01-13T13:25:21+05:30 IST