కరోనాతో పోరాడుతూనే కలల కోసం ఆరాటం.. ఆసుపత్రిలోనే పుస్తకాలతో..

ABN , First Publish Date - 2021-05-01T01:12:37+05:30 IST

అందమైన గులాబీని పొందాలంటే.. ముందుగా దాని చుట్టూ ఉన్న ముళ్లను దాటాల్సిందే. జీవితంలో విజయం సాధించాలంటే కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. సక్సెస్ ఎవ్వరికీ అంత ఈజీగా రాదు. చెక్కుచెదరని సంకల్పంతోపాటు ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంటేనే విజయాన్ని ముద్దాడి,

కరోనాతో పోరాడుతూనే కలల కోసం ఆరాటం.. ఆసుపత్రిలోనే పుస్తకాలతో..

ఇంటర్నెట్‌డెస్క్: అందమైన గులాబీని పొందాలంటే.. ముందుగా దాని చుట్టూ ఉన్న ముళ్లను దాటాల్సిందే. జీవితంలో విజయం సాధించాలంటే కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. సక్సెస్ ఎవ్వరికీ అంత ఈజీగా రాదు. చెక్కుచెదరని సంకల్పంతోపాటు ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంటేనే విజయాన్ని ముద్దాడి, విజేతగా నిలవచ్చు. ఈ మాటలను ఓ యువకుడు బలంగా నమ్మాడు. ఓ వైపు కొవిడ్ మహమ్మారితో పోరాడుతూనే.. మరోవైపు విజేతగా నిలిచేందుకు పుస్తకాలతో కుస్తీ పడుతున్నాడు. ప్రస్తుతం అతనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. 


కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలోని గంజం జిల్లా కలెక్టర్ విజయ్ కులాంగే.. బెర్హంపూర్‌లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఓ యువకుడు పుస్తకాలతో కుస్తీ పట్టడాన్ని గమనించారు. అనంతరం సదరు యువడి వద్దకే నేరుగా వెళ్లి.. అసలు విషయాన్ని ఆరా తీశారు. సీఏ (చార్టెడ్ అకౌంటెంట్) పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్నట్టు తెలుసుకుని అతన్ని అభినందించాడు. అంతేకాకుండా అతనికి సంబంధించిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతోపాటు.. ‘సక్సెస్ ఎవ్వరికీ యాదృచ్ఛికంగా రాదు. అంకితభావంతో కష్టపడితేనే విజయం వరిస్తుంది. నేను కొవిడ్ ఆసుపత్రిని సందర్శించినప్పుడు ఈ వ్యక్తి సీఏ ఎగ్జామ్స్ కోసం సన్నద్ధం కావడాన్ని గుర్తించాను. నీ పట్టుదల నొప్పిని మాయం చేస్తుంది. ఆ తర్వాత విజయం ఒక ఫార్మాలిటీ మాత్రమే’ అని పేర్కొన్నారు. కాగా.. గంజం జిల్లా కలెక్టర్ విజయ్ కులాంగే ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన సదరు యువకుడి ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫిదా అవ్వడంతోపాటు అతని అంకితభావానికి సెల్యూట్ కొడుతూ కామెంట్ చేస్తున్నారు. 




Updated Date - 2021-05-01T01:12:37+05:30 IST