ఆసుపత్రి గేటు ముందే కరోనా రోగి మృతి

ABN , First Publish Date - 2021-04-14T16:58:12+05:30 IST

వైద్యుల నిర్లక్ష్యం వల్ల మరో కరోనా రోగి ఆసుపత్రి గేటు ముందే మృత్యువాత పడిన హృదయవిదారక ఘటన...

ఆసుపత్రి గేటు ముందే కరోనా రోగి మృతి

డాక్టర్లను పిలిచినా రాకపోవడంతో నా తండ్రి విలవిల్లాడుతూ మృతి చెందారు...కుమార్తె ఆవేదన

రాంచీ (జార్ఖండ్): వైద్యుల నిర్లక్ష్యం వల్ల మరో కరోనా రోగి ఆసుపత్రి గేటు ముందే మృత్యువాత పడిన హృదయవిదారక ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ నగరంలోని సదర్ ఆసుపత్రి గేటు వద్ద జరిగింది. హజారీబాగ్ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల వయసుగల పవన్ గుప్తా అనే కొవిడ్ రోగిని చికిత్స కోసం ఆయన కుమార్తె రాంచీలోని సదర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. కరోనాతో బాధపడుతూ ఆసుపత్రి గేటు వద్దనే పవన్ గుప్తా విలవిల్లాడుతూ  ఆసుపత్రి గేటు వద్ద తుదిశ్వాస విడిచారు. జార్ఖండ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బన్నా గుప్తా సదర్ కొవిడ్ ఆసుపత్రి తనిఖీ కోసం వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. 


‘‘మంత్రి గారు...కరోనా రోగి అయిన నా తండ్రికి చికిత్స చేయమని డాక్టర్లను అర్దగంట పాటు అభ్యర్థించినా వారెవరూ రోగి వద్దకు వచ్చి చికిత్స చేయ లేదు, దీంతో మా నాన్న విలవిల్లాడుతూ ఆసుపత్రి గేటు వద్దనే తుదిశ్వాస విడిచారు. మీరు మాత్రం ఓట్లు అడిగేందుకు మాత్రమే వస్తారు’’ అని కరోనా మృతుడు పవన్ గుప్తా కుమార్తె ఆరోపించారు. కరోనా బారిన పడిన తన తండ్రిని కాపాడండి అంటూ డాక్టర్లను రోదిస్తూ వేడుకుంటున్న మృతుడి కుమార్తె వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


ఆసుపత్రి ముందు తండ్రి మృతి చెందటంతో కుమార్తె రోదిస్తున్న దృశ్యాన్ని చూసి చలించిన ఆరోగ్యశాఖ మంత్రి బన్నాగుప్తా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. కొవిడ్ రోగికి సత్వరం చికిత్స అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకుంటామంతి మంత్రి బన్నాగుప్తా చెప్పారు.జార్ఖండ్ రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే 2,366 కరోనా కేసులు వెలుగుచూశాయి. మంగళవారం ఒక్కరోజే 19 మంది మరణించడం మృతుల సంఖ్య 1232 కు పెరిగింది.

Updated Date - 2021-04-14T16:58:12+05:30 IST