Abn logo
May 6 2021 @ 01:11AM

నరకయాతన

  జిల్లాను వేలల్లో కమ్మేస్తున్న కొవిడ్‌ కేసులు

 పల్లె, పట్నం, నగరం తేడా లేకుండా పీడించేస్తున్న మహమ్మారి

  ఐసీయూ, ఆక్సిజన్‌ నిండిపోవడంతో కొత్త బాధితుల అగచాట్లు

  పడకలు దొరక్క పడే కష్టాలు వర్ణనాతీతం

  పొంచి వున్న ఆక్సిజన్‌ కొరత

(కాకినాడ, ఆంధ్రజ్యోతి) జిల్లాపై కొవిడ్‌ పీడ కొనసాగుతోంది. మహమ్మారి దయాదాక్షిణ్యాలు లేకుండా విరుచుకు          పడుతోంది. ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాలనూ కమ్మేస్తూ కకావికలం చేస్తోంది. వేలాది                      మందిని ఆసుపత్రులపాల్జేస్తోంది. తీరా అక్కడ పడకలు దొరక్క బయట పడిగాపులు కాస్తూ బాధితులు నరకయాతన పడుతున్నారు. సకాలంలో బెడ్లు దొరక్క కొందరైతే కూర్చున్న చోటనే కన్నుమూస్తున్నారు. ఇలా ఒకరిద్దరు కాదు ఎన్నో కుటుంబాల్లో కొవిడ్‌ కన్నీటిని           మిగుల్చుతోంది. అంతులేని విషాదాన్ని నింపుతోంది. జిల్లాలో ఏరోజుకారోజు పాజిటివ్‌లు వేలల్లో వస్తుండడంతో అప్పటివరకు కొవిడ్‌ చికిత్స అందిస్తున్న కాకినాడ జీజీహెచ్‌, రాజమహేంద్రవరం డీహెచ్‌ కాకుండా మూడు దశల్లో మొత్తం 75 ప్రైవేటు ఆసుపత్రులకు కొవిడ్‌ చికిత్సకు కలెక్టర్‌ అనుమతులు ఇచ్చారు. అయితే ఇప్పుడు వీటన్నింటిలో ఐసీయూ, ఆక్సిజన్‌ బెడ్లన్నీ నిండిపోయాయి. దీంతో కొత్తగా వచ్చే కొవిడ్‌ బాధితులకు ఇక్కడ పడక దొరకట్లేదు. ముఖ్యంగా జీజీహెచ్‌, డీహెచ్‌, కిమ్స్‌, జీఎస్‌ఎల్‌ల్లో అన్ని             పడకలు ఫుల్‌ అయిపోయాయి. పోనీ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్దామంటే లక్షలకు లక్షల బిల్లులు వేస్తున్నారు. అయినా ధైర్యం చేసే వెళ్తే అక్కడా పడక దొరకడం లేదు. దీంతో ఏంచేయాలో తెలియక బాధితులు నరకయాతన అనుభవిస్తున్నారు. పోనీ ఒకటి, రెండు రోజులు ఉంటే పడక దొరుకుతుందనే ధైర్యం కూడా బాధితులకు ఉండడం లేదు. ఒకవేళ ఖాళీ అయినా ఎవరో పైనుంచి చెప్పించుకుంటే వారికి మాత్రం బెడ్‌ దొరుకుతోంది. సామాన్యుల పరిస్థితి మాత్రం భయానకంగా మారింది. అటు బుధవారం నాటికి జిల్లాలో మొత్తం 77 కొవిడ్‌ ఆసుపత్రుల్లో 651 ఐసీయూ పడకలకు గాను 242 అందుబాటులో ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. తీరాచూస్తే అవన్నీ ఊరుపేరు లేని చిన్నాచితకా ఆసుపత్రులే. దీంతో పేరుకు అందుబాటులో ఉన్నా చికిత్స అందుతున్న నమ్మకం ఉండడం లేదని బాధితులు వాపోతున్నారు. ఆక్సిజన్‌ పడకల విషయానికి వస్తే మొత్తం 2,677 బెడ్లకు గాను 471 ఖాళీగా ఉన్నట్టు చూపిస్తున్నారు. కానీ ఇవేవీ పేరు మోసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం కాదు. మరోపక్క రోజువారీ కేసులేమో వేలల్లో ఉంటున్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్‌ పడక కోసం వస్తున్న బాధితులు ఇక్కడి పరిస్థితి చూసి రోదిస్తున్నారు. అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడక దొరక్క, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేక దేవుడిపై భారం వేస్తున్నారు.
మరోపక్క రోజురోజుకూ పెరిగిపోతున్న బాధితులతో ఆక్సిజన్‌ వినియోగం సైతం భారీగా పెరిగిపోతోంది. రోజుకు 40 కిలో లీటర్లకు మించిపోతోంది. కానీ లభ్యత మాత్రం                 పెరగడం లేదు. అటు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి జిల్లాకు రావలసిన ట్యాంకర్ల విషయంలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో అధికారులు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ పడకలపై ఉన్న కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ కొరతతో ప్రాణవాయువు అందించలేమని, వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లిపోవాలని ఆయా యాజమాన్యాలు చెబుతుండడంతో ఎక్కడికి            తీసుకువెళ్లాలో తెలియక, పడకలు దొరక్క నానా అగచాట్లు పడుతున్నారు.

Advertisement