అందరికీ వైద్యం అందాలి

ABN , First Publish Date - 2021-04-17T05:28:03+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ణ్యా కరోనా నివారణ చర్యల్లో భాగంగా కలెక్టర్‌ చక్రధర్‌బాబు వైద్య సేవలు అందించే ఆసుపత్రుల జాబితాను శుక్రవారం విడుదల చేశారు.

అందరికీ వైద్యం అందాలి
కొవిడ్‌ నివారణ ప్రత్యేక అధికారి అనంతరాముకు పుష్పగుచ్ఛం అందచేస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

కొవిడ్‌, నాన్‌కొవిడ్‌ ఆసుపత్రుల్లో వైద్యసేవలు

నిబంధనలు పాటించాలి : కలెక్టర్‌

వైద్యశాలల జాబితా విడుదల


నెల్లూరు(వైద్యం/హరనాథపురం), ఏప్రిల్‌ 16 : జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ణ్యా కరోనా నివారణ చర్యల్లో భాగంగా కలెక్టర్‌ చక్రధర్‌బాబు వైద్య సేవలు అందించే ఆసుపత్రుల జాబితాను శుక్రవారం విడుదల చేశారు. జిల్లాలోని ఆసుపత్రులను మూడు విభాగాలుగా విభజించి వాటికి తగిన సూచనలు జారీ చేశారు. కేటగిరి-ఏ వైద్యశాలలు ప్రత్యేకంగా కొవిడ్‌ చికిత్స మాత్రమే అందించాలని, కేటగిరి-బీ వైద్యశాలల్లో కొవిడ్‌, నాన్‌కొవిడ్‌ వ్యాధులకు చికిత్స అందించాలని, కేటగిరి-సీ వైద్యశాలల్లో నాన్‌కొవిడ్‌ వ్యాధులకు మాత్రమే వైద్యం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రైవేట్‌ వైద్యశాలల్లో  జీవోనెం.77, 78 ప్రకారం మాత్రమే కొవిడ్‌ బాధితుల నుంచి ఫీజులు వసూలు చేయాలని హెచ్చరించారు. కొవిడ్‌ లక్షణాలతో రోగులు వచ్చిన 10 నిమిషాల్లో వారికి బెడ్‌ కేటాయించాలని సూచించారు. ప్రతి వైద్యశాలలోనూ 24 గంటలు అందుబాటులో ఉండేలా హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు కొవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం భోజనం మెనూని తప్పక అమలు చేయాలన్నారు. కొవిడ్‌, నాన్‌ కొవిడ్‌ వ్యాధులతో బాధపడే వారందరికీ నిబంధనల మేరకు వైద్యసేవలు అందించాలని ఆదేశించారు.

 

వైద్యశాలల ఇవే...

కేటగిరి-ఏ(కొవిడ్‌ చికిత్స మాత్రమే అందించేవి) 

నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల, డాక్టర్‌ విజయకుమార్‌ మెమోరియల్‌ వైద్యశాల, రవి చెస్ట్‌ వైద్యశాల, శ్రీరామ్‌ స్సెషాలిటీ వైద్యశాల, అనసూయ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌. కావలిలోని ఏరియా వైద్యశాల. వీటిలో మొత్తం 1104 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి.


కేటగిరి-బీ (కొవిడ్‌, నాన్‌కొవిడ్‌ కేసులకు చికిత్స)

నెల్లూరులోని మెడికవర్‌ వైద్యశాల, అపోలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, జయభారత్‌ వైద్యశాల, విజయకృష్ణ వైద్యశాల, నారాయణ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌, కిమ్స్‌ వైద్యశాల, రిచ్‌ హాస్పిటల్‌, సెయింట్‌ జోసఫ్స్‌ జనరల్‌ వైద్యశాల, ఆత్మకూరులోని జిల్లా వైద్యశాల, శ్రీవెంకటేశ్వర ప్రజావైద్యశాల, అభిరామ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, గూడూరులోని మైథిలీ వైద్యశాల, అమరావతి హాస్పిటల్‌, నాయుడుపేటలోని ట్రినిటీ వైద్యశాల, కావలిలోని కందుకూరి వైద్యశాల. వీటిలో 2160 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. 


కేటగిరి-సీ (అన్నీ నాన్‌ కొవిడ్‌ కేసులే..)

నెల్లూరులోని నిజామ్స్‌ స్టార్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌, విజయ కేర్‌ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌, విజేత హాస్పిటల్‌, అరవింద కిడ్నీ కేర్‌ సెంటర్‌. వీటిలో 162 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయని కలెక్టర్‌ తెలిపారు. ఈ మూడు కేటగిరీల వైద్యశాలల్లో 3426 బెడ్స్‌ అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు. 


కొవిడ్‌ ప్రత్యేకాధికారిగా అనంతరాము

జిల్లాలో కొవిడ్‌ నియంత్రణకు సంబంధించి ప్రత్యేక అధికారిగా ఒకప్పటి కలెక్టర్‌ అనంతరాము నియమితులయ్యారు. శుక్రవారం నెల్లూరుకు వచ్చిన ఆయనను ఓ హోటల్‌లో కలెక్టర్‌ చక్రధర్‌బాబు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. 


354 కేసులు: ఇద్దరి మృతి

జిల్లాలో కరోనా కేసుల ఉధృతి రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ ఏడాదిలోనే అత్యధికంగా శుక్రవారం 354 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరోవైపు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా ఇద్దరు కొవిడ్‌ కాటుకు మృత్యువాత పడ్డారు. కరోనా నుంచి కోలుకున్న 95 మందిని అధికారులు డిశ్చార్జ్‌ చేశారు.


వైద్య విద్యార్థులకు 

నేటి నుంచి ఆన్‌లైన్‌ తరగతులు

కరోనా తీవ్రమవుతున్న కారణంగా వైద్య విద్యార్థులకు శనివారం నుంచి నెల రోజులపాటు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రకటించింది. దీనికి సంబంధించి నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల కూడా ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. హాస్టల్‌లో ఉన్న 400 మందికిపైగా విద్యార్థుల్లో కొంత మంది ఇప్పటికే  ఇళ్లకు వెళ్లిపోగా మిగిలిన వారు శనివారం వెళ్లనున్నారు. కరోనా ప్రభావం మరింత ఎక్కువైతే ఆన్‌లైన్‌ క్లాసులను మరికొంతకాలం పొడిగించే అవకాశం ఉంది.  

Updated Date - 2021-04-17T05:28:03+05:30 IST