వరుసగా 3 రోజులు లక్షణాల్లేకుంటే నెగెటివే

ABN , First Publish Date - 2022-01-20T08:21:52+05:30 IST

రాష్ట్రంలో ఒమైక్రాన్‌ కరోనా వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈనేపథ్యంలో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన చాలామంది.. తమకు సోకింది ఒమైక్రానా ?..

వరుసగా 3 రోజులు లక్షణాల్లేకుంటే నెగెటివే

మూడో వేవ్‌లో హోం ఐసొలేషన్‌ వారమే.. ఆ తర్వాత నెగెటివ్‌ రిపోర్టు లేకున్నా బయటకు 

  ఒమైక్రాన్‌ లక్షణాలు మొదటి 2-3 రోజులే 

 హైరిస్క్‌ గ్రూపు వారు తేలిగ్గా తీసుకోవద్దు

  3 రోజుల పాటు జ్వరం 

తగ్గకుంటే ఆస్పత్రుల్లో చేరాలి

8 వైద్యనిపుణుల సూచనలు 


హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఒమైక్రాన్‌ కరోనా వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈనేపథ్యంలో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన చాలామంది.. తమకు సోకింది ఒమైక్రానా ? కాదా ? అనేది నిర్ధారించాలని వైద్యులను అడుగుతున్నారు. కరోనా రెండో వేవ్‌ సమయంలో ఇన్ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆస్పత్రుల్లో చేరికలు భారీగా జరిగాయి. ఈసారి తేలికపాటి నుంచి మోస్తరు ఇన్ఫెక్షన్లే ఉండటంతో ఆస్పత్రుల్లో చేరికలు ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నాయి. వరుసగా 3 లేదా అంతకంటే ఎక్కువ రోజులపాటు 100 డిగ్రీల జ్వరం ఉంటే వెంటనే ఆస్పత్రుల్లో చేరాలని వైద్యులు సూచిస్తున్నారు. తీవ్రమైన దగ్గు, జర్వం ఉన్నా నిర్లక్ష్యం చేయొద్దని సూచిస్తున్నారు. 

మూడోవేవ్‌లో కనిపిస్తున్న లక్షణాలివే..

ప్రస్తుతం నమోదయ్యే కేసుల్లో 95 శాతానికిపైగా ఒమైక్రాన్‌ వేరియంట్‌వే ఉంటున్నాయి. గొంతులో గరగర, బాడీ పెయిన్స్‌, తలనొప్పి, ముక్కుకారడం, పొడి దగ్గురావడం, జ్వరం లాంటివి ప్రస్తుత వేవ్‌లో కరోనా లక్షణాలుగా కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొందరిలో మాత్రం 4-5 రోజుల పాటు ఒళ్లు నొప్పులు ఉంటున్నాయని అంటున్నారు. జ్వరం కూడా ఒకటి రెండు రోజుల తర్వాత తగ్గిపోతోందని, వైరల్‌ లోడ్‌ అంతా గొంతులోనే ఉండటంతో ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్‌ సోకడం లేదని వివరిస్తున్నారు. అందుకే ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రుల్లో అడ్మిషన్లు తక్కువగా ఉంటున్నాయని పేర్కొంటున్నారు. ఒమైక్రాన్‌ వేవ్‌ మొదలైనప్పటి నుంచి కొన్ని దేశాలు హోం ఐసొలేషన్‌, టెస్టింగ్‌ ప్రొటోకాల్‌ను మార్చేశాయి. యూకే దేశమైతే కొవిడ్‌ నిబంధనలను సరళీకృతం చేసింది. రెండు డోసులు తీసుకున్న అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు పరీక్షలు చేయడం లేదు. హైరిస్కు గ్రూపు వారికే హోం ఐసొలేషన్‌, టెస్టింగ్‌ ప్రక్రియను కొనసాగిస్తోంది. 


ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం.. 

భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) మార్గదర్శకాల ప్రకారం.. ఆక్సిజన్‌ స్థాయులు 93 శాతం కంటే తక్కువగా ఉంటే వెంటనే ఆస్పత్రుల్లో చేరాలని చెబుతున్నారు. కనీసం 6 నిమిషాల పాటు నడిచిన తర్వాత ఆక్సిజన్‌ స్థాయులను నిర్ధారించుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. అప్పుడు మాత్రమే ప్రాణవాయువు స్థాయులపై సరైన నిర్ధారణకు రావచ్చని అంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం కొవిడ్‌ లక్షణాలు ఎక్కువగా కనిపించినా ఆలస్యం చేయకుండా ఆస్పత్రుల్లో చేరాలని సలహా ఇస్తున్నారు. తేలికపాటి లక్షణాలున్న వారు 7 రోజుల పాటు హోం ఐసొలేషన్‌లో ఉంటే సరిపోతుందని, ఆ తర్వాత నెగెటివ్‌ రిపోర్టు లేకున్నా రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని ఐసీఎంఆర్‌ చెబుతోంది. పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారికి హోం ఐసొలేషన్‌లో చివరి మూడు రోజుల పాటు ఎటువంటి ఇన్ఫెక్షన్‌ లక్షణాలు లేకుంటే నెగెటివ్‌గా భావించవచ్చని అంటోంది. వీరు కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు లేకున్నా.. హోం ఐసొలేషన్‌ నుంచి బయటకు రావచ్చని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది. 


3 రోజుల్లోనే కోలుకుంటున్నారు 

‘‘ప్రస్తుతం కొవిడ్‌ రోగులు మూడు రోజుల్లోనే కోలుకుంటున్నారు. లక్షణాల ఆఽధారంగానే చికిత్స అందిస్తున్నాం. గతంలో మాదిరిగా స్టెరాయిడ్స్‌, యాంటీబాడీస్‌, మోనోక్లోనల్‌ యాంటీబాడీ కాక్‌ టెయిల్‌ వంటివి ఇప్పుడు అవసరం పడటం లేదు. సీట్‌ స్కాన్స్‌  కూడా రిఫర్‌ చేయడం లేదు. కిడ్నీ, కేన్సర్‌లాంటి దీర్ఘకాలిక జబ్బులున్నవారు భయం కొద్దీ ఆస్పత్రుల్లో మాదగ్గర అడ్మిట్‌ అవుతున్నారు.’’

- డాక్టర్‌ పరంజ్యోతి, ప్రొఫెసర్‌, హెచ్‌వోడీ, 

పల్మనరీ మెడిసిన్‌, నిమ్స్‌ ఆస్పత్రి, హైదరాబాద్‌


వాళ్లు ఒమైక్రాన్‌ను 

తేలిగ్గా తీసుకోవద్దు

‘‘ ఒమైక్రాన్‌ వ్యాప్తి పెరిగింది. దీర్ఘకాలిక వ్యాధులున్న పలువురిలో ఇన్ఫెక్షన్‌ తీవ్రతరమవుతోంది. హైరిస్కు గ్రూపు వారు  ఒమైక్రాన్‌ను తేలిగ్గా తీసుకోవద్దు.  బూస్టర్‌ డోసు వేసుకోవాలి. దక్షిణాఫ్రికాలో కరోనాతో చనిపోయిన వారిలో 64 శాతం, యూకేలో మృతిచెందిన 90 శాతం మంది 60 ఏళ్లకు పైబడిన వారే. కనుక ఆ వయోవర్గం జాగ్రత్తగా ఉండాలి.’’

- డాక్టర్‌ మాదల కిరణ్‌, హెచ్‌వోడీ, 

క్రిటికల్‌ కేర్‌, నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి

Updated Date - 2022-01-20T08:21:52+05:30 IST