‘ఆలస్యం’తో అంటిస్తున్నారు!

ABN , First Publish Date - 2022-01-20T08:14:47+05:30 IST

హైదరాబాద్‌ పరిధిలో కొవిడ్‌ కేసులుపెరుగుతున్నాయి. ఒమైక్రాన్‌ వేవ్‌ నేపథ్యంలో జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ప్రజలందరూ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ కేంద్రాలకు భారీగా తరలివెళ్తున్నారు...

‘ఆలస్యం’తో అంటిస్తున్నారు!

ప్రభుత్వ కేంద్రాల్లో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష

చేయిస్తే 4-6 రోజుల తర్వాతే ఫలితం

ఈలోగా ఇతరులకు సోకుతున్న వైరస్‌ 

ప్రైవేటు సెంటర్లకు వేలాది మంది

3 రోజులు లక్షణాల్లేకుంటే నెగెటివే

ఆ తర్వాత నెగెటివ్‌ రాకున్నా బయటకు 

హోం ఐసొలేషన్‌ వారమే: వైద్యులు


బంజారాహిల్స్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ పరిధిలో కొవిడ్‌ కేసులుపెరుగుతున్నాయి. ఒమైక్రాన్‌ వేవ్‌ నేపథ్యంలో జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ప్రజలందరూ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ కేంద్రాలకు భారీగా తరలివెళ్తున్నారు. కొంతమంది ప్రభుత్వ కేంద్రాల్లో యాంటిజెన్‌, ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆర్‌టీపీసీఆర్‌ చేయించుకుంటున్నవారికి ఫలితాలు రావడానికి నాలుగు నుంచి ఆరు రోజుల దాకా పడుతుండడమే సమస్యగా మారింది. ఆర్థిక పరిస్థితుల వల్లనో, గత్యంతరం లేకనో రిపోర్టు వచ్చేలోపు చాలామంది ఉద్యోగాలకు, ఉపాధి పనులకు వెళ్తున్నారు. దీంతో వీరందరి నుంచి వైరస్‌ ఇతరులకు సోకుతూ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. 


రోజుకు 40 వేల టెస్టులు

గ్రేటర్‌ పరిధిలోని గాంధీ, ఫీవర్‌, నేచర్‌ క్యూర్‌, కింగ్‌కోఠి, ఉస్మానియా, సరోజినిదేవి ఆస్పత్రులతోపాటు యూపీహెచ్‌సీల్లో రోజుకు సుమారు 35 వేల నుంచి 40వేల ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు చేస్తున్నారు. చాలా చోట్ల సేకరించిన నమూనాలను ఫీవర్‌  హాస్పిటల్‌ లాంటి పెద్దాస్పత్రులకు పంపించి కొవిడ్‌ను నిర్ధారిస్తున్నారు. దీంతో ఫలితం రావడానికి చాలా సమయం పడుతోంది. అదే ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో చేయించుకుంటే ఒకరోజులోపే ఫలితం వస్తోంది. ప్రభుత్వ కేంద్రాల్లో తగినంత మంది సిబ్బంది లేకపోవడమే ఈ ఆలస్యానికి కారణమనే వాదన వినిపిస్తోంది. అదే నిజమైతే.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అర్హత కలిగిన ల్యాబ్‌టెక్నీషియన్లను పెద్ద ఎత్తున కాంట్రాక్ట్‌ పద్ధతిలో నిర్ణీత కాలానికి నియమించుకుని ఒక్క రోజు వ్యవధిలో ఆర్‌టీపీసీఆర్‌ ఫలితాలు వెల్లడిస్తే బాగుంటుందని నగరవాసులు కోరుతున్నారు. తద్వారా కొవిడ్‌ కేసుల వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రైవేట్‌లో పరీక్షలు చేయించుకునే ఆర్థిక స్తోమత లేని నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని ఫలితాలను త్వరితగతిన వెల్లడించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


హైదరాబాద్‌లో ఉండే ఓ సీనియర్‌ రాజకీయ నాయకుడికి వారం క్రితం కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకునేందుకు బంజారాహిల్‌్స్‌లోని యూపీహెచ్‌సీకి వెళ్లారు. అక్కడ వైద్య సిబ్బంది ఆయన నుంచి నమూనా తీసుకున్నారు. పరీక్ష చేయించుకున్న నాలుగు రోజుల తర్వాత.. కరోనా ‘పాజిటివ్‌’ అని ఆయన మొబైల్‌కు మెసేజ్‌ వచ్చింది. ఈ నాలుగు రోజుల్లో సదరు నేతకు సన్నిహితంగా మెలిగిన కుటుంబసభ్యులు, పార్టీ కార్యకర్తలు తీవ్రఆందోళనకు గురయ్యారు. వారందరూ కొవిడ్‌ టెస్టులు చేయించుకోగా.. మరో నలుగురైదురికి పాజిటివ్‌ వచ్చింది.


పాతబస్తీ గౌలిపుర ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల మహిళ కరోనా అనుమానిత లక్షణాలతో ఈ నెల 10న లలితాబాగ్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకుంది. 48 గంటల్లోపు ఫలితం వస్తుందని వైద్య సిబ్బంది ఆమెకు చెప్పారు. 48 గంటల్లోగా మెసేజ్‌ రాకపోతే కరోనా నెగెటివ్‌గా భావించాలని సూచించారు. 12నాటికి మొబైల్‌కు ఎలాంటి మెసేజ్‌ రాకపోవడంతో కరోనా నెగెటివ్‌గా భావించిన సదరు మహిళ కుటుంబసభ్యులతో కలివిడిగా తిరిగింది. తీరా 17వ తేదీ మధ్యాహ్నం ఆమె మొబైల్‌కు కరోనా పాజిటివ్‌ అని మెసేజ్‌ రావడంతో ఒక్కసారిగా వణికిపోయింది.

ఫిలింనగర్‌కు చెందిన ఓ నిరుపేద కుటుంబంలో ఇద్దరికి తీవ్ర జ్వరం వచ్చింది. వారు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టు చేయించుకున్నారు. ఒకరికి పాజిటివ్‌.. మరొకరికి నెగెటివ్‌ వచ్చింది. దీంతో వైద్య సిబ్బంది ఇద్దరికీ ఆర్‌టీపీసీఆర్‌ టెస్టు చేశారు. ఆ తర్వాత ఆరు రోజులకు ఇద్దరికీ పాజిటివ్‌ అని రిపోర్టు వచ్చింది. అయితే.. యాంటిజెన్‌ టెస్టులో నెగెటివ్‌ వచ్చిన వ్యక్తి పరీక్ష చేయించుకున్న రోజు నుంచి కూలీ పనికి వెళ్లాడు. ఆ వ్యక్తికి ఆర్‌టీపీసీఆర్‌లో పాజిటివ్‌ అని తేలడంతో ఈ ఆరు రోజుల్లో అతడి నుంచి ఎంత మందికి కరోనా అంటుకుందో తెలియని పరిస్థితి.

Updated Date - 2022-01-20T08:14:47+05:30 IST