ఒమైక్రాన్‌కు భయపడొద్దు

ABN , First Publish Date - 2022-01-20T08:16:25+05:30 IST

కరోనా, ఒమైక్రాన్‌ వ్యాధులకు భయపడొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ ప్రభుత్వాసుప్రతిని తనిఖీ చేశారు. ..

ఒమైక్రాన్‌కు భయపడొద్దు

ప్రభుత్వమే చికిత్స చేయిస్తుంది

 2 కోట్ల కరోనా కిట్లు సిద్ధం: మంత్రి హరీశ్‌ 

సిద్దిపేట రూరల్‌/గజ్వేల్‌, జనవరి 19: కరోనా, ఒమైక్రాన్‌ వ్యాధులకు భయపడొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ ప్రభుత్వాసుప్రతిని తనిఖీ చేశారు. అలాగే పుల్లూరులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడుతూ కరోనా సోకినా హైరానా పడి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బును వృథా చేసుకోవద్దని హితవు పలికారు. ఎంతమందికైనా చికిత్స అందించేందుకు సర్కారు సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం ఉత్తమ చికిత్స అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రెండు కోట్ల కరోనా టెస్టింగ్‌ కిట్లు, కోటి హోం ఐసోలేషన్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటిని అన్ని ఏఎన్‌ఎం సెంటర్లు, పీహెచ్‌సీలు, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. లక్షణాలు కనిపించగానే సమీపంలోని కేంద్రానికి వెళ్లి కరోనా టెస్ట్‌ చేయించుకోవాలని సూచించారు. చాలావరకు హోం ఐసొలేషన్‌ కిట్‌తోనే వ్యాధి తగ్గిపోతుందన్నారు. అవసరమైన వారు ప్రభుత్వాసుప్రతిలో చేరాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో ఐసీయూలు ఏర్పాటు చేశామని, ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీకాలు తీసుకోవాలన్నారు. 60 సంవత్సరాలు నిండిన వారు బూస్టర్‌ డోస్‌ వేసుకోవాలన్నారు. జాతీయ సగటుతో పోల్చితే తెలంగాణలో రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉన్నదన్నారు. 

Updated Date - 2022-01-20T08:16:25+05:30 IST