Abn logo
Nov 23 2021 @ 02:26AM

దీర్ఘకాల వ్యాధులున్న పిల్లలకు జనవరి నుంచి కొవిడ్‌ టీకా

మార్చిలో అందరు పిల్లలకూ పంపిణీ ప్రారంభం

2 వారాల్లో టీకా సాంకేతిక సలహా కమిటీ భేటీ

వయోజనులకు బూస్టర్‌ డోసు పైనా నిర్ణయం!

‘బూస్టర్‌’పై శాస్త్రీయ ఆధారాల్లేవు: ఐసీఎంఆర్‌


న్యూఢిల్లీ, నవంబరు 22: చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకున్నాయి.. ప్రాథమిక తరగతుల విద్యార్థులకూ ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. మరోవైపు థర్డ్‌ వేవ్‌ వస్తే.. పిల్లలపై ప్రభావం ఉంటుందన్న అంచనాలున్నాయి. వయోజనుల్లో 43 శాతం పైనే టీకా రెండు డోసులు పొందారు. 82 శాతం పైగా కనీసం ఒక డోసు టీకా తీసుకున్నారు. ఇక మిగిలింది చిన్నారులే..! ఈ నేపథ్యంలో వారికీ త్వరలోనే వ్యాక్సినేషన్‌ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర అధికార వర్గాల సమాచారం ప్రకారం.. దీర్ఘకాల వ్యాధులున్న పిల్లలకు జనవరి నుంచి కొవిడ్‌ టీకా పంపిణీ ప్రారంభం కానుంది. మార్చి నుంచి అందరు పిల్లలకూ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. టీకా పంపిణీపై ఏర్పాటైన జాతీయ సలహా సంఘం (ఎన్‌టీఏజీఐ) రెండు వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకోనుంది. ఇదే సమయంలో వయోజనులకు మూడో (బూస్టర్‌) డోసు పైనా సమగ్ర విధానాన్ని ప్రకటించనుంది. కాగా, ఇప్పటికే పలు దేశాల్లో బూస్టర్‌ ఇవ్వడం ప్రారంభమైనందున ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.


దీర్ఘకాల వ్యాధులున్నవారికి, వృద్ధులు, ముప్పు అధికంగా ఉన్న వర్గాలకు బూస్టర్‌ ఇవ్వాలని అమెరికా నాలుగు రోజుల క్రితం నిర్ణయించింది. కాగా, దేశంలో బూస్టర్‌ డోసు ఆవశ్యకతపై ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలేమీ లేవని ఐసీఎంఆర్‌ డీజీ డాక్టర్‌ బలరాం భార్గవ పేర్కొన్నారు. ప్రస్తుతానికి అందరికీ రెండో డోసు ఇవ్వడమే ప్రభుత్వ ప్రాధాన్యమని వివరించారు. బూస్టర్‌పై త్వరలో జరిగే సమావేశంలో ఎన్‌టీఏజీఐ చర్చించనున్న నేపథ్యంలో బలరాం భార్గవ వ్యాఖ్యలు భిన్నంగా ఉండడం గమనార్హం. అయుతే, దేశంలో తగినంతగా టీకా నిల్వలున్నందున అర్హులందరికీ రెండు డోసులు ఇవ్వడమే లక్ష్యమని ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ఐసీఎంఆర్‌తో పాటు నిపుణుల సిఫారసు మేరకు మూడో డోసుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దేశంలో ఆదివారం 8,488 మందికి కరోనా నిర్ధారణ అయింది. 249 మరణాలు (కేరళ-196) నమోదయ్యాయి. కాగా, పెళ్లిళ్లు, శుభాకార్యాలకు హాజరైనప్పటికీ.. కొవిడ్‌ ముప్పు స్వల్పమేనని దేశంలోని చాలామంది ప్రజలు భావిస్తున్నట్లు లోకల్‌ సర్కిల్స్‌ సంస్థ సర్వేలో పేర్కొంది. 17 వేలమంది నుంచి సంస్థ అభిప్రాయాలు సేకరించింది. ఇక.. కొవిడ్‌ కారణంగా ఇన్నాళ్లూ కఠినంగా అమలు చేస్తున్న ప్రయాణ ఆంక్షలను డిసెంబరు 1 నుంచి సడలించాలని ఆస్ట్రేలియా నిర్ణయించింది.


ఈ మేరకు సోమవారం నిర్ణయం తీసుకుంది.  మరోవైపు కొవాక్సిన్‌ తీసుకున్నవారికి క్వారంటైన్‌ మినహాయింపునిస్తూ బ్రిటన్‌ తీసుకున్న నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. కొవాక్సిన్‌కు ఈ నెల 3న ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అత్యవసర వినియోగ గుర్తింపు లభించడంతో.. ఈ నెల 9న బ్రిటన్‌ సైతం ఆమోదిత టీకాల జాబితాలో చేర్చింది. కాగా, రష్యాలో కరోనా మరణాలు అధికంగానే ఉంటున్నాయి. సోమవారం 1,241 మంది ప్రాణాలు కోల్పోయారు. 35,681 కేసులు నమోదయ్యాయి.


కొవిడ్‌ పరిహారం 

ఎంతమందికి ఇచ్చారు?

కేంద్రాన్ని సమాచారం కోరిన సుప్రీం 

కొవిడ్‌తో మరణించినవారి కుటుంబాలకు రూ.50వేలు చొప్పున చెల్లించాల్సిన పరిహారం వివరాలను అన్ని రాష్ట్రాల నుంచి సేకరించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఎంత మందికి పంపిణీ చేశారో తెలియజేయాలని పేర్కొంది. దీనికి సంబంధించి నవంబరు 29న మళ్లీ విచారణ చేపడతామని పేర్కొంది. ఆలోగా పరిహారం పంపిణీపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక కమిటీని నియమించాలని నిర్దేశించింది. కొవిడ్‌ మరణాలను ధ్రువీకరించడానికి గుజరాత్‌ ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇలాంటి కమిటీ నుంచి సర్టిఫికెట్లు తీసుకోవడానికి ఏడాదిపైనే పట్టొచ్చని వ్యాఖ్యానించింది. డెత్‌ సర్టిఫికెట్ల ఆధారంగా పరిహారం ఇవ్వాలని సూచించింది.