73 శాతం

ABN , First Publish Date - 2022-06-29T10:12:40+05:30 IST

కొవిడ్‌ రెండో వేవ్‌ దేశంలో సృష్టించిన విలయం అంతాఇంతా కాదు. అధికారిక లెక్కల ప్రకారమే నాడు 2 లక్షలమంది పైగా ప్రాణాలు కోల్పోయారు.

73 శాతం

  • కొవిడ్‌ రెండో వేవ్‌లో ఆక్సిజన్‌ అవసరమైనవారు
  • 46% మంది రోగులకు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు
  • ఆస్పత్రుల్లో చేరినవారిలో 87% మందిలో లక్షణాలు
  • ఢిల్లీ ఎయిమ్స్‌, గాంధీ సహా 42 ఆస్పత్రుల్లో అధ్యయనం
  • రాష్ట్రంలో కొత్తగా 459 కేసులు నమోదు


హైదరాబాద్‌, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ రెండో వేవ్‌ దేశంలో సృష్టించిన విలయం అంతాఇంతా కాదు. అధికారిక లెక్కల ప్రకారమే నాడు 2 లక్షలమంది పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆస్పత్రుల్లో పడకలు దొరక్క.. దొరికినా ఆక్సిజన్‌ లభించక.. రోగులు ఎదుర్కొన్న ఇబ్బందులు వర్ణనాతీతం. మరోవైపు చాలామందికి రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అవసరమయ్యాయి. అయితే, అప్పట్లో ప్రభుత్వాలు వాస్తవాలను దాచాయి. కొవిడ్‌ తీవ్రతను తగ్గించి చూపే ప్రయత్నం చేశాయి. మరణాలను దాచాయి. కాగా, రెండో వేవ్‌ ఉధృతి ఏ విధంగా సాగింది? రోగులపై ఎలాంటి ప్రభావం చూపిందో చాటుతూ ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలో సాగిన అధ్యయనం వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 2020 సెప్టెంబరు- 2021 అక్టోబరు 26 మధ్య కాలంలో సికింద్రాబాద్‌ గాంధీ సహా దేశంలోని 42 ప్రభుత్వ ఆస్పత్రులపై ఈ పరిశీలన చేశారు. వీటిలోని 29,509 మంది రోగుల కేస్‌ షీట్స్‌ ఆధారంగా ఈ అధ్యయనం సాగించారు. వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలోని ది నేషనల్‌ క్లినికల్‌ రిజిస్ట్రీ ఫర్‌ కొవిడ్‌-19 పోర్టల్‌లో రోజూ అప్‌లోడ్‌ చేశారు. దానిప్రకారం.. సెకండ్‌ వేవ్‌లో ఆస్పత్రుల్లో చేరిన రోగుల్లో 73 శాతం మంది ఆక్సిజన్‌, స్టెరాయిడ్స్‌ ఇచ్చారు. 2021 మార్చిలో 46 శాతం మందికి రెమ్‌డెసివిర్‌ వాడారు. అనంతరం వాడకం తగ్గుతూ వచ్చింది. మరోవైపు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను సెప్టెంబరు 2020లో ఎక్కువగా ఇచ్చారు. 2021 మే తర్వాత దీని వినియోగం పూర్తిగా ఆగిపోయింది. 2020 ఆగస్టులో ప్లాస్మా చికిత్సను ఎక్కువగా పాటించారు. తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది.


రోగుల సగటు వయసు 51..

అధ్యయనం సాగించిన 29,509 మంది రోగులూ జ్వర పీడితులే. వీరి సగటు వయసు 51 ఏళ్లు. లక్షణాలున్నాయి. వీరిలో పురుషులు 64 శాతం. ఇక ఆస్పత్రుల్లో చేరినవారిలో 87 శాతం మందికి కొవిడ్‌ లక్షణాలున్నట్లు అధ్యయనం వెల్లడించింది. మొత్తం రోగుల్లో 53 శాతం మధుమేహం, మూత్రపిండాలు, కాలేయ, కేన్సర్‌, క్షయ వంటి ఏదో ఒక దీర్ఘకాల వ్యాధి పీడితులే. మరోవైపు పరిశీలన చేసిన రోగుల్లో 14.5 శాతం మంది కొవిడ్‌తో మరణించారు. కాగా, మృతుల్లో 60 ఏళ్లు పైబడినవారే ఎక్కువ. కాగా, ప్రఖ్యాత ఢిల్లీ ఎయిమ్స్‌తో పాటు రాయ్‌పూర్‌, భువనేశ్వర్‌, భోపాల్‌ ఎయిమ్స్‌, సీఎంసీ వెల్లూరు వైద్య కళాశాలల్లో ఈ అధ్యయనం సాగింది.


రాష్ట్రంలో మరో 459 మందికి వైరస్‌

రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 26,126 టెస్టులు చేశారు. 459 మందికి పాజిటివ్‌ వచ్చింది. హైదరాబాద్‌లోనే 232 కేసులొచ్చాయి. మేడ్చల్‌లో 28, రంగారెడ్డిలో 60, సంగారెడ్డిలో 54 నమోదయ్యాయి. ప్రస్తుతం 4,172 యాక్టివ్‌ కేసులున్నాయి. 247 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. 26,040 మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

Updated Date - 2022-06-29T10:12:40+05:30 IST