అనుకున్నదే అయింది

ABN , First Publish Date - 2022-01-22T05:19:08+05:30 IST

అందరూ అనుకున్నదే జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగ కోడిపందాలు, ఇతర వేడుకల సందర్భంగా కొవిడ్‌ కేసులు పెరిగే అవకాశాలున్నాయని అందరూ భావించారు.

అనుకున్నదే అయింది
అశ్వారావుపేట ఐకేపీ కార్యాలయం

ఏపీ కోడిపందాలకు వెళ్లినవారందరికీ పాజిటివ్‌

శుక్రవారం ఒక్కరోజే అశ్వారావుపేట నియోజకవర్గంలో 153 కేసుల నమోదు

అశ్వారావుపేట, జనవరి 21: అందరూ అనుకున్నదే జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగ కోడిపందాలు, ఇతర వేడుకల సందర్భంగా కొవిడ్‌ కేసులు పెరిగే అవకాశాలున్నాయని అందరూ భావించారు. ఇప్పుడు అదే జరిగింది. నాలుగైదు రోజులుగా నియోజకవర్గంలో నమోదవుతున్న కేసులను పురిశీలిస్తే పాజిటివ్‌ వచ్చినవారిలో 90శాతానికి పైగా ఏపీలో సంక్రాంతికి జరిగిన కోడి పందాలకు వెళ్ళి వచ్చినవారేనని వైద్యఆరోగ్యశాఖాధికారులు చెపుతున్నారు. శుక్రవారం నియోజకవర్గంలో ఏకంగా 153 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కొవిడ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది. మండలాలవారీగా పరిశీలిస్తే అశ్వారావుపేట మండలంలో 50, చంద్రుగొండలో 21, అన్నపురెడ్డిపల్లి మండలంలో 23, దమ్మపేట మండలంలో 8, ములకలపల్లి మండలంలో 41 కేసులు నమోదయ్యాయి. 

ఐకేపీ కార్యాలయంలో ఐదగురికి కొవిడ్‌

అశ్వారావుపేట ఐకేపీ కార్యాలయంలో శుక్రవారం ఐదుగురిలో కొవిడ్‌ లక్షణాలు వెలుగుచూశాయి. ఏపీఎం, సీసీతో పాటు మరో ముగ్గురు సిబ్బందికి స్వల్ప లక్షణాలు వెలుగుచూశాయి. దీంతో పలువురు మహిళా సంఘాలలో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఐకేపీ కార్యాలయానికి నిత్యం పలువురు వీవోలు, గ్రామదీపికలు, మహిళలు కార్యాలయం పనులపై వచ్చి వెళుతుంటారు.  ఈ నేపథ్యంలో కార్యాలయంలో సిబ్బందికి కొవిడ్‌ లక్షణాలు వెలుగుచూడటంతో ఇంకెంత మందికి ఇది వ్యాప్తి చెందుతుందోననే ఆందోళన వ్యక్తం అవుతోంది.

Updated Date - 2022-01-22T05:19:08+05:30 IST