రెండో డోసా.. చూద్దాంలే..!

ABN , First Publish Date - 2022-01-09T05:21:18+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ రెండో డోసు చేయించుకొనేందుకు జిల్లాలో తొలి డోసు వేయించుకొన్న వారు సంశయిస్తున్నారు.

రెండో డోసా.. చూద్దాంలే..!

5 లక్షల మంది కరోనా వ్యాక్సిన్‌ రెండో తీసుకోలేదు..

మొదటి డోసు తీసుకున్నాం.. చాల్లే అనే నిర్లిప్తత

వాళ్లే వస్తారులేనని వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం

ఇప్పుడైనా వేగం పెంచేనా?


గుంటూరు, జనవరి 8(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాక్సిన్‌ రెండో డోసు చేయించుకొనేందుకు జిల్లాలో తొలి డోసు వేయించుకొన్న వారు సంశయిస్తున్నారు. నిబంధనల ప్రకారం కోవీషీల్డ్‌ డోసు తీసుకొన్న వారు 84 రోజులు, కోవాగ్జిన్‌ వేయించుకొన్న వారు 28 నుంచి 42 రోజుల్లోపు రెండో డోసు తీసుకోవాల్సి ఉంది. అయితే జిల్లాలో ఏకంగా ఐదు లక్షల మంది ఇంకా ముందుకు రావడం లేదు.  మూడో దశ వ్యాప్తి ప్రారంభమై గత ఐదు రోజుల నుంచి జిల్లాలో నిత్యం కేసుల నమోదులో పెరుగుదల కనిపిస్తున్నా వ్యాక్సినేషన్‌ పురోగతి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన మేరకు జిల్లాలో ఇప్పటివరకు 39 లక్షల మందికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తొలి డోసుని వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రెండో డోసు విషయానికి వచ్చేసరికి ఈ సంఖ్య 26 లక్షలుగా ఇప్పటివరకు నమోదైంది. డెల్టా కంటే 16 రెట్ల వేగంగా ఒమైక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి చెందుతోందని డబ్ల్యూహెచ్‌వో వర్గాలు చెబుతున్న నేపథ్యంలో ఒకసారి జిల్లాలో ఒమైక్రాన్‌ వ్యాప్తి ప్రారంభమైతే అదుపు చేయడం చాలా కష్టమౌతుంది. కాగా 15 నుంచి 18 ఏళ్ల మధ్యన జిల్లాలో సుమారు 2.30 లక్షల మంది టీనేజర్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వారిలో ఇప్పటివరకు 1.70 లక్షల మందికి కోవాగ్జిన్‌ డోసు వేశామని, మిగతావారిని కూడా గుర్తించి వారం వ్యవధిలో లక్ష్యం అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.


ఇంటింటికీ వ్యాక్సిన్‌లతో వెళితేనే..

గత కొన్ని నెలల నుంచి కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి మందగించడంతో ప్రజల్లోనూ నిర్లక్ష్యం ఏర్పడింది. జనసమూహంలో ఉన్నప్పుడు కూడా కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఒక డోసు చేయుంచుకొన్నాం కదా... ఇంక తమకు వైరస్‌ వ్యాప్తి చెందదన్న భావనలో ఉన్నారు. ఇది కూడా జిల్లాలో రెండో డోసు పెండింగ్‌ సంఖ్య పెరగడానికి కారణంగా మారింది. ఈ నేపథ్యంలో సచివాలయాలు, అర్బన్‌, ప్రైమరీ హెల్త్‌ సెంటర్లలో సిబ్బందిని ఇంటింటికి పంపించి వ్యాక్సిన్‌ రెండో డోసుని చేయిస్తేనే పెండింగ్‌ సంఖ్య తగ్గుతుంది. అలానే మూడో దశ వ్యాప్తిని ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి. లేకుంటే గత ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో ఎలాగైతే డెల్టా వేరియంట్‌ ఉద్ధృతితో ఎలాంటి ఇబ్బందులు పడ్డారో అంతకంటే ఎక్కువ చవి చూడాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి.


కొత్తగా మందికి కరోన

జిల్లాలో కొత్తగా 67 మందికి కరోనా వైరస్‌ సోకింది. శనివారం నిర్వహించిన 1,950 టెస్టుల్లో 3.44 శాతం మందికి వైరస్‌ వ్యాప్తి చెందినట్లు నిర్ధారణ జరిగింది. కొత్తగా గుంటూరు నగరంలో 32, నరసరావుపేటలో 9, మంగళగిరిలో 5, తెనాలిలో 5, తాడేపల్లిలో 5, పెదకాకానిలో 2, కొల్లూరులో 2, పెదనందిపాడులో 1, ప్రత్తిపాడులో 1, సత్తెనపల్లిలో 1, పిడుగురాళ్లలో 1, రెంటచింతలలో 1, బాపట్లలో 1, కాకుమానులో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. నిత్యం నమోదు అవుతున్న కేసులను పరిశీలిస్తే గుంటూరు నగరంతో పాటు మంగళగిరి, తాడేపల్లి, నరసరావుపేట, తెనాలి, చిలకలూరిపేటల్లో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి.  మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఓ  ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  


పొగాకు కంపెనీలో కరోనా కలకలం

నాదెండ్ల: ప్రముఖ పారిశ్రామికవాడ గణపవరం గ్రామంలోని ఒక ప్రముఖ పొగాకు కంపెనీలో 11మంది కరోనా బారిన పడ్డారు. కంపెనీలోని ఉద్యోగులకు కొవిడ్‌ లక్షణాలు కనిపించడంతో వారు పరీక్ష చేయించుకున్నారు. దీంతో 11మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కంపెనీలోని కొన్ని విభాగాలను మూసివేశారు.   


Updated Date - 2022-01-09T05:21:18+05:30 IST