Abn logo
Jun 14 2021 @ 00:44AM

పచ్చడి మెతుకులూ ఖరీదే!

‘‘మాయదారి కరోనా భయం కన్నా ఆకలి బాధలే అణగారిన వర్గాలకు శాపంగా మారాయి. పెరిగిన నిత్యావసర ధరలు పేదల పాలిట మృత్యుపాశాలుగా మిగిలాయి’’ అంటారు ‘దళిత స్త్రీ శక్తి’ జాతీయ కన్వీనర్‌ ఝాన్సీ గెడ్డం. అంటరానితనం కొవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రాల్లోనూ రాజ్యమేలుతోంది అంటున్న ఆమె కరోనా కష్టకాలంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ల జీవితాల్లో నెలకొన్న దయనీయ పరిస్థితుల గురించి నవ్యతో చెప్పుకొచ్చారు.


‘‘కరోనా వల్ల సకల జనులంతా ఇబ్బంది పడుతున్నారు. అంతకు మించి పేదవర్గాల వాళ్లు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సెకండ్‌ వేవ్‌ మన పాలిట ఒక ఆశనిపాతంలా దాపురించింది. ఇది మామూలు దెబ్బకాదు. పేద, మధ్యతరగతిని బాగా కుంగదీసింది. ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లేక చాలామంది ఇప్పుడు దుర్భర జీవితం గడుపుతున్నారు. అందుకు పల్లె, పట్టణం తేడాలేదు. అణగారిన వర్గాల పరిస్థితి మరీ పెనంమీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. ‘దళిత స్త్రీ శక్తి’ ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోని పది జిల్లాల్లో పదిహేనేళ్లుగా పనిచేస్తోంది. ఆ అనుభవానికి తోడు కరోనాకు ముందు, తర్వాత క్షేత్ర స్థాయిలో చోటు చేసుకున్న పరిణామాలను కళ్లారా చూస్తున్నాం. ఇది వరకటి కన్నా గ్రామాల్లోని దళిత, పేద ప్రజల బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఆదమరిచాయి. రెండవ లాక్‌డౌన్‌లో స్వచ్ఛంద సంస్థలు సైతం సామాన్యులకు అంతగా సాయం చేయలేకపోయాయి. 


పోషకాహారం లేమి...

లాక్‌డౌన్‌ వల్ల చాలామంది పనులు లేక ఇంటికే పరిమితమయ్యారు. ఆంధ్రాలో అవసరం ఉన్నంత మందికి ఉపాధిహామి పథకం అందడంలేదు. అదే తెలంగాణలో పనులకు హాజరైనా వేతనం చేతికి రాలేదు. వ్యవసాయ పనులకూ ఇది సమయం కాదాయె. దాంతో రెక్కాడితే కానీ డొక్కాడని పల్లె జీవులకు నాలుగు వేళ్లూ నోట్లోకెళ్లని దయనీయస్థితి. అందులోనూ కరోనా వచ్చినవాళ్ల పరిస్థితి మరీ ఘోరం. స్వతహాగా వాళ్లకుండే ఇమ్యూనిటీతో రోగాన్ని జయించినా, సరైన పోషకాహారం లభించక ఇంకా కోలుకోనివాళ్లు బోలెడుమంది ఉన్నారు. అలాంటి వాళ్లకు మా లాంటి సంఘాలు, సంస్థలు చేసే సాయమూ అంతంతమాత్రమే.! ఒకవైపు ఽనిత్యావసరాల ధరలన్నీ ఆకాశాన్నంటాయి. రోజుకి వంద లేదా రెండు వందల రూపాయల కూలీతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే కడుపేదలు నూనె,పప్పులు కొనగలిగే పరిస్థితుందా! ఇప్పుడు పచ్చడి మెతుకులూ ఖరీదే.! కరోనా కన్నా ఆకలి మరింత మందిని చంపేట్టుంది. పెట్రోలు, డీజిల్‌ రేటు పెరగడంతో చిరుద్యోగుల జీవన ప్రమాణాలు మరింత పడిపోతున్నాయి. అయినా, పాలకులకు పట్టడం లేదు. రేషను ద్వారా బియ్యం ఇస్తున్నాం అంటారు.! అదొక్కటే సరిపోతుందా. ఆకలి చావులను నిలువరించేందుకు ప్రత్యామ్నాయం ఆలోచించకుంటే ప్రమాదమే. గ్రామాల్లో సరైన వైద్య సౌకర్యాలు లేవు. కొవిడ్‌ పరీక్ష కోసమో, వ్యాక్సిన్‌ కోసమో గంటలకొద్దీ క్యూలో నిల్చొని కొందరు సొమ్మసిల్లిన ఘటనలున్నాయి. మందులూ సక్రమంగా పంపిణీ చేయలేకపోతున్నారు. ఇదంతా చూస్తుంటే, డెభ్బై నాలుగేళ్ల స్వాతంత్య్ర భారతంలో మనం సాధించిన ప్రగతి ఇదేనా అనిపిస్తుంది.


గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిళ్లు...

కరోనా కష్టకాలంలో బాలల హక్కులు అత్యంత విస్మరణకు లోనయ్యాయి. పిల్లలంతా చదువుకు దూరమయ్యారు. మనో వికాసానికి తోడ్పడే వాతావరణం అందుబాటులో లేకుండా పోయింది. ఇక పిల్లల ఆరోగ్యం గురించి పట్టింపెవరికి? బాలకార్మికత పెరిగింది. ఇదివరకు బడికెళితే కనీసం నీళ్లచారు, కోడిగుడ్డుతో మధ్యాహ్నం భోజనమైనా పసివాళ్లకు దొరికేది. ఇప్పుడు అదీ లేకపోవడంతో బాలల్లో పౌష్ఠికాహార లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. స్మార్టుఫోను లేకపోవడంతో ఆన్‌లైన్‌ తరగతులకు హాజరుకాని పిల్లలు చాలామంది ఉన్నారు. ఒకవేళ పెద్దవాళ్లను పీడించి మరీ, అప్పోసప్పో చేయించి మరీ స్మార్టు ఫోను కొనిపించినా, ఆ పిల్లలు పొదస్తమానం ఇంటర్నెట్‌తోనే గడుపుతున్నారు. ఇదే అదను అనుకొని కొందరు గుట్టుచప్పుడు కాకుండా బాల్యవివాహాలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌లో సుమారు పది బాల్యవివాహాలను అడ్డుకోగలిగాం. ముఖ్యంగా చిన్నా, చితక వ్యాపారాల్లో చితికిపోయిన కుటుంబాల్లోనే బాల్యవివాహాలు ఎక్కువ జరుగుతున్నాయి. స్కూళ్లు తెరిచాక ఆడపిల్లల డ్రాప్‌ అవుట్స్‌పైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరమైతే చాలా ఉంది. 


గృహ హింస పెరిగింది...

మిగతా రోజులతో పోలిస్తే లాక్‌డౌన్‌లో గృహహింస కేసులు ఎక్కువయ్యాయి. తాగడం కోసం డబ్బులిమ్మని భార్యను వేధించడం. తాగొచ్చి గొడవచేయడం, భార్యను కొట్టడం వంటి ఘటనలు ఇదివరకటి కంటే ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం. అమ్మాయిలపై లైంగిక దాడి కేసులూ మా దృష్టికి వస్తున్నాయి. మేము పనిచేస్తున్న ప్రాంతంలోనే తనకు కూతురు వరసయ్యే పదకొండేళ్ల పాపమీద ఘాతుకానికి తెగబడ్డాడు ఒక దుర్మార్గుడు. పైగా విషయం బయటకు చెబితే, చంపేస్తానని అమ్మాయిని బెదిరించాడు. ఆ కేసులో దోషిని అరెస్టు చేయించగలిగాం. కానీ ఇంత వరకు అమ్మాయికి వసతి సౌకర్యం కల్పించలేకపోయాం. మరొక కేసులో దళిత అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు దళితేతర అబ్బాయి. ఆ పెళ్లి ఇష్టం లేని ఆ కుర్రాడి పెద్దలు అమ్మాయిని మరొక ఇంట్లో బంధించి, ఎండుమిరపకాయలతో పొగేసి మరీ హింసించారు. చివరికి అమ్మాయి వాళ్ల చెర నుంచి తప్పించుకొని మమ్మల్ని కలిసింది. ఆ కేసులోనూ న్యాయం కోసం బాధితురాలి పక్షాన పోరాడుతున్నాం. ఇలా మరికొన్నికేసులను పోలీసుల దృష్టికి తీసుకెళ్లాం. విశాల దృక్పథంతో...

దళిత స్త్రీల ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వ సాధన లక్ష్యంగా 2005లో ‘దళిత స్త్రీ శక్తి’ సంస్థను నెలకొల్పాం. గుంటూరు, కృష్ణ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో దళిత బాలికల, మహిళలపై దాడులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంమీదా అవగాహన కల్పిస్తూ, వివక్ష, అణచివేతలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాం. ఇప్పటి వరకు సుమారు పదివేల అట్రాసిటీ కేసులమీద పోరాడాం. కరోనా సమయంలోనూ ఆన్‌లైన్‌ వేదికగా రెండు రాష్ట్రాల్లోని యాభై అట్రాసిటీ కేసులను సంబంధిత ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. బాధితులకు చట్ట ప్రకారం నష్టపరిహారం అందేలా చూస్తున్నాం. ప్రేమ పేరుతో మోసాలు, లైంగిక దాడి, దళిత మహిలపై హింస తదితర సమస్యలమీద ప్రధానంగా పనిచేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో దళిత స్త్రీ శక్తి కి పదివేల మంది కార్యకర్తలున్నారు. గ్రామీణ యువత కోసం సామాజిక అంశాలతో పాటు చట్టాలపై అవగాహనా తరగతులు నిర్వహిస్తుంటాం. తద్వారా ప్రజాస్వామిక విలువలను ప్రచారం చేస్తున్నాం. కులమతాలకు అతీతంగా మేధావులు, ప్రగతిశీలకారులు, పౌర సంఘాలు విశాలదృక్పథంతో ఐక్యకార్యాచరణ ద్వారా పనిచేయాలి. అప్పుడే సామాజిక జాఢ్యాలను నిర్మూలించగలం.


ఆంధ్రాలో గందరగోళం...

ఈ మధ్య కాలంలో దళితులమీద దాడులూ పెరిగాయి. మామోలు రోజుల్లోనే అట్రాసిటీ కేసులను పోలీసులు నీరుగారుస్తుంటారు. అలాంటిది ఇప్పుడు దొరికిందే చాన్సు అన్నట్టుగా బాధితులు ఫిర్యాదు చేసినా, అస్సలు పట్టించుకోడం లేదు. మా లాంటివాళ్లం ఇదేంటని ప్రశ్నిస్తే, ‘కరోనా టైంలో కూడా ఏంటి మేడం’ అనంటారు. రంగారెడ్డి జిల్లాలోని ఒక గ్రామంలో దళితులకు చెందిన ఎనిమిది ఎకరాల భూమిని  ఆక్రమించుకున్నారు. పైగా అందులోని పంటనూ అక్రమంగా తీసుకెళ్లారు. దానిపై ఉన్నతాధికారులకూ ఫిర్యాదు చేశాం. అయినా, స్పందన లేదు. ఇక ఆంధ్రాలో పరిస్థితికొస్తే అంతా గందరగోళమే. దళిత, ఆదివాసీలకు రక్షణ కవచంలా ఉండే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం స్ఫూర్తిని ప్రభుత్వమే దెబ్బతీస్తోంది. సామాజిక అసమానతల నిర్మూలనకు ఆయుధమైన అట్రాసిటీ యాక్టుమీద రాజకీయ రంగు పులుముతున్నారు. ఇది దళితులకు మరింత వేదన కలిగిస్తుంది.

- కె. వెంకటేశ్‌