కొవిడ్‌ హోటళ్లు!

ABN , First Publish Date - 2020-08-10T10:17:22+05:30 IST

నగరంలోని హోటళ్లు.... ప్రైవేటు ఆస్పత్రులకు కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మారిపోతున్నాయి. వీటిల్లో ఎలాటి భద్రతా ఏర్పాట్లు లేనప్పటికీ ..

కొవిడ్‌ హోటళ్లు!

విపత్తుని వ్యాపారంగా మలచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు

కరోనా కేసులు అధికం కావడంతో పెరుగుతున్న డిమాండ్‌ 

బెడ్స్‌ ఖాళీ లేక... హోటళ్లను అద్దెకు తీసుకుంటున్న నిర్వాహకులు

కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా వినియోగం

స్వల్ప లక్షణాలతో వచ్చేవారికి వసతి

రోజుకి రూ.18 వేల నుంచి రూ.20 వేలు వసూలు

పట్టించుకోని అధికార యంత్రాంగం

విజయవాడ ఘటనతో ఉలిక్కిపడిన అధికారులు

కొవిడ్‌ కేర్‌ సెంటర్లు, ఆస్పత్రుల్లో తనిఖీలకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): నగరంలోని హోటళ్లు.... ప్రైవేటు ఆస్పత్రులకు కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మారిపోతున్నాయి. వీటిల్లో ఎలాటి భద్రతా ఏర్పాట్లు లేనప్పటికీ ధనదాహంతో కరోనా బాధితులను అక్కడ ఉంచి చికిత్స చేస్తున్నారు. వైరస్‌ బాధితుల భయాన్ని, ఆందోళనను ఆసరాగా చేసుకుని వేలాది రూపాయలను ఫీజుల రూపంలో దండుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లను కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా నిర్వహిస్తున్నప్పటికీ అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో విజయవాడలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చిన స్వర్ణ ప్యాలస్‌ హోటల్‌లో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించి 10 మంది మృతిచెందగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనతో జిల్లా అధికారయంత్రాంగం అప్రమత్తమై టాస్క్‌ఫోర్స్‌ను నియమించింది. 


కరోనా వైరస్‌ కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రులు, కేర్‌ సెంటర్ల కంటే మెరుగైన చికిత్స అందుతుందన్న భావనతో ఎగువ, మధ్య తరగతికి చెందినవారు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయి స్తున్నారు. దీంతో పలు ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడింది. దీనిని సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు ఆస్పత్రులు నగరంలోని కొన్ని హోటళ్లు, లాడ్జిలను అద్దెకు  తీసుకుని వాటిని కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మార్చేశాయి. పాజిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చినప్పటికీ వైరస్‌ లక్షణాలు లేనివారు, స్వల్పలక్షణాలతో బాధపడుతున్నవారిని ఈ కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలిస్తున్నారు. వీరి ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు నర్సింగ్‌ సిబ్బంది ఉదయం, సాయంత్రం వేళ వెళుతున్నారు. బాధితులు ఏవైనా సమస్యలు చెబితే డాక్టర్‌కి ఫోన్‌ చేసి చెబుతున్నారు. డాక్టర్‌ చెప్పే మందులను బాధితులకు అందజేస్తున్నారు. ఒకవేళ పరిస్థితి తీవ్రంగా వుంటే అప్పుడు ఆస్పత్రికి తరలిస్తున్నారు. 


రామ్‌నగర్‌తోపాటు హెల్త్‌సిటీలో బ్రాంచీలు కలిగిన ఒక కార్పొరేట్‌ ఆస్పత్రి..  హెల్త్‌సిటీలోని ఒక హోటల్‌ను లీజుకి తీసుకుని కొవిడ్‌ కేర్‌సెంటర్‌గా నిర్వహిస్తున్నది. అలాగే పందిమెట్ట జంక్షన్‌లో ఒక లాడ్జిని కూడా కొవిడ్‌ కేర్‌సెంటర్‌గా మార్చినట్టు తెలిసింది. జగదాంబ కూడలిలో వున్న ఒక ప్రైవేటు ఆస్పత్రి... అక్కడికి సమీపంలో వున్న ఒక లాడ్జిని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా నిర్వహిస్తున్నది. రామ్‌నగర్‌లోని మరొక కార్పొరేట్‌ ఆస్పత్రి తమకు ఎదురుగా ఉన్న హోటల్‌ని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చినట్టు వై ద్యులు చెబుతున్నారు. మరికొన్ని ఆస్పత్రులు కూడా  హోటళ్లు, లాడ్జిల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్లను నిర్వహిస్తున్నప్పటికీ వివరాలు బయటకు పొక్కడం లేదు.


ఆస్పత్రి ఏర్పాటు చేయాలంటే....

ఎవరైనా ఆస్పత్రి ఏర్పాటు చేస్తే ఆ భవనానికి జీవీఎంసీ లేదా సంబంధిత స్థానిక సంస్థ నుంచి అన్ని రకాల అనుమతులు ఉండాలి. ఆస్పత్రి ఏర్పాటుకు కావాల్సిన అనుమతుల కోసం జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. పరిశీలన నిమిత్తం డీఎంహెచ్‌ఓ, జీవీఎంసీ ఫైర్‌ ఆఫీసర్‌, ఈపీడీసీఎల్‌ అధికారులతో కూడిన నోడల్‌ అధికారుల బృందానికి రిఫర్‌ చేస్తారు. సదరు బృందం ఆ భవనం వద్దకు వెళ్లి వెంటిలేషన్‌, విద్యుత్‌ సరఫరా, పరికరాల నాణ్యత, అగ్నిప్రమాదం సంభవిస్తే ముందుగా గుర్తించేలా వార్డులు, గదుల్లో స్మోక్‌ డిటెక్షన్‌ వ్యవస్థ, మంటలను ఆర్పేందుకు అవసరమైన పరికరాలు, వాటర్‌ పైప్‌లైన్లు, ఆటోమెటిక్‌ స్ర్పింక్లర్లు వంటివి ఏర్పాటు చేశారా లేదా అని పరిశీలించాలి. అగ్నిప్రమాదం జరిగితే... రోగులను తక్షణమే బయటకు తరలించేందుకు వీల్‌ స్ర్టెచర్లు, భవనానికి రెండువైపుల నుంచి బయటకు వెళ్లేలా ర్యాంపులు వంటివి ఉండాలి. ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆయా అధికారులు వ్యక్తిగతంగా తమ నివేదికలను జిల్లా కలెక్టర్‌కు అందజేయాలి. 


హోటల్‌ ఆస్పత్రుల్లో...

ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రులు కొవిడ్‌ కేర్‌ సెంటర్ల పేరుతో బాధితులను చేర్చుకుని చికిత్స అందజేస్తున్న హోటళ్లు/లాడ్జిల్లో పైనపేర్కొన్న రక్షణ ఏర్పాట్లు ఏవీ లేవు. వీటిల్లో     కిటికీలకు అమర్చే కర్టెన్లు, ఇంటీరియర్‌ డెకరేషన్‌ కారణంగా మంటలు వ్యాప్తిచెందడానికి ఇవి దోహదపడతాయి. ఒక గదిలో అగ్ని ప్రమాదం సంభవిస్తే... మంటలు చాలా వేగంగా ఇతర గదులు, ఫ్లోర్లకు వ్యాపిస్తాయి. ప్రస్తుతం కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా నిర్వహిస్తున్న హోటళ్లు, లాడ్జిల్లో పొరపాటున అగ్నిప్రమాదం జరిగితే విజయవాడ ఘటన పునరావృతం అవుతుంది. ఈ తరహా ప్రమాదం సంభవించకుండా వుండాలంటే ఆయా హోటళ్లు/ లాడ్జిల్లో ఆస్పత్రుల  తరహా సదుపాయాలు సమకూర్చిన తరువాతే కొవిడ్‌ కేర్‌ సెంటర్ల నిర్వహణకు  అనుమతులు ఇవ్వాలి. కానీ నగరంలో ప్రస్తుతం నడుస్తున్న కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఇవేవీ లేకపోయినా అధికారులు పట్టించుకోవడంలేదు. 


టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు

విజయవాడలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా నిర్వహిస్తున్న ఒక హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించి, 10 మంది చనిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమ్తతమైంది. అన్ని జిల్లాల్లో కొవిడ్‌ ఆస్పత్రులు, కేర్‌ సెంటర్లు, క్వారంటైన్‌ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలు, విద్యుత్‌ సరఫరాపై వెంటనే తనిఖీలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా  కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి కమిటీలో ఆర్డీవో లేదా తహసీల్దార్‌తోపాటు విద్యుత్‌, అగ్నిమాపక శాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలు తనిఖీ చేసి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. 


రోజుకి రూ.18 వేల నుంచి రూ.20 వేలు!

హోటళ్లలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో మందులు, ఆహారం, ఇతర వసతులు కలిపి ఒక్కో వైరస్‌ బాధితుడి నుంచి రోజుకి రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకూ వసూలు చేస్తున్నారు. డాక్టర్‌ ఇక్కడ వుండరని, టెలీమెడిసిన్‌ మాత్రమే అందుబాటులో ఉంటుందని ముందుగానే స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఆరోగ్యం విషమించి ఆక్సిజన్‌ లేదా వెంటిలేటర్‌ పెట్టాల్సి వస్తే అప్పుడు ఆస్పత్రికి తరలించాల్సి వుంటుందని, రోజుకి రూ.50 వేల వరకు ఖర్చు అవుతుందని స్పష్టం చేస్తున్నారు.


అనుమతి తప్పనిసరి..నిరంజన్‌రెడ్డి, జీవీఎంసీ ప్రాంతీయ ఫైర్‌ ఆఫీసర్‌

హోటళ్లు/లాడ్జిల్లో ఎవరినైనా ఇన్‌పేషెంట్లుగా చేర్చుకుంటే దానిని ఆస్పత్రిగానే పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు అవసరమైన అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. జీవీఎంసీ పరిధిలో ప్రభుత్వం ఎనిమిది కొవిడ్‌ కేర్‌ సెంటర్లను నిర్వహిస్తున్నది. ప్రైవేటు ఆస్పత్రులు కూడా నిర్వహిస్తున్న విషయం తెలియడంతో సోమవారం ప్రత్యేక బృందాలతో టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడి తనిఖీలు చేయబోతున్నాం. ఆస్పత్రులకు ఉండాల్సిన నిబంధనలు, పాటించాల్సిన జాగ్రత్తలన్నీ వీటికి వర్తిస్తాయి. లోపాలను గుర్తించి కలెక్టర్‌కు నివేదించి చర్యలు తీసుకుంటాం. 


విజయవాడ ఘటన వల్లే... డాక్టర్‌ విజయలక్ష్మి, ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌ఓ

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ కొవిడ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరగడం వల్లే నగరంలో కూడా ప్రైవేటు ఆస్పత్రులు కొవిడ్‌ సెంటర్లు నిర్వహిస్తున్నాయన్న విషయం తెలిసింది. మాకు ఇంతవరకు ఎవరూ దరఖాస్తు చేయలేదు. ఎవరైనా జిల్లా కలెక్టర్‌కి దరఖాస్తు చేసుకుంటే, దానిని వివిధ శాఖల అధికారులతో కూడిన నోడల్‌టీమ్‌కి రిఫర్‌ చేస్తారు. నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక్క దరఖాస్తు కూడా పరిశీలనకు రాలేదు. 

Updated Date - 2020-08-10T10:17:22+05:30 IST