కోవిడ్ ఆసుపత్రులకు శుభవార్త!

ABN , First Publish Date - 2021-05-08T20:08:45+05:30 IST

కోవిడ్ రోగులకు చికిత్స చేసే ఆసుపత్రులకు ఆదాయపు పన్ను

కోవిడ్ ఆసుపత్రులకు శుభవార్త!

న్యూఢిల్లీ : కోవిడ్ రోగులకు చికిత్స చేసే ఆసుపత్రులకు ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేకమైన వెసులుబాటు ఇచ్చింది. కోవిడ్ చికిత్సను అందించే ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, నర్సింగ్ హోంలు, కోవిడ్ కేర్ సెంటర్లు, ఇతర మెడికల్ ఫెసిలిటీలు కోవిడ్ రోగుల నుంచి రూ.2 లక్షలకు మించి నగదును  స్వీకరించవచ్చునని తెలిపింది. ఈ వెసులుబాటు మే 31 వరకు అమలవుతుందని తెలిపింది. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 269ఎస్‌టీ క్లాజ్ (iii) ప్రకారం లభించిన అధికారాలను వినియోగిస్తూ ఆ అనుమతిని మంజూరు చేసింది. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు ఈ విధంగా నగదు రూపంలో వసూలు చేయవచ్చునని తెలిపింది.  రోగి పాన్ లేదా ఆధార్ సంఖ్యను నమోదు చేసుకుని రూ.2 లక్షల కన్నా ఎక్కువ నగదును స్వీకరించవచ్చునని తెలిపింది. రోగికి, ఆ సొమ్మును చెల్లించేవారికి మధ్యగల సంబంధాన్ని కూడా నమోదు చేయాలని తెలిపింది. 


ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం, ఒక రోజులో రూ.2 లక్షల కన్నా ఎక్కువ నగదు లావాదేవీలు జరపడానికి అనుమతి లేదు. ఈ నిబంధనను తాత్కాలికంగా కోవిడ్ రోగుల చికిత్స కోసం సడలించారు. మరోవైపు ఆసుపత్రులు కోవిడ్ రోగుల నుంచి నగదునే కోరుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బీమా పథకాల ప్రాతిపదికపై రోగులను చేర్చుకునేందుకు ఆసుపత్రులు తిరస్కరిస్తున్నట్లు చాలా మంది ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా నగదు చెల్లించి, చికిత్స చేయించుకుని, ఆ తర్వాత బీమా కోసం దరఖాస్తు చేయవచ్చు. 


Updated Date - 2021-05-08T20:08:45+05:30 IST