కరోనా సాయం పంపిణీ ప్రారంభం

ABN , First Publish Date - 2021-05-11T13:28:25+05:30 IST

కరోనా సాయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా పంపిణీ చేసేందుకు వీలుగా అర్హులైన లబ్ధిదారులకు టోకెన్ల పంపిణీ సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. అయితే, నగదు పంపిణీ

కరోనా సాయం పంపిణీ ప్రారంభం


- స్వయంగా అందజేసిన సీఎం స్టాలిన్‌

- ఇంటింటికీ టోకెన్ల అందజేత 


అడయార్‌(చెన్నై): కరోనా సాయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా పంపిణీ చేసేందుకు వీలుగా అర్హులైన లబ్ధిదారులకు టోకెన్ల పంపిణీ సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. అయితే, నగదు పంపిణీ కార్యక్రమాన్ని ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సచివాలయంలో ప్రారంభించారు. ఆ తర్వాత ఆయా జిల్లాల్లో ఆయా మంత్రులు ఈ టోకెన్లను పంపిణీ చేశారు. గత ఎన్నికల ప్రచార సమయంలో డీఎంకే అధికారంలోకి వస్తే రేషన్‌కార్డుదారులకు రూ.4 వేల ఆర్థిక సాయం చేస్తామని స్టాలిన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ హామీ మేరకు ఇపుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆర్థిక సాయం పంపిణీకి ఆదేశాలు జారీచేశారు. అయితే, తొలి విడతలో రూ.2 వేలు మాత్రమే ఇవ్వనున్నారు. మిగిలిన రూ.2 వేలును రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేసిన తర్వాత అందజేస్తామని తెలిపారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా వుండటంతో సాయం పంపిణీ వల్ల మరిన్ని కేసులు పెరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగా ఆర్థికసాయం పంపిణీ బాధ్యతను ఆయా ప్రాంతాల్లోని రేషన్‌ షాపుల సిబ్బందికి అప్పగించారు. ఈ సిబ్బందే ప్రతి ఇంటింటికెళ్ళి టోకెన్లు జారీ చేస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్రారంభించారు. కొంతమంది లబ్ధ్దిదారులను సచివాలయానికే ఆహ్వానించి రూ.2 వేల నగదును అందజేశారు. ఈ ఆర్థిక సాయాన్ని అందుకున్న లబ్ధ్దిదారులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆహార శాఖమంత్రి చక్రపాణి, సీనియర్‌, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఅన్బు, ఆహార శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. సచివాలయంలో రూ.2 వేల ఆర్థిక సాయం పంపిణీకి సీఎం శ్రీకారం చుట్టిన తర్వాత అన్ని జిల్లాల్లో ఈ పథకం అమలుకు సంబంధించిన టోకెన్ల జారీని ప్రారంభించారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు లాంఛనంగా ప్రారంభించినప్పటికీ.. ఈ టోకెన్లను మాత్రం రేషన్‌ దుకాణాల సిబ్బంది ఇంటింటికీ తీసుకెళ్ళి ఇవ్వనున్నారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ టోకెన్లను అందజేస్తారు. ఆ తర్వాత 15వ తేదీన తమ పరిధిలోని రేషన్‌ షాపుల్లో రూ.2 వేల ఆర్థికసాయం తీసుకోవచ్చు. ఈ నగదు పంపిణీలో కూడా వృద్ధులకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదేవిధంగా, నగదు కోసం వచ్చే మహిళలు... ముఖానికి మాస్కు ధరించి, సామాజిక భౌతికదూరం పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. 

Updated Date - 2021-05-11T13:28:25+05:30 IST