గిట్టుబాటు కాదు

ABN , First Publish Date - 2020-07-12T10:29:01+05:30 IST

కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రులు అయిష్టత చూపుతున్నాయి. సా

గిట్టుబాటు కాదు

కొవిడ్‌ వైద్యం రేట్లు పెంచాలి

నర్సులను కూడా సమకూర్చాలి

నెట్‌వర్క్‌ ఆసుపత్రుల కోర్కెల చిట్టా

ఇన్నాళ్లూ దండుకుని.. ఇప్పుడు మొండి


కర్నూలు(ఆంధ్రజ్యోతి) జూలై 11: కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రులు అయిష్టత చూపుతున్నాయి. సాకులు చూపి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా తప్పించుకునే మార్గాలను వెతుక్కుంటున్నాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల కింద జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా నమోదు చేసుకున్నారు. ఇందులో 90 శాతం ఆసుపత్రులు కొవిడ్‌ చికిత్స అనగానే ముఖం చాటేస్తున్నాయి.


వైద్యులు, సిబ్బంది లేకున్నా ఇన్నాళ్లూ ఆరోగ్య శ్రీ వైద్యం పేరిట ప్రభుత్వం నుంచి భారీగా దండుకున్నారు. సంక్లిష్ట పరిస్థితుల్లో మాత్రం వల్ల కాదని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొవిడ్‌ చికిత్సకు ప్రభుత్వం చెల్లిస్తామన్న డబ్బుకు 3-4 రెట్లు అధికంగా చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అదనపు సౌకర్యాలను ప్రభుత్వమే సమకూర్చాలని పలు ప్రైవేట్‌ వైద్యశాలలు కోరుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులనుబేఖాతరు చేస్తూ ఐఎంఏకి ఫిర్యాదు చేస్తున్నాయి. కొన్ని చోట్ల నర్సులను అదనంగా సమకూర్చాలని జిల్లా అధికారులనే ఐఎంఏ కోరుతుండటం గమనార్హం. 


ఆ డబ్బు చాలదట..

జిల్లాలో 50కి పైగా ప్రైవేట్‌ ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఉన్నాయి. నిన్నటి వరకు రోగులను చేర్చుకుని రూ.కోట్లు బిల్లులు చేసుకున్నాయి. ఇందులో చాలా అక్రమాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. బాధితులు పలువురు అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. కానీ ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో వైద్యం గురించి పెద్దగా విచారించలేదు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కొవిడ్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చింది.


నిబంధనల ప్రకారం వైద్యం అందించాల్సిన నెట్‌ వర్క్‌ ఆసుపత్రులు ఇప్పుడు వెనుకంజ వేస్తున్నాయి. జిల్లాలో ఇప్పటికే కర్నూలు జీజీహెచ్‌, విశ్వభారతి, నంద్యాల శాంతిరామ్‌ ఆసుపత్రుల్లో వందలాది వైద్యులు నిత్యం కొవిడ్‌ బాధితులకు సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్నారు. అయినా వారు ఎక్కడా వెనకడుగు వేయలేదు. కానీ ప్రైవేట్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు మాత్రం తమకెందుకు ఈ సాహసం అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. కానీ అసలు విషయం బయట పెట్టకుండా ప్యాకేజీ చాలదని సాకులు చెబుతున్నాయి.


నాన్‌ క్రిటికల్‌ కొవిడ్‌ బాధితులకు అందించే చికిత్సకు రోజుకు రూ.3,250 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ నగదు పీపీఈ కిట్ల కొనుగోలుకే చాలదని కొన్ని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. షిఫ్టులో 3-4 సార్లు బాధితుడ్ని చూసి వస్తే కిట్లు కూడా అన్ని సార్లు మార్చాలని అంటున్నారు. కాబట్టి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ చెల్లిస్తే ఆలోచిస్తామని చెబుతున్నట్లు సమాచారం. 


తనిఖీ చేస్తే బండారం బయటకి..

జిల్లాలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులపై పెద్దగా పర్యవేక్షణ లేదు. ఆరోగ్యశ్రీ నిబంధనలను చాలా ఆసుపత్రులు పాటించడం లేదు. వైద్యులు, నర్సులు, పడకల కొతర చాలా ఉంది. అయినా విషయం బయట పడనీయండం లేదు. కానీ ఆరోగ్యశ్రీ కింద బిల్లులు మాత్రం యథేచ్ఛగా వసూలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులపై స్పందించిన కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు, తమకు అదనంగా నర్సులు కావాలని ఐఎంఏ వారిని కోరినట్లు తెలుస్తోంది. 


రోజుకు రూ.2.5 లక్షలు

కరోనా వైద్య సేవలకు పలువురు వైద్యులు రూ.2.50 లక్షల వరకూ డిమాండ్‌ చేస్తున్నారు. నర్సులు నెలకు రూ.లక్ష దాకా అడుగుతున్నారని సమాచారం. అంత చెల్లించినా బాధితులకు నాణ్యమైన సేవలు అందుతాయన్న గ్యారెంటీ లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇచ్చే రూ.3,250 ఏమూలకు సరిపోతుందని నెట్‌వర్క్‌ ఆసుపత్రులవారు ప్రశ్నిస్తున్నారు.


ఆరోగ్యశ్రీ డబ్బుకు ఆశపడితే పెద్దగా గిట్టుబాటు కాకపోగా, ప్రాణాల మీదుకు వస్తుందని కొందరు వైద్యులు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రుల కోరికలు కొండెక్కి కూర్చున్నాయి. ప్రభుత్వం ఏ మేరకు అంగీకరిస్తుందో చూడాల్సిందే. ఈ లోగా ఏదైనా అనర్థం జరిగితే నెట్‌వర్క్‌ ఆసుపత్రులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. జిల్లా  అధికార యంత్రాంగం స్పందించి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2020-07-12T10:29:01+05:30 IST