శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో కొవిడ్‌ జ్ఞాన్‌ వెబ్‌సైట్‌

ABN , First Publish Date - 2020-04-08T13:49:08+05:30 IST

కరోనా వైరస్‌ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారాన్ని ఇస్తున్నప్పటికీ ప్రజల్లో అనేక రకాల సందేహాలు, అపోహలు తలెత్తుతూనే ఉన్నాయి.

శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో కొవిడ్‌ జ్ఞాన్‌ వెబ్‌సైట్‌

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారాన్ని ఇస్తున్నప్పటికీ ప్రజల్లో అనేక రకాల సందేహాలు, అపోహలు తలెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియా ద్వారా అసత్య సమాచారం బాగా వ్యాపిస్తోంది. దీన్ని అరికట్టి ప్రజలకు శాస్త్రీయమైన సమాచారం అందించడానికి దేశంలోని ప్రముఖ శాస్త్ర విజ్ఞాన సంస్థలు నడుం కట్టాయి. బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌, టాటా మెమోరియల్‌ సెంటర్‌ సంయుక్తంగా https://covid-gyan.in/ అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించాయి. ఇందులో కరోనా వైరస్‌, కొవిడ్‌లకు సంబంధించిన పూర్తి శాస్త్రీయ సమాచారం లభిస్తుంది.


ప్రజల్లో అపోహలను పారద్రోలాలనే ఉద్దేశంతో అనేక మంది ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు దీన్ని నిర్వహిస్తుండటం విశేషం. ఇందులో కొవిడ్‌ 19కు సంబంధించిన వీడియోలు, వెబినార్లు, సందేహాలు - సమాధానాలు, అపోహలు - వాస్తవాలను అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న సమాచారాన్ని వడపోసి, సరైన సమాచారాన్ని మాత్రమే ఇస్తున్నారు. బెంగళూరులోని ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ థియరీటికల్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రాజేష్‌ గోపకుమార్‌ దీనికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, మళయాళంతోపాటు మొత్తం 12 భారతీయ భాషల్లో సమాచారం ఈ వెబ్‌సైట్‌లో లభిస్తుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి, చికిత్స, వ్యాక్సిన్‌ తయారీ, ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల గురించి ప్రజలకు కచ్చితమైన సమాచారాన్ని అందించడం దీని ఉద్దేశమని ప్రొఫెసర్‌ రాజేష్‌ తెలిపారు.

Updated Date - 2020-04-08T13:49:08+05:30 IST