ప్రముఖులపై కరోనా పంజా

ABN , First Publish Date - 2022-01-11T08:10:26+05:30 IST

అగ్ర నేతలు, ముఖ్యమంత్రులు సహా దేశంలో పలువురు ప్రముఖులు కరోనా బారినపడ్డారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కర్ణాటక సీఎం బస్వరాజ్‌ బొమ్మై,..

ప్రముఖులపై కరోనా   పంజా

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌కు కొవిడ్‌

బిహార్‌, కర్ణాటక సీఎంలు నితీశ్‌, బొమ్మైకు వైరస్‌

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పాజిటివ్‌

సీపీఎం అగ్ర నేతలు ప్రకాశ్‌, బృందా కరాత్‌లకూ..

ఇటీవల హైదరాబాద్‌లో ఈ ముగ్గురి పర్యటనలు

సినీ తారలు శోభన, ఖుష్బూలకూ కరోనా నిర్ధారణ

దేశంలో కొత్త కేసులు 1.80 లక్షలు; పాజిటివిటీ 13

నాలుగు రోజుల్లోనే పాజిటివ్‌ రేటు దాదాపు రెట్టింపు

16న తమిళనాడు లాక్‌డౌన్‌.. థర్డ్‌వేవ్‌లో ఇదే తొలి

ఢిల్లీలో రెస్టారెంట్లు, హరియాణాలో బడులు బంద్‌


న్యూఢిల్లీ, జనవరి 10: అగ్ర నేతలు, ముఖ్యమంత్రులు సహా దేశంలో పలువురు ప్రముఖులు కరోనా బారినపడ్డారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కర్ణాటక సీఎం బస్వరాజ్‌ బొమ్మై, బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీపీఎం అగ్ర నేతలు ప్రకాశ్‌ కరాత్‌, బృందా కరాత్‌లకు సోమవారం పాజిటివ్‌ వచ్చింది. బహుభాషా నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ, నటి, నర్తకి శోభనకూ వైరస్‌ నిర్ధారణ అయింది. ఇటీవలి కాలంలో కరోనా సోకిన నాలుగో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌. వారం క్రితం భారతి ప్రవీణ్‌, మహేంద్రనాథ్‌ పాండే, నిత్యానంద రాయ్‌లకూ పాజిటివ్‌ వచ్చింది. కొన్ని రోజుల కిందట రాజస్థాన్‌, ఢిల్లీ సీఎంలు అశోక్‌ గెహ్లోత్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌కూ వైరస్‌ సోకింది. కాగా, రాజ్‌నాథ్‌, బొమ్మై తమకు లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు ప్రకటించారు. ముందుజాగ్రత్త డోసు పంపిణీ ప్రారంభం సహా బొమ్మై సోమవారం కర్ణాటకలో వివిధ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. మరికాసేపటికే ఆయనకు పాజిటివ్‌ వచ్చినట్లు తెలిసింది. ఇక నడ్డా ఈ నెల 6న తెలంగాణలో పర్యటించారు. ర్యాలీతో పాటు పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా సమావేశాల్లో పాల్గొన్నారు.  పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు కారట్‌ దంపతులు ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌ వచ్చారు. 8న వారికి జ్వరం రావడంతో పరీక్ష చేయించుకోగా వైరస్‌ సోకినట్లు తేలింది. ఇద్దరూ హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఐసొలేషన్‌లో ఉన్నారు. కారట్‌ దంపతులతో పాటు సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొన్న ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ సీఎం పినరాయి విజయన్‌, త్రిపుర సీఎం మాణిక్‌ సర్కార్‌ తదితర అగ్ర నేతలు అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలవడం గమనార్హం.


పాజిటివ్‌ రేటు 6న 7.. నేడు 13

దేశంలో ఆదివారం 1,79,723 కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ రేటు 13.29కి చేరింది. లక్ష కేసులు నమోదైన ఈ నెల 6న పాజిటివిటీ 7.74 ఉండగా, కేవలం నాలుగు రోజుల్లోనే దాదాపు రెట్టింపు కావడం దేశంలో కొవిడ్‌ ఉధృతికి అద్దం పడుతోంది. ఢిల్లీలో పాజిటివిటీ 25 కాగా, మహారాష్ట్రలో దాదాపు 20గా ఉంది. కేంద్ర సాయుధ బలగాల్లో నాలుగు రోజుల్లోనే 2 వేల మంది వైరస్‌ బారినపడ్డారు. ఽఢిల్లీలో రోజుల వ్యవధిలో వెయ్యిమంది, పంజాబ్‌లో వారంలో 230 మంది పోలీసులకు పాజిటివ్‌గా తేలింది.  పార్లమెంటులో మంగళవారం నుంచి మూడు రోజులు భారీఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టనున్నారు. సోమవారం 9 లక్షల మందికి ముందుజాగ్రత్త డోసు ఇచ్చినట్లు కేంద్రం పేర్కొంది. కొవిడ్‌ వ్యాప్తితో  ఈ నెల 16న సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలని తమిళనాడు నిర్ణయించింది. 14-18 తేదీల్లో మూడు రోజుల పాటు ఆలయాల్లో ప్రజలకు దర్శనాలను రద్దు చేశారు. హరియాణాలో పాఠశాలలు, విద్యా సంస్థలను ఈ నెల 26 వరకు, ఢిల్లీలో రెస్టారెంట్లను కొన్ని రోజులు మూసివేయున్నారు. యూపీలో కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరును 50 శాతానికి పరిమితం చేశారు. వివాహాలు, అంత్యక్రియలు తదితర కార్యక్రమాల్లో 50 మందికి మించి పాల్గొనేందుకు వీల్లేదని కేరళలో ఉత్తర్వులిచ్చారు.


ఒమైక్రాన్‌ నుంచి కోలుకున్నాక నొప్పులు తీవ్రం

ఒమైక్రాన్‌ లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నా.. కోలుకున్నవారు కొందరు ఒళ్లు, వెన్ను నొప్పులతో విలవిల్లాడుతున్నారనిముంబై వైద్యులు చెబుతున్నారు. విఖ్రోలికి చెందిన నమ్రత(32)కు గొంతు నొప్పి, చలి, జ్వరం వచ్చాయి. ఒక్క రోజులోనే తీవ్రమైన కాళ్లు, వెన్ను నొప్పితో ఇబ్బంది పడింది. జ్వరం సహా ఇతర లక్షణాలు  మామూలు మందులతో తగ్గాయని, అయితే ఇంత వరకు ఎన్నడూ లేనంత వెన్ను నొప్పితో నరకం చూశానని అంధేరీ ప్రాంతానికి చెందిన మహిళ తెలిపారు. యాంటీ బయాటిక్స్‌ తదితర మందుల వల్ల గ్యాస్ట్రిటిస్‌ సమస్య వస్తుందని, దీంతో కొన్నిసార్లు వెన్నునొప్పి వస్తుందని జేజే ఆస్పత్రికి చెందిన ప్రముఖ డాక్టర్‌ ఒకరు ్టతెలిపారు.


నెలాఖరుకల్లా పతాకస్థాయికి 

దేశంలో కరోనా మూడోవేవ్‌ జనవరి నెలాఖరుకల్లా పతాక స్థాయికి చేరొచ్చని ఐఐటీ కా న్పూర్‌ ప్రొఫెసర్‌ మణీంద్ర అగ్రవాల్‌ హెచ్చరించారు. ఈసారి రెండోవేవ్‌ కంటే ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయన్నారు. అయితే ఢిల్లీ, ముంబై, కోల్‌కతాల్లో మరో వారంలోగానే కేసులు పతాక స్థాయికి చేరుతాయని, జనవరి నెలాఖరులోగా మూడోవేవ్‌ ముగిసిపోతుందని అంచనా వేశారు. మిగతా ప్రాంతాల్లో మార్చి రెండో వారం వరకు మూడోవేవ్‌ కొనసాగే సూచనలు ఉన్నాయన్నారు. 


ఆస్పత్రుల్లో చేరుతున్నవారు 5-10%

అయినా పరిస్థితులు మారొచ్చు.. జాగ్రత్త : కేంద్రం లేఖ

న్యూఢిల్లీ, జనవరి 10: ఒమైక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తితో దేశంలో ప్రస్తుతం భారీగా కేసులు నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు/యూటీలకు పరిస్థితిని వివరిస్తూ, కీలక సూచనలతో సోమవారం లేఖ రాసింది. కొత్త వేరియంట్‌ బారినపడినవారిలో 5 శాతం నుంచి 10 శాతం రోగులకు ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం కలుగుతోందని పేర్కొంది. డెల్టా కారణంగా సంభవించిన సెకండ్‌ వేవ్‌లో ఈ శాతం 20 నుంచి 23 అని తెలిపింది. ఆస్పత్రుల్లో చేరికలు స్వల్పంగా ఉన్నాయని.. అలసత్వం వహించొద్దంటూ అప్రమత్తం చేసింది. వేరియంట్‌ క్రియాశీలత దృష్ట్యా పరిణామాలు వేగంగా మారొచ్చని.. ఆస్పత్రి చికిత్స అవసరమయ్యేవారి సంఖ్య పెరగొచ్చని హెచ్చరించింది. హోం ఐసొలేషన్‌, ఆస్పత్రుల్లో ఉన్న రోగులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగాలని సూచించింది.  


‘ప్రైవేటు’ చార్జీలు సహేతుకంగా ఉండాలి

ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగుల కోసం భిన్న సదుపాయాలున్న పడకలను అందుబాటులోకి తెచ్చేలా చూడాలని కేంద్రం కోరింది. వీటి ధరలు సహేతుకంగా ఉండాలని, దీనిని పర్యవేక్షించేందుకు.. అధిక రుసుములపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక యంత్రాంగం ఉండాలని పేర్కొంది. టీకా కేంద్రాలకు నిర్దిష్ట వేళలు నిర్ధారించలేదని.. డిమాండ్‌, అవసరం, వసతులు, సిబ్బంది అందుబాటును బట్టి రాత్రి 10 దాకా నిర్వహించవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసులు, వివరణల దాఖలుకు గడువు (లిమిటేషన్‌ పీరియడ్‌) విషయంలో న్యాయవాదులకు మినహాయింపులు ఇవ్వడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ అసోసియేషన్‌ పెట్టుకున్న అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఆమోదించింది. 



Updated Date - 2022-01-11T08:10:26+05:30 IST