ఈత కొలనులపై కొవిడ్‌ ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2022-04-10T17:12:12+05:30 IST

కరోనా జీహెచ్‌ఎంసీ ఈత కొలనులపైనా ప్రభావం చూపింది. వైరస్‌ వ్యాప్తితో రెండేళ్లుగా నిరుపయోగంగా ఉన్న స్విమ్మింగ్‌ పూళ్లు

ఈత కొలనులపై కొవిడ్‌ ఎఫెక్ట్‌

రెండేళ్లుగా నిరుపయోగం

తుప్పు పట్టిన మోటార్లు, పైపులు

మరమ్మతుకు  శ్రమిస్తోన్న జీహెచ్‌ఎంసీ

25 నుంచి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు


హైదరాబాద్‌ సిటీ: కరోనా జీహెచ్‌ఎంసీ ఈత కొలనులపైనా ప్రభావం చూపింది. వైరస్‌ వ్యాప్తితో రెండేళ్లుగా నిరుపయోగంగా ఉన్న స్విమ్మింగ్‌ పూళ్లు అధ్వానంగా మారాయి. వేసవి శిక్షణ లేకపోవడం.. నిర్వహణను పట్టించుకోని అధికారుల తీరుతో ఇప్పుడు అందుబాటులోకి తీసుకురావడం తలకు మించిన భారంలా మారుతోంది. గత రెండు వారాలుగా శ్రమిస్తున్నా.. మెజార్టీ ఈత కొలనులు ఇంకా సిద్ధం కాలేదు. దీంతో ఈ నెల మొదటి వారంలో శిక్షణ ప్రారంభించాలని భావించినా సాధ్యం కాలేదు. గ్రేటర్‌లో బల్దియాకు సంబంధించిన ఏడు ఈత కొలనులున్నాయి. వేసవి శిక్షణా శిబిరాల సందర్భంగా ఏటా వీటిని అందుబాటులోకి తీసుకువస్తారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రెండేళ్లు శిబిరాలు నిర్వహించ లేదు. దీంతో కొలనుల నిర్వహణను అధికారులు పట్టించుకోలేదు. మోటార్లు, పైపులు తుప్పు పట్టి పోయాయి. వాటి మరమ్మతు/కొత్తవి ఏర్పాటు చేయడంపై దృష్టి సారించారు. రెండు వారాలుగా క్షేత్రస్థాయిలో ఇదే పనులు చేస్తున్నట్టు క్రీడా విభాగం అధికారొకరు తెలిపారు. 


రూ. 2 కోట్లతో పరికరాలు 

ఈ నెల 25వ తేదీ నుంచి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ప్రారంభం కానున్నాయి. క్రీడా పరికరాలు సమకూర్చుకునేందుకు టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించారు. ఏజెన్సీని ఎంపిక చేసినట్టు ఇంజనీరింగ్‌ విభాగం అధికారొకరు చెప్పారు. గతంలో మిగిలిన సామగ్రి వినియోగించడంతోపాటు.. ఈ యేడాది అవసరాల కోసం రూ.2 కోట్లతో పరికరాలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. 2020 మార్చి నుంచి నగరంలో కరోనా మహమ్మారి విజృంభణ మొదలైంది. దీంతో ఆ యేడాది నిర్వహించాల్సిన వేసవి శిక్షణా శిబిరాలు రద్దు చేశారు. 2021లోనూ ఫిబ్రవరి మొదలు జులై వరకు వైరస్‌ రెండో దశ వ్యాప్తి తీవ్రమైంది. దీంతో గత సంవత్సరమూ వేసవి శిబిరాల నిర్వహణ సాధ్యపడలేదు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ సంవత్సరం క్రీడల్లో శిక్షణకు జీహెచ్‌ఎంసీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ నెల 25 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు 37 రోజులపాటు శిబిరాలు కొనసాగుతాయి. ప్రతి యేటా 44 అంశాల్లో శిక్షణ ఇస్తుంటారు.


వుషు, వెస్లింగ్‌ రోమన్‌, క్రాఫ్‌ బాల్‌, స్కై మార్షల్‌ ఆర్ట్స్‌, టగ్గాఫ్‌ వార్‌, బీచ్‌ వాలీబాల్‌ వంటి ఆటలపై పిల్లలు అంతగా ఆసక్తి చూపని దృష్ట్యా.. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న 30 క్రీడల శిక్షణకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఉదయం 6 నుంచి 8.30 గంటలు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు శిక్షణ ఉండనుంది. శిబిరాల్లో పాల్గొనాలనుకునే వారు ఆన్‌లైన్‌లో నిర్ణీత రుసుము చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందని క్రీడా విభాగం అధికారొకరు తెలిపారు. శిక్షణా కేంద్రాల వారీగా కిట్‌లు సరఫరా చేయనున్నారు. గతంలోలా డివిజన్ల వారీగా కార్పొరేటర్ల ఆధ్వర్యంలో పంపిణీ ఉండదని పేర్కొన్నారు.

Updated Date - 2022-04-10T17:12:12+05:30 IST