Abn logo
Jun 11 2021 @ 09:01AM

నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న హైదరాబాద్ ‘మెట్రో’!

  • రెండో దశ పనులపై తీవ్ర ప్రభావం
  • కొవిడ్‌తో ఏడాదిన్నరగా నష్టాలు 
  • బడ్జెట్‌లో రూ. 1000 కోట్లు 
  • కేటాయించినా ఇచ్చే పరిస్థితి కరువు
  • ఎయిర్‌పోర్టు పనులు ముందుకు సాగడం కష్టమేనా..?

హైదరాబాద్‌ సిటీ : నగరవాసులకు అత్యంత సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్న మెట్రో రైలు సంస్థ నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. మహమ్మారి నేపథ్యంలో రోజువారీ కార్యకలాపాలు అరకొరగానే సాగుతుండడంతో ఆశించిన ఆదాయాన్ని పొందలేకపోతుంది. ఫలితంగా ఉద్యోగుల వేతనాలతోపాటు నిర్వహణ ఖర్చులు మోయలేక అవస్థలు పడుతోంది. ఇదే క్రమంలో డీటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) పూర్తి చేసుకుని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న రెండో దశ పనులకు కూడా బ్రేక్‌ పడింది. కొవిడ్‌ కారణంగా ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన నిధులను ఇప్పట్లో విడుదల చేసే పరిస్థితి లేకపోవడంతోపాటు పెట్టుబడి దారులు సైతం ఆసక్తి చూపించకపోవడంతో కొత్త ప్రాజెక్టులు అందనంత దూరంలో ఉన్నాయని చెప్పవచ్చు.


భారీగా తగ్గిన ప్రయాణికులు

 కొవిడ్‌ రాకముందు  మూడు మార్గాల్లోని 66 స్టేషన్ల మీదుగా ప్రతిరోజు దాదాపు 3.50 లక్షల నుంచి 4లక్షల మంది వరకు ప్రయాణం చేశారు. కొవిడ్‌ తొలిదశ అన్‌లాక్‌లో భాగంగా గతేడాది సెప్టెంబర్‌ 7న రైళ్లు పునఃప్రారంభమైనప్పటికీ ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. గత అక్టోబర్‌ నుంచి మే 12 లాక్‌డౌన్‌ ముందు వరకు గరిష్టంగా 1.60 లక్షల నుంచి 1.80 లక్షల మంది వరకు మాత్రమే రోజువారీ రాకపోకలు సాగించారు. ప్రస్తుతం రెండోదశ కేసుల నేపథ్యంలో మే 12నుంచి కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో ప్యాసింజర్ల సంఖ్య 80 శాతానికి తగ్గింది. రోజుకు సగటున 20 నుంచి 30 వేల మంది వరకు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. 


ఏడాదిన్నరగా నష్టాలు...

కొవిడ్‌కు ముందు పంజాగుట్ట, ఎర్రమంజిల్‌, హైటెక్‌సిటీ, మూసారాంబాగ్‌ మెట్రో స్టేషన్లకు అనుసంధానంగా ఏర్పాటు చేసిన భారీ మాల్స్‌లో ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు ఎప్పుడూ రద్దీ ఉండేది. ఈ క్రమంలో గతంలో ప్రయాణికుల టికెట్లు, ప్రకటనలు, మాల్స్‌ ద్వారా ఏడాదికి దాదాపు రూ. వెయ్యికోట్లకు పైగా ఆదాయం వచ్చేది. అయితే కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి 16న నిలిచిపోయిన రైళ్లు ఆరునెలల తర్వాత పట్టాలెక్కినా  ఆశించిన మేర ప్రయాణికులు రాకపోవడంతో మాల్స్‌ ఆదాయం భారీగా తగ్గింది. దీంతో మెట్రో నష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. ఇదిలా ఉండగా, 2020 అక్టోబర్‌ నుంచి 2021 మార్చి ఆర్థిక సంవత్సరం ముగిసే ముందు రూ.916 కోట్ల నష్టంతో ఉన్న హైదరాబాద్‌ మెట్రో.. ఆ తర్వాత నుంచి మరిన్ని నష్టాలు ఎదుర్కొంటోంది. 2020లో మార్చి 16 నుంచి సెప్టెంబర్‌ 7 వరకు మెట్రో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోవడంతో ఆ మధ్య కాలంలో దాదాపు రూ.1780కోట్ల నష్టం సంస్థపై పడినట్లు తెలిసింది. కాగా, మెట్రో టికెట్లు, మాల్స్‌, స్టాళ్ల నిర్వహణతోపాటు ప్రకటనల ద్వారా రూ.366 కోట్ల ఆదాయం వచ్చినప్పటికీ.. ఆపరేషన్స్‌ వ్యయం, పరిపాలనా ఖర్చులు, ఉద్యోగుల జీతాలకు దాదాపు రూ.280 కోట్లు చెల్లించారు. దీంతో ఆరునెలల కాలంలో వచ్చిన ఆదాయం నిర్వహణకే సరిపోయిందని మెట్రో వర్గాలు తెలిపాయి. 


రెండో దశ పనులకు బ్రేక్‌..

రెండో దశ పనుల్లో భాగంగా రాయదుర్గం (రహేజా మైండ్‌ స్పేస్‌) స్టేషన్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు వయా ఓఆర్‌ఆర్‌ మీదుగా (31 కిలోమీటర్లు), బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకపూల్‌ వయా కొండాపూర్‌, గచ్చిబౌలి, ఓల్డ్‌ ముంబయి హైవే, మెహిదీపట్నం మీదుగా (26 కిలో మీటర్లు) ప్రతిపాదించారు. ఈ మేరకు జీఎంఆర్‌ భాగస్వామ్యంతో చేపట్టనున్న 31 కిలోమీటర్ల ఎయిర్‌పోర్టు పనులకు సుమారు రూ.5వేల కోట్లు, ఇతర మార్గాలకు రూ.3వేల కోట్లు అవసరముంటుందని అధికారులు ప్రతిపాదించారు. కాగా, ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలును అత్యంత కీలకమైన ప్రాజెక్టుగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) పేరిట స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్పీవీ)ని ఏర్పాటు చేసి జీఓ 66ని జారీ చేసింది. అలాగే  గ్రేటర్‌ ఎన్నికల్లో ఇచ్చిన  హామీ మేరకు ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాల్లో రూ.1000కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే  బడ్జెట్‌లో ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన్నప్పటికీ కొవిడ్‌ ఇబ్బందుల నేపథ్యంలో ఇప్పట్లో ఆ డబ్బులను విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. మరో వైపు పెట్టుబడిదారులు కూడా పనుల నిర్వహణకు ఆసక్తి చూపించడంలేదని మెట్రో వర్గాలు చెబుతున్నాయి.