Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా వాసనలు తెలియట్లేదా.. అసలు కారణమేంటేంటే?

twitter-iconwatsapp-iconfb-icon

ఆంధ్రజ్యోతి(08-02-2022)

కొందరు కొవిడ్‌ నుంచి కోలుకుంటారు. కానీ చాలా రోజుల వరకూ రుచి, వాసనలు తిరిగి రావు. ఇది కొందరు ఎదుర్కొనే సమస్య. అయితే కొందరికి కేవలం మూడు వాసనలు మాత్రమే వచ్చే చిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితి గురించి - ఈ సమస్యపై అధ్యయనం చేస్తున్న డాక్టర్‌ శ్రీనివాస కిషోర్‌ శిష్ట్ల ‘డాక్టర్‌’కు వివరించారు. 


‘‘వాసన, రుచి అనేవి కవలల వంటివి. ఈ రెండింటికీ చాలా దగ్గర సంబంధం ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే- మనకు ఎక్కువగా జలుబు చేసినప్పుడు వాసనతో పాటు రుచి కూడా తెలియదు. కొవిడ్‌ రెండో వేవ్‌లో చాలా మందికి రుచి, వాసనలు తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. కాలంతో పాటుగా చాలామందికి రుచి, వాసనలు పసిగట్టే గుణాలు తిరిగి వచ్చేశాయి. అయితే కొద్ది మందిలో మాత్రం ‘స్మెల్‌ ఆలే్ట్రషన్‌’ అనే సమస్య ఎదురవుతోంది. స్మెల్‌ ఆలే్ట్రషన్‌ అంటే వాసనలను పూర్తిగా కోల్పోవటం కాదు. కొన్ని వాసనలను మాత్రమే పసిగట్టగలగటం. దీనినే శాస్త్ర పరిభాషలో  ’హైపోస్మియా‘ అంటారు.  ఈ మధ్య కాలంలో మా దగ్గరకు ఈ తరహా సమస్య ఉన్న రోగులు అనేక మంది వస్తున్నారు. వీరికి మూడు రకాల వాసనలు మాత్రమే తెలుస్తున్నాయి. అవి కాలిన వాసన(పొగ).. మండే ఇంధనం వాసన.. ‘మలం’ వాసన. 

 

సమస్యకు కారణం ఏమిటి?

కొవిడ్‌ వైరస్‌ ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించే సమయంలో ముక్కులోని వాసన పసిగట్టే నాడుల్లో కొన్ని మార్పులు వస్తాయి. కొవిడ్‌ తగ్గిన తర్వాత ఇవి పూర్వ స్థితికి చేరుకుంటాయి. కానీ కొందరిలో పూర్వ స్థితికి రావు. అందువల్ల వారిలో ఈ సమస్య ఏర్పడుతుంది. సాధారణంగా ముక్కులో ఏవైనా కణుతులు ఉన్నప్పుడు శస్త్రచికిత్స చేసి వాటిని తొలగిస్తూ ఉంటాం. ఆ సమయంలో కొందరిలో ఈ తరహా సమస్య ఏర్పడుతుంది. ఎటువంటి శస్త్ర చికిత్స చేయకుండా ఈ తరహా సమస్యలు ఇప్పటిదాకా ఎవరికీ రాలేదు. కోవిడ్‌ తర్వాత మాత్రమే ఈ సమస్య ఎదురవుతోంది. ఈ సమస్యతో బాధపడుతున్నవారికి కేవలం మూడు వాసనలు మాత్రమే ఎందుకు వస్తున్నాయనే విషయం ఇంకా ఎవరికీ తెలియదు. సాధారణంగా ముక్కులో ఉండే వాసన నరాలకు సమస్య వచ్చినప్పుడు- ఈ తరహా వాసనలు వస్తాయి. దానికి కారణం ఇంకా శాస్త్రవేత్తలు కనుగొనలేకపోయారు. 


వేరే సమస్యలు..

గ్రహణ శక్తిని పూర్తిగా కోల్పోతే దాని వల్ల కలిగే సమస్యలు వేరేగా ఉంటాయి. కానీ ‘హైపోస్మియా’ వల్ల చెడు వాసనలు మాత్రమే వస్తాయి. దీని ప్రభావం వ్యక్తుల జీవనశైలిపై పడుతుంది. ఏ పదార్థమైనా చెడు వాసన రావటంతో- ఆహారంపై విముఖత ఏర్పడుతుంది. దీని వల్ల వారికి సరైన పోషక పదార్థాలు అందవు. మా అధ్యయనంలో ఈ సమస్యలన్నీ పురుషుల్లో కన్నా మహిళల్లో ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

 

చికిత్స ఏమిటి?

ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారాలు తప్ప వేరే మార్గం లేదు. దాదాపు ఆరు నెలల పాటు వారికి సువాసన నూనెలను క్రమం తప్పకుండా వాసన పీల్చేలా చేస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది. ఒక వైపు ఈ చికిత్స తీసుకుంటూనే.. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉన్న ఆహారం తిన్నవారిలో కూడా ఈ సమస్యలు తగ్గుముఖం పట్టినట్లు మా అధ్యయనంలో తేలింది. 


ఏది ఒమైక్రాన్‌?

నార్మల్‌ ఫూ, ఒమైక్రాన్‌... ఈ రెండింటికీ పెద్దగా తేడా ఉండటం లేదు. మునుపు అనుభవంలోకి రానంత తీవ్రమైన గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు ఒమైక్రాన్‌లో ఉంటున్నాయి. చికెన్‌ గున్యా లక్షణాలకూ ఒమైక్రాన్‌కూ చాలా దగ్గర పోలికలుంటాయి. కరోనా వేరియంట్‌ ఏదైనా ఇటువంటి లక్షణాలు కలిగిస్తుంది. ఈ సమయంలో విపరీతమైన జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం ఉంటే అది ఒమైక్రాన్‌. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, కుటుంబసభ్యులకు దూరంగా ఏడు రోజులు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటే.. సమాజానికి కూడా మేలు చేసిన వారవుతారు. వారికి భోజనం అందించేవారు, ఇంకా ఇతరత్రా సాయం చేసే వారు తప్పనిసరిగా మాస్క్‌ ధరించి, సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులు శుభ్రపరుచుకోవాలి. 


బ్లాక్‌ ఫంగస్‌ కేసులెందుకు లేవు?

కొవిడ్‌ రెండో వేవ్‌లో చాలా మందికి ఆక్సిజన్‌ సాయం అవసరమయింది. ఆక్సిజన్‌ను సరఫరా చేసే పైపులు, మాస్క్‌లు శుభ్రంగా లేకపోవటం బ్లాక్‌ ఫంగస్‌ వ్యాప్తికి ఒక కారణం. దీనితో పాటుగా  చాలా మంది అవసరం లేకున్నా స్టెరాయిడ్స్‌ వాడారు. ఇవి కూడా బ్లాక్‌ ఫంగస్‌ వ్యాప్తికి కారణమయ్యాయి. అదృష్టవశాత్తు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఎక్కువ వ్యాప్తి చెందే సమయంలో కొవిడ్‌ వ్యాప్తి మందగించింది. దీనితో బ్లాక్‌ ఫంగస్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఒమైక్రాన్‌ వచ్చిన వారికి ఆక్సిజన్‌ సమస్య ఉండటం లేదు. అందువల్ల బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరిగే అవకాశమే లేదు.


డా. శ్రీనివాస కిషోర్‌ శిష్ట్ల 

డైరెక్టర్‌, హెచ్‌ఓడీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఓటోలారిన్‌జాలజీ(ఈన్‌టి)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

చిత్రజ్యోతి Latest News in Teluguమరిన్ని...

ప్రత్యేకంLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.