కొవిడ్‌ దుస్తులొస్తున్నాయ్‌!

ABN , First Publish Date - 2020-08-01T07:38:09+05:30 IST

కొవిడ్‌ దుస్తులొస్తున్నాయ్‌!

కొవిడ్‌  దుస్తులొస్తున్నాయ్‌!

కొవిడ్‌తో మనం మరి కొద్ది కాలం సహజీవనం చేయకతప్పదు. వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత కూడా ఈ వైరస్‌ నుంచి తప్పించుకోవటానికి మాస్కులు, ఇతర రక్షణ సామగ్రి ధరించక తప్పదు. ఈ క్రమంలోనే వైరస్‌ నుంచి రక్షించే నానో దుస్తుల తయారీకి ప్రయత్నాలు ఊపందుకున్నాయి. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) నుంచి స్థానికంగా దుస్తులు తయారుచేసే  కంపెనీల వరకూ అందరూ వైరస్‌ నుంచి రక్షించే దుస్తుల తయారీకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక సారి ఈ దుస్తులు మార్కెట్‌లోకి ప్రవేశిస్తే.. వీటి విలువ వేల కోట్లలో ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


ప్రముఖ సంస్థ సీయరాం- కొవిడ్‌ వైర్‌సను 99.94ు అడ్డుకునే దుస్తులకు సంబంధించి విడుదల చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. సీయరాం కంపెనీ ఆస్ట్రేలియాకి చెందిన హెల్త్‌గార్డ్‌తో కలిపి ఈ దుస్తులను తయారు చేస్తుండగా, మరోవైపు.. స్వదేశీ టెక్నాలజీతో ఈ తరహా దుస్తులను రూపొందించడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ‘‘నానో మెటీరియల్స్‌కు వైర్‌సను అడ్డుకునే శక్తి ఉందనే విషయం మనకు ఎప్పటి నుంచో తెలుసు. దాదాపు 8 ఏళ్ల క్రితం డీఆర్‌డీవోకి చెందిన డీఐఏడీతో కలిపి మేము వైర స్‌ను ఎదుర్కొనే దుస్తులను తయారుచేశాం. ఈ దుస్తులు- వైరస్‌, బ్యాక్టీరియాలు మన శరీరాన్ని తాకకుండా అడ్డుకుంటాయి. మేము నానో కాపర్‌, నానో సిల్వర్‌, నానో జింక్‌లతో ప్రయోగాలు చేశాం. ఇవన్నీ విజయవంతమయ్యాయి. అయితే వీటిని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయటంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. పరిశోధనలపైనే మా శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరించాం’’ అని చెప్పారు శ్రీమహర్షి ఇన్‌స్టిట్యూట్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఎబిఎస్‌ శాస్త్రి. రాగి, జింక్‌, వెండి మొదలైన లోహాలకు వైర్‌సను ఎదుర్కొనే శక్తి ఉందని మన పూర్వీకులు భావిస్తూ వచ్చారు. కొన్ని రకాల మూలికలను కలిపి.. వేడిచేయటం ద్వారా వీటి కణాలలో మార్పులు తేవచ్చని వారు కనుగొన్నారు. ఈ విధానాన్ని సిద్ధ వైద్య పద్ధతిలో పుటం పెట్టడం అని కూడా అంటారు. ఇలా మార్పులు చేసిన లోహాల ద్వారా తయారుచేసిన మందులను వారు రకరకాల జ్వరాలు.. అంటువ్యాధులను తగ్గించటానికి వాడేవారు. ‘‘ఒక లోహపు కణ కేంద్రకంలో మార్పులు జరిగినప్పుడు- ఆ లోహతత్వం కూడా మారుతుంది. దాని పరిమాణం కూడా మారుతుంది. ఇలా ఏర్పడేవే నానో కణాలు. ఇలాంటి కణాలకు వైర్‌సను అడ్డుకునే శక్తి ఉంటుంది. మేము చేసిన అనేక పరిశోధనల్లో నానో జింక్‌, నానో సిల్వర్‌, నానో కాపర్‌ కణాలకు ఈ శక్తి ఉందని తేలింది. హెపటైటిస్‌ బీ వంటి ప్రమాదకరమైన వైర్‌సలను ఎదుర్కొనే శక్తి వీటికి ఉంటుంది. ఈ నానో లోహాలను మామూలు దుస్తులపై పూత పూసి లేదా.. బట్టను తయారుచేసే సమయంలో కలిపి వాడితే వైరస్‌, బ్యాక్టీరియాలను ఎదుర్కోవచ్చు. మేము ఇలాంటి దుస్తులను తయారుచేశాం. అయితే ఇవి కొవిడ్‌ను ఎదుర్కొంటాయా? లేదా అనే విషయం నిర్ధారించాల్సి ఉంది. కొన్ని నమూనాలను తయారుచేసి పరిశోధనశాలలకు పంపాం. ఇంకా  ఫలితాలు రావాల్సి ఉంది’’ అని డీఆర్‌డీవోకి చెందిన పరిశోధనా సంస్థ డీఎంఆర్‌ఎల్‌కు చెందిన శాస్త్రవేత్త ఒకరు వెల్లడించారు. 


వైర్‌సతోనే సమస్యంతా!

ఈ వైరస్‌ అత్యంత ప్రమాదకరమైనది. అందువల్ల కొన్ని పరిశోధనాశాలల్లో మాత్రమే పరీక్షలకు అనుమతి ఇచ్చారు. వైర్‌సను ఎదుర్కొనే దుస్తుల నమూనాల పరీక్షకు సీసీఎంబీకి రెండు నెలల క్రితం ఇచ్చాం.  కొవిడ్‌ వైర్‌సకు సంబంధించిన ప్రొటోకాల్స్‌ను ఇంకా అభివృద్ధి చేయలేదు. అందువల్ల ఈ పరీక్షలు విదేశాల్లోనే జరుగుతున్నాయి. మన దేశంలో ఇలాంటి పరీక్షలు జరగటం లేదు..’’ అని వెట్రెక్స్‌ కంపెనీ సీఈవో శ్రీనివాస రాజు వెల్లడించారు. నానో మెటీరియల్‌ ఆధారిత దుస్తులను రకరకాలుగా వాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ‘‘పీపీఈ కిట్‌లు.. మాస్క్‌లు.. ఆస్పత్రుల్లో బెడ్‌ షీట్లు, డాక్టర్లు  వేసుకొనే కోట్లు.. నర్సుల యాప్రాన్లు.. ఇలా ఒకటేమిటి.. రకరకాలుగా వాడుకోవచ్చు. పైగా వీటికి ఖరీదు ఎక్కువ కూడా కాదు’’ అని  తెలిపారు.  - స్పెషల్‌ డెస్క్‌


రెండు పద్ధతులు..

‘‘వైరస్‌ ప్రవేశించకుండా అడ్డుకునే దుస్తులను 2 రకాలుగా తయారుచేస్తారు. ఒక పద్ధతిలో బట్టపైన కోటింగ్‌ వేస్తారు. రెండో పద్ధతిలో బట్టను తయారుచేసే సమయంలోనే నానో మెటీరియల్‌ను కలుపుతారు. మొదటి పద్ధతిలో తయారుచేసిన బట్ట పీపీఈ సూట్‌లు, మాస్క్‌లు తయారుచేయటానికి అనువుగా ఉంటుంది. రెండో పద్ధతిలో తయారుచేసే బట్ట ద్వారా షర్టులు, ఫ్యాంటులు కూడా కుట్టవచ్చు. ‘‘మొదటి పద్ధతిలో నానోమెటీరియల్‌ను బట్టపై లేమినేట్‌ చేస్తాం. ఆస్పత్రుల్లో వాడే కర్టెన్లు, పీపీఈ సూట్స్‌ లాంటి వాటికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక రెండో పద్ధతిలో నానోమెటీరియల్‌ను బట్టను తయారుచేసే సమయంలోనే కలుపుతాం. దీని వల్ల నానోకణాల దారాల ద్వారా బట్ట తయారవుతుంది.’’ అని శాస్త్రి వివరించారు.

Updated Date - 2020-08-01T07:38:09+05:30 IST