కొవిడ్‌ నీరసం తగ్గాలంటే...

ABN , First Publish Date - 2021-10-12T05:59:05+05:30 IST

కొవిడ్‌ నుంచి కోలుకున్నా నీరసం, నిస్సత్తువలు దీర్ఘకాలం పాటు వేధిస్తూనే ఉంటాయి.

కొవిడ్‌ నీరసం తగ్గాలంటే...

డైట్‌

కొవిడ్‌ నుంచి కోలుకున్నా నీరసం, నిస్సత్తువలు దీర్ఘకాలం పాటు వేధిస్తూనే ఉంటాయి. వీటిని వదిలించుకోవాలంటే బలవర్థకమైన ఆహారం ఎంచుకోవడంతో పాటు కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలి. అవేంటంటే...


ప్యాకేజ్‌డ్‌ ఫుడ్‌:

నీరసంగా ఉందని నేరుగా తినగలిగే ప్యాకేజ్‌డ్‌ ఫుడ్‌ ఎంచుకోవడం సరి కాదు. ఇలాంటి ప్యాకేజ్‌డ్‌ ఫుడ్స్‌లో సోడియంతో పాటు నిల్వ కోసం ప్రిజర్వేటివ్స్‌ ఉంటాయి. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచే ఈ పదార్థాలు కలిసిన ఆహారం తింటే, కొవిడ్‌ నుంచి కోలుకునే వేగం కుంటుపడుతుంది. అలాగే రోగనిరోధకశక్తి కూడా సన్నగిల్లుతుంది.


ఘాటు పదార్థాలు:

ఘాటుగా ఉండే మసాలాలు, కారాలు గొంతును ఇరిటేట్‌ చేసి, దగ్గును పెంచుతాయి. కాబట్టి వంటల్లో కారానికి బదులుగా మిరియాల పొడి వాడుకోవాలి. మిరియాలకు యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీమైక్రోబియల్‌ గుణాలు ఉంటాయి. కాబట్టి వ్యాధి నుంచి కోలుకోవడానికి మిరియాలు దోహదపడతాయి.


వేపుళ్లు:

వేపుళ్లలో కొవ్వు పదార్థం ఎక్కువ. దాంతో పదే పదే తినాలనే కోరిక పెరుగుతుంది. పైగా ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుని, జీర్ణవ్యవస్థ మీద భారం పెంచుతాయి. పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా మీద కొవ్వులు చెడు ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది. అంతే కాకుండా వేయించిన పదార్థాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. కాబట్టి కొవిడ్‌ నుంచి కోలుకునే సమయంలో వేపుళ్లకు దూరంగా ఉండాలి.


తీపి పానీయాలు:

తీపిగా ఉండే పానీయాలన్నీ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచి, కోలుకునే వేగాన్ని తగ్గిస్తాయి. కాబట్టి వీటికి బదులుగా మజ్జిగ, సోడా కలిపిన నిమ్మరసం లాంటి పానీయాలు ఎంచుకోవాలి.

Updated Date - 2021-10-12T05:59:05+05:30 IST