అప్రమత్తతే ఆయుధం: సీఎం

ABN , First Publish Date - 2022-04-26T12:42:55+05:30 IST

రాష్ట్రంలో మళ్ళీ కరోనా వైరస్‌ వ్యాప్తి చెంద కుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని, టీకాల కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని, అదే సమయంలో మాస్కు

అప్రమత్తతే ఆయుధం: సీఎం

- కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టండి

- వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయండి

- కలెక్టర్లకు సీఎం స్టాలిన్‌ ఆదేశం


చెన్నై: రాష్ట్రంలో మళ్ళీ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని, టీకాల కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని, అదే సమయంలో మాస్కు నిర్బంధం చేయాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆదేశాలిచ్చారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రస్తుతం కరోనా కేసులు అధికమవుతుండటంతో రాష్ట్రంలో మళ్ళీ కరోనా వ్యాప్తికాకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారని తెలిపారు. కరోనా నిరోధక చర్యలపై సమీక్షించేందుకు సోమవారం ఉదయం సచివాలయంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, వైద్యనిపుణులతో ఆయన సమావేశమయ్యారు. ఆ సందర్భంగా సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఆయన చర్చించారు. రాష్ట్రంలో కరోనా రెండో అల తీవ్రరూపం దాల్చిన సమయంలో తాను ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టానని, ఆ తర్వాత ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది, పారిశుద్ధ్యకార్మికులు సహా అన్ని శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లు సమష్టి చర్యల కారణంగా ముప్పై వేలకు పైగా ఉన్న కేసులు ప్రస్తుతం పదుల సంఖ్యకు చేరాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్‌డ్రైవ్‌లు నిర్వహించడంతో టీకాల కార్యక్రమాలు కూడా విజయవంతమయ్యాయని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్యోగశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జె.రాధాకృష్ణన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, డీజీపీ శైలేంద్రబాబు, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్ సింగ్‌ బేదీ, పోలీసు కమిషనర్‌ శంకర్‌జివాల్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అముదా, రెవెన్యూ, విపత్తుల నివారణ శాఖ కమిషనర్‌ ఎ.సిద్ధిక్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-26T12:42:55+05:30 IST