తరుముకొస్తోంది

ABN , First Publish Date - 2022-01-19T06:12:33+05:30 IST

జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 245 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సంక్రాంతి సెలవుల్లో వివిధ ప్రాంతాల ప్రజల రాకపోకలు కారణంగా పాజిటివ్‌ కేసులు పెరుగుతాయని వైద్యవర్గాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో కరోనా మూడో దశ (థర్డ్‌ వేవ్‌)లో తొలిసారిగా మూడంకెల్లో కేసులు నిర్ధారణ అయ్యాయి.

తరుముకొస్తోంది

పెరుగుతున్న కొవిడ్‌ పాజిటివ్‌ బాధితులు

సెల్ఫ్‌ టెస్ట్‌లతో హోం ఐసోలేషన్‌లోనే ఎక్కువ మంది

లక్షణాలుంటేనే  టెస్టులు.. అవీ రోజుకు రెండు వేలలోపే  

కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలుగా ఫంక్షన్‌ హాళ్లు

 భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు టిడ్కో ఇళ్లలో రెండు వేల పడకల ఏర్పాటు.. 


కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ తరుముకొస్తోంది. నిన్న మొన్నటి వరకు అక్కడక్కడా కేసులు నమోదయ్యేవి. అవి రెండంకెల లోపే. మంగళవారం ఒక్కసారిగా 245 కేసులు రావడంతో కలకలం రేపింది. పండుగలకు ఇతర ప్రాంతాల నుంచి రావడం, మూడు రోజులు కోడి పందేలు, జాతరలు, వేడుకల్లో జనం పాల్గొనడంతో వైరస్‌ విజృంభించింది. రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు   నమోదవుతాయని, కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం రాత్రి నుంచే రాత్రి కర్ఫ్యూ మొదలైంది. 


ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 18 : జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 245 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సంక్రాంతి సెలవుల్లో వివిధ ప్రాంతాల ప్రజల రాకపోకలు కారణంగా పాజిటివ్‌ కేసులు పెరుగుతాయని వైద్యవర్గాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో కరోనా మూడో దశ (థర్డ్‌ వేవ్‌)లో తొలిసారిగా మూడంకెల్లో కేసులు నిర్ధారణ అయ్యాయి. అనధికారికంగా కేసుల సంఖ్య మరికొన్ని రెట్లు అధికంగానే ఉంటాయని భావిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 115 ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ జోన్‌లు ఏర్పాటయ్యాయి. బహిరంగ మార్కెట్‌లో, మందుల షాపుల్లో కరోనా సెల్ఫ్‌ టెస్ట్‌ కిట్‌లు రూ.250లకే లభిస్తుండడంతో చాలా మంది వాటిని కొనుగోలు చేసుకుని వైరస్‌ను నిర్ధారించుకోవడం ద్వారా హోం ఐసోలేషన్‌లోనే ఉండిపోతున్నారు. కొవిడ్‌ ఉధృతి ప్రారంభమైనప్పటికీ విద్యా సంస్థలను యధాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో కొవిడ్‌ బాధితుల కోసం తాత్కాలిక సంరక్షణ కేంద్రాలను పాఠశాలలు, కళాశాలల్లో కాకుండా స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని కల్యాణ మండపాలు, భవనాల్లో తెరవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.


మరో ఆరుగురు టీచర్లకు పాజిటివ్‌ 

మంగళవారం మరో ఆరుగురు టీచర్లకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో సోమ, మంగళవారాల్లో పాజిటివ్‌ నిర్ధారణ అయినవారిలో పది మంది టీచర్లు, ఒక ఉపాధ్యాయేతర సిబ్బంది ఉన్నారు. తాజాగా కరోనా నిర్ధారణ అయిన టీచర్లలో పాలకోడేరు మండలం గొల్లలకోడేరు, జంగారెడ్డిగూడెంలోని ఇందిరానగర్‌కాలనీ, కొవ్వూరు మండలం చిడిపి, మద్దూరులంక, భీమవరం మండలం దొంగపిండి, పోడూరు మండలం రాజులగరువు పాఠశాలల్లో ఆరుగురు ఉపాధ్యాయులకు కరోనా నిర్ధారణ అయ్యింది.


సిబ్బందికి పీపీఈ కిట్లు ఇవ్వాలి

ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది అందరికీ కొవిడ్‌ నుంచి భద్రత కోసం పీపీఈ కిట్‌లు, వైరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కిట్‌లను ఇవ్వాలని అభ్యర్ధిస్తూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ–ఎపి) రాష్ట్ర చైర్మన్‌ డాక్టర్‌ సి.శ్రీనివాసరాజు మంగళవారం సచివాలయంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రాల్లో మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. రోజూ నమోదవు తున్న కేసుల్లో కనీసం ఐదు శాతం పాజిటివ్‌ కేసుల శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ నిమిత్తం పంపాలని సూచించారు. కొవిడ్‌ పాజిటివిటీ రేటు 40 నుంచి 60 శాతానికి పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ మేరకు టెస్టుల సంఖ్యను పెంచి యుద్ధ ప్రాతిపదికన హోం ఐసోలేషన్‌, కరోనా లక్షణాలు ఉన్నవారికి వైద్య సేవలు అందించాలని కోరామని డాక్టర్‌ శ్రీనివాసరాజు వివరించారు.


కొవిడ్‌ సేవలకు సిబ్బంది కొరత 

ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక కొవిడ్‌ కేర్‌ సెంటర్‌(సీసీసీ)ని ఏర్పాటు చేయడంతోపాటు,   పది ప్రైవేటు, నాలుగు ప్రభుత్వాసుపత్రులను కొవిడ్‌ బాధితులకు కేటాయించారు. వీటిలో వైద్య సేవలందించేందుకు సిబ్బంది నియామకాలను ప్రారంభించినప్పటికీ స్పందన కొరవడింది. కొవిడ్‌ ఆసుపత్రులకు 400 మంది వైద్యులు అవసరమని గుర్తించగా, ఇప్పటి వరకు 60 మంది మాత్రమే ముందుకు వచ్చారు. వీరితోపాటు 250 మంది స్టాఫ్‌ నర్సులు, 50 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, పది మంది ఫార్మాసిస్టులు మాత్రమే కొవిడ్‌ సేవలకు సంసిద్ధత వ్యక్తం చేయగా, దీనికి ఐదారు రెట్ల సంఖ్యలో సిబ్బంది  కావాలి. థర్డ్‌ వేవ్‌లో గుర్తించిన ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వమే వైద్య సిబ్బందిని ఇవ్వాలి. 


టెస్ట్‌లు రోజుకు రెండు వేలలోపే.. 

కరోనా మొదటి, రెండవ దశల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు రోజుకు సగటున పది వేల వరకు నిర్వహిం చేవారు. థర్డ్‌ వేవ్‌లో రోజువారీ టెస్టుల సంఖ్యను రెండు వేలలోపే చేస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్న వారికి మాత్రమే కరోనా టెస్ట్‌ లు చేయాలన్న ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల మేరకే పరీక్షలు నిర్వహిస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. పీహెచ్‌సీలు, పట్టణాల్లోని అర్బన్‌ పీహెచ్‌సీలు, అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో  కరోనా పరీక్షలకు ఏర్పాట్లు చేశారు.


 నరసాపురం కమిషనర్‌కు కరోనా

నరసాపురం, జనవరి 18 : నరసాపురం ముని సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. ఐదు రోజుల నుంచి ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ నెల 11న ఆయన విధుల్లో చేరారు. హైదరాబాద్‌ వెళ్లి నేరుగా నరసా పురం విచ్చేసి బాధ్యతలు స్వీకరించారు. లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నారు. పాజి టివ్‌గా తేలింది. ఆయనను కలిసిన సిబ్బంది పరీ క్షలు చేయించుకున్నారు. వీరిలో అటెండర్‌కు పాజిటివ్‌ రావడంతో అతను అప్పటి నుంచి క్వారంటైన్‌లో ఉన్నాడు.

 




Updated Date - 2022-01-19T06:12:33+05:30 IST