నిను వీడని నీడను నేనే...!

ABN , First Publish Date - 2021-06-24T07:39:33+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఇతర జిల్లాల్లో మూడొందలలోపే కేసులు నమోదవుతుంటే ‘తూర్పు’లో మాత్రం వెయ్యికిపైనే రోజూ కొత్త పాజిటివ్‌లు పుట్టుకు వస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వం రోజువారీ ప్రకటించే కొవిడ్‌ బులెటిన్‌లో అత్యధిక పాజిటివ్‌లతో జిల్లాయే తొలిస్థానంలో కొనసాగుతోంది.

నిను వీడని నీడను నేనే...!

  • జిల్లాలో అదుపులోకి రాని కొవిడ్‌ కేసులు
  • ఇతర జిల్లాల్లో మూడొందల్లోపే... ఇక్కడ మాత్రం వెయ్యికి పైనే
  • పాజిటివ్‌ల తీవ్రత తగ్గకపోవడంతో ఇప్పటికే కర్ఫ్యూ మినహాయింపుల్లో కోత
  • మరోపక్క ఫీవర్‌ సర్వేలో ఎక్కడికక్కడ వందల్లో కొత్త కేసులు
  • బాధితులు పెరుగుతుండడంతో తలలు పట్టుకుంటున్న అధికారులు
  • 2,57,600కు చేరిన పాజిటివ్‌లు , మృతులు 1,100

జిల్లాలో కొవిడ్‌ కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇతర జిల్లాల్లో మహమ్మారి చాలా వరకు నియంత్రణలోకి రాగా ఇక్కడ మాత్రం అంతు చూస్తూనే ఉంది. వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. బాధితుల సంఖ్య తగ్గకపోవడంతో ఏమి చేయాలో తెలియక అధికారులు, వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు.

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

రాష్ట్రవ్యాప్తంగా ఇతర జిల్లాల్లో మూడొందలలోపే కేసులు నమోదవుతుంటే ‘తూర్పు’లో మాత్రం వెయ్యికిపైనే రోజూ కొత్త పాజిటివ్‌లు పుట్టుకు వస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వం రోజువారీ ప్రకటించే కొవిడ్‌ బులెటిన్‌లో అత్యధిక పాజిటివ్‌లతో జిల్లాయే తొలిస్థానంలో కొనసాగుతోంది. జిల్లాలో పాజిటివ్‌ తీవ్రత తగ్గకపోవడంతో ఇప్పటికే కర్ఫ్యూ మినహాయింపుల సమయాన్ని జిల్లాకు వర్తింపచేయకుండా ప్రభుత్వం ఆంక్షలు కొనసాగిస్తోంది. దీనివల్ల అయినా వైరస్‌ వ్యాప్తి తగ్గుతుందని అంచనా వేసింది. కానీ దీనికి విరుద్ధంగా కేసులు పెద్దగా తగ్గడం లేదు. దీంతో ఇక్కడ కేసుల ఉధృతిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. గడిచిన రెండు నెలలుగా పగటికర్ఫ్యూ జిల్లాలో అమలవుతున్నా ఎక్కడా పకడ్బందీగా పర్యవేక్షణ ఉండడం లేదు. పోలీసులు సైతం ఎక్కడికక్కడ 144 సెక్షన్‌ అమలును సీరియస్‌గా పట్టించుకోవట్లేదు. కర్ఫ్యూ మినహాయింపు సమయం ముగిసినా యథావిధిగా జనం వివిధ అవసరాల పేరుతో గుంపులుగానే తిరుగుతున్నారు. పగటి పూట సైతం మార్కెట్ల వద్ద తీవ్ర రద్దీ కొనసాగుతోంది. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా జనం వివిధ దుకాణాల వద్ద ఎగబడుతున్నారు. దీంతో కేసుల సంఖ్య తగ్గడం లేదు. జిల్లా కేంద్రం కాకినాడ,రాజమహేంద్రవరం నగరాల్లో కేసులు అధికంగా ఉంటున్నాయి. మరోపక్క ఈ నెల 30తో రాష్ట్రంలో పగటి కర్ఫ్యూ గడువు ముగియనుంది. ఆ తర్వాత ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఈలోపు జిల్లాలో పాజిటివ్‌లు పూర్తిగా అదుపులోకి రాకపోతే మధ్యాహ్నం రెండు గంటల వరకే ఉన్న అనుమతులను సడలించకుండా కొనసాగించే ప్రమాదం ఉంది. దీంతో వ్యాపార,వాణిజ్య వర్గాలు మరింత నష్టాల్లోకి కూరుకుపోనున్నాయి. 

ఇదంతా ఒకెత్తయితే కనిపించే పాజిటివ్‌లను పక్కనపెడితే జిల్లాలో అంతకుమించిన కేసులు చాపకింద నీరులా కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ ప్రైవేటు ల్యాబ్‌ల్లో ర్యాపిడ్‌కిట్ల ద్వారా టెస్ట్‌ చేయించుకుని పాజిటివ్‌ వచ్చిన వారు ఇళ్లల్లో గుట్టుగా ఉంటున్నారు. బయట మెడికల్‌ షాపుల్లో మందులు వినియోగిస్తున్నారు. అవసరాల కోసం పలుచోట్ల బయటకు కూడా వచ్చేస్తున్నారు. ఇది కూడా కేసుల వ్యాప్తికి కారణం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా బుధవారం నమోదైన 1,171 పాజిటివ్‌లతో కలిపి మొత్తం కేసులు 2,57,600కు చేరుకున్నాయి. కొవిడ్‌ మృతుల సంఖ్య 1,100కు చేరుకుంది. 

సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖ ఫీవర్‌ సర్వే చేపట్టింది. రోజుకు 8,200 వరకు కొవిడ్‌ టెస్ట్‌లు చేస్తున్నారు. ఇందులో ఆరు వందల వరకు పాజిటివ్‌లు వస్తున్నాయి. వీటిని అధికారిక లెక్కల్లో చూపట్లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా రంపచోడవరంలో వంద పడకల ఆసుపత్రి కొత్తగా ఏర్పాటుకాబోతోంది. అమెరికన్‌ ఇండియా ఫండ్‌ నిధులతో దీనిని నిర్మించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ కొవిడ్‌ కంట్రోల్‌ మిషన్‌ ప్రత్యేక అధికారి ఆర్జా శ్రీకాంత్‌ ప్రకటించారు. రూ.4 కోట్లతో 92 సాధారణ పడకలు, 8 ఐసీయూ పడకలను విరాళం కింద వచ్చే నిధులతో అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. అలాగే ఈ సంస్థ నుంచి 100 వరకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు కూడా త్వరలో జిల్లాకు రానున్నాయని వివరించారు. 

Updated Date - 2021-06-24T07:39:33+05:30 IST