కరోనా కంగారు

ABN , First Publish Date - 2022-01-26T05:45:16+05:30 IST

కొవిడ్‌ కలకలం.. ఎటు చూసినా.. ఏ నోట విన్నా అదే మాట.. థర్డ్‌వేవ్‌ ముంచుకొస్తోంది..

కరోనా కంగారు
టీటీడీలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ వద్దని వినతిపత్రం ఇస్తున్న మహిళలు

పెరుగుతున్న కరోనా కేసులు
ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
భయాందోళనలో ప్రజలు



కొవిడ్‌ కలకలం.. ఎటు చూసినా.. ఏ నోట విన్నా అదే మాట.. థర్డ్‌వేవ్‌ ముంచుకొస్తోంది.. ప్రతీ మండలంలోనూ అధికారిక లెక్కల ప్రకారం పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అనధికారికంగా వీటి సంఖ్య ఇంకా పెరగవచ్చని అంచనా.. దీంతో ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో తెలియక అంతా ఆందోళన చెందుతున్నారు. బయటకు రావాలంటేనే భయపతున్నారు. 


నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో 100 పడకలు


నరసాపురం టౌన్‌, జనవరి 25 : కొవిడ్‌ రోగులకు ప్రభు త్వాసుప త్రిలో 100 పడకలు సిద్ధం చేయాలని ఎమ్మె ల్యే ప్రసాదరాజు ఆదేశిం చారు. కొవిడ్‌ నియంత్ర ణపై మంగళవారం అధికారులతో సమీక్షించారు. మాస్క్‌లు లేకుండా సంచరించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.నిత్యం ఫీవర్‌ సర్వే చేపట్టాలన్నారు. హోం ఐసోలేషన్‌లో వారికి క్విట్‌లు ఇవ్వాలన్నారు. ఆసుపత్రిలో అక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో చైర్‌పర్సన్‌ వెంకట రమణ, కమిషనర్‌ శ్రీనువాసులు, తహసీల్దార్లు సత్యనారాయణ, హుస్సేన్‌, ఎంపీడీవోలు శివప్ర సాద్‌, ఆనందకుమార్‌, ఎస్‌ఐ ప్రేమకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


ఆ 4 లక్షణాలు ఉంటే కొవిడ్‌ పరీక్ష తప్పనిసరి..


పాలకొల్లు రూరల్‌/ఆకివీడు, జనవరి 25 : లంకలకోడేరు పీహెచ్‌సీ పరిధిలో ఇప్పటి వరకూ 14 మంది కొవిడ్‌ బారిన పడ్డారని డాక్టర్‌ ప్రతాప్‌ కుమార్‌ తెలి పారు.ఆకివీడు పరిధిలో 4 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు డాక్టర్‌ పవన్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. కొవిడ్‌ బాధితులను హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు, దగ్గు వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.


కల్యాణ మండపంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ వద్దు..


పాలకొల్లుఅర్బన్‌, జనవరి 25 : పట్టణ టీటీడీ కల్యాణ మండపంలో 40 పడకలతో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ప్రజలు, వీహెచ్‌పీ నాయ కులు వ్యతిరేకించారు.ఈ మేరకు మంగళవారం కల్యాణ మండపం వద్ద పలువురు మహిళలతో నిరసన ప్రదర్శన చేశారు. వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి ఎం.సునీత మాట్లాడుతూ నివాసాల మధ్యలో ఉన్న కల్యాణ మండపాన్ని కొవిడ్‌ కేర్‌ సెం టర్‌కు కేటాయించడం తగదన్నారు. కల్యాణ మండపాన్ని ఆనుకుని మునిసిపల్‌ హైస్కూలు ఉందని తెలిపారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఇతర ప్రాంతానికి మార్పు చేయాలని కోరారు. అనంతరం నోడల్‌ ఆఫీసర్‌ కంభంపాటి భాస్కర రామాంజనేయ శర్మకు వినతిపత్రం అందజేశారు.   


మాస్క్‌ లేకపోతే జరిమానా..


నరసాపురం, జనవరి 25: కొవిడ్‌ నియంత్రణకు ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని తహసీల్దార్‌ సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని దుకాణాలను మంగళశారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాస్క్‌లు లేని వారితో మాస్క్‌లు ధరింపజేశారు. మాస్క్‌ లేకుండా దుకాణంలోకి అనుమతించిన వ్యాపారులకు  క్లాస్‌ తీసుకున్నారు. ఇక నుంచి ఎవరైనా మాస్క్‌లు లేకుండా మార్కెట్‌లోకి వస్తే జరిమానా విధిస్తామన్నారు. ఆయన వెంట పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.


11 గంటలు దాటితే బయటకు రాకూడదు..

పాలకొల్లు టౌన్‌ : కరోనా థర్డ్‌ వేవ్‌ దృష్ట్యా రాత్రి వేళల్లో కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తామని సీఐ అఖిల్‌ జామా మంగళవారం తెలిపారు. పట్టణ ప్రజలు రాత్రి 11 గంటల తర్వాత బయటకు రాకూడదన్నారు. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.



Updated Date - 2022-01-26T05:45:16+05:30 IST