Abn logo
May 15 2021 @ 00:11AM

బుసలుకొడుతోంది!

జిల్లాలో అంతకంతకూ పెరుగుతున్న కొవిడ్‌ కేసులు

రెండు వారాల వ్యవధిలో ఏకంగా 

35,021 పాజిటివ్‌లు నమోదు

ఏప్రిల్‌ నెల మొత్తం మీద 16,446 కేసులు

కర్ఫ్యూ అమల్లో ఉన్నా పెరుగుతూనే ఉన్న వైరస్‌ ముప్పు

అల్లాడిపోతున్న ప్రజానీకం

పడకలు దొరక్క, ఆక్సిజన్‌ అందక బాధితులకు నరకయాతన

బెడ్లన్నీ కిక్కిరిసిపోవడంతో ఇదే అదనుగా 

కొన్ని ఆసుపత్రుల్లో అనుమతులు లేకున్నా చికిత్స

లక్షలకు లక్షలు వసూలు చేస్తుండడంతో

నిలువుదోపిడీకి గురవుతున్న వైనం

శుక్రవారం జిల్లాలో 3,432 కేసులు

మూడు రోజులుగా వరుసగా కేసుల్లో  

రాష్ట్రంలో తొలి స్థానంలో ‘తూర్పు’


(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కొవిడ్‌ మహమ్మారి అంతకంతకు బుసలు కొడుతూనే ఉంది. ఎక్కడా తగ్గకుండా వైరస్‌ విరుచుకుపడుతోంది. ఒకపక్క కర్ఫ్యూ అమల్లో ఉన్నా సరే పాజిటివ్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. వైరస్‌ పంజా విసురుతుండడంతో జనం అల్లాడిపోతున్నారు. మహమ్మారి బారినపడి విలవిల్లాడుతున్నారు. ఒకపక్క ఆసుపత్రిలో పడకలు దొరక్క, రోజుల తరబడి నిరీక్షణ తర్వాత బెడ్‌ దక్కినా చికిత్స          సకాలంలో అందక వందల సంఖ్యలో బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఫలితంగా మరణాలు సంఖ్య కలవరపరిచే స్థాయిలో నమోదవుతున్నాయి. కాగా గడిచిన రెండు వారాల్లో జిల్లాలో ఏకంగా 35వేలకుపైగా పాజిటివ్‌లు నమోదవడం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఒకపక్క పది రోజులుగా కర్ప్యూ అమల్లో ఉంది. కేవలం రోజు మొత్తం మీద ఆరు గంటల పాటే జనజీవనం కొనసాగుతోంది. అయినా కేసుల సంఖ్య మాత్రం ఎక్కడా తగ్గిన దాఖలాలు కనిపించడం లేదు సరికదా మునుపటితో పోల్చితే మరింత పెరగడంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. వాస్తవానికి ఈ నెల ఒకటి నుంచి శుక్రవారం వరకు రోజువారీ కొవిడ్‌ బులిటెన్‌లో నమోదైన పాజిటివ్‌ల లెక్కలను పరిశీలిస్తే కొవిడ్‌ కేసుల నమోదు వేగం భయాందోళనలకు గురిచేస్తోంది. మొత్తం రెండు వారాల వ్యవధిలో ఏకంగా 35,021 కేసులు నిర్దారణ అయ్యాయి. ప్రతీరోజూ 2,500, మూడు వేలకు మించి ప్రతీరోజూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇన్ని పాజిటివ్‌లు రెండు వారాల్లో నమోదవ్వడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి. 


వాస్తవానికి గడిచిన ఏప్రిల్‌ నుంచి జిల్లాలో సెకండ్‌ వేవ్‌ ప్రభావం మొదలైంది. ఆ నెల మొత్తం మీద జిల్లావ్యాప్తంగా 16,446 పాజిటివ్‌లు నమోదయ్యాయి. తీరా మే 1 నుంచి ఇప్పటివరకు పాజిటివ్‌లు రెండింతలకుపైగా దాటిపోవడంతో వైరస్‌ వ్యాప్తి కంటిపై కునుకులేకుండా చేస్తోంది. ఈ స్థాయిలో పాజిటివ్‌లతో ఇప్పుడు జిల్లాలో ఎక్కడ చూసినా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకలు దొరక్క అనేక మంది చనిపోతున్నారు. పోనీ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్దామంటే లక్షలకు లక్షలు కట్టుకోలేక ఏంచేయాలో తెలియక దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నాడు. ఇదే సమయంలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, రామచంద్రపురం తదితర ప్రాంతాల్లో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అనుమతి లేకుండా కొవిడ్‌ వైద్యం రహస్యంగా చేసేస్తున్నాయి. లక్షలకు లక్షలు చెల్లించుకుంటూ బాధితులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. కాకినాడలో ఓ కార్పొరేట్‌ ఆసుపత్రి ఏకంగా అనుమతి లేకుండా 18 మంది కొవిడ్‌ బాధితులకు చికిత్స అందిస్తూ గురువారం విజిలెన్స్‌ అధికారులకు పట్టుబడడం జరుగుతోన్న రహస్య వ్యవహారాన్ని బయటపెట్టింది. 


మరోపక్క ప్రస్తుతం జిల్లాలో 54 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసీయూ పడకలన్నీ కలిపి 517 ఉంటే ఎక్కడా ఖాళీ లేవు. శుక్రవారం రికార్డుల ప్రకారం వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో 23 ఖాళీ ఉన్నట్టు చూపిస్తున్నారు. జీజీహెచ్‌, డీహెచ్‌,జీఎస్‌ఎల్‌, కిమ్స్‌లో మాత్రం పడకలు దొరకడం అసాధ్యంగా మారింది. ఆక్సిజన్‌ పడకలు జిల్లా మొత్తం మీద 2,534 ఉండగా 46 పడకలు మాత్రమే ఖాళీ వున్నట్టు ప్రదర్శిస్తున్నారు. దీనిని బట్టి ఆక్సిజన్‌ పడకల డిమాండ్‌ అర్థం చేసుకోవచ్చు. అటు అన్ని ఆసుపత్రుల్లో కలిపి మొత్తం 2,982 మంది వివిధ ఆక్సిజన్‌ పడకలపై చికిత్స పొందుతున్నారు. కాగా జిల్లాలో శుక్రవారం 3,432 మందికి కొత్తగా వైరస్‌ నిర్ధారణ అయింది. రాష్ట్రం మొత్తం మీద ఇన్ని కేసులు ఒక్క తూర్పులోనే అధికంగా నమోదు కావడం అధికారుల్లో గుబులు రేపుతోంది. అటు గడిచిన మూడురోజులుగా వరుసగా పాజిటివ్‌ కేసుల్లో రాష్ట్రంలో జిల్లా తొలిస్థానంలో కొనసాగుతూ వస్తోంది. కాగా శుక్రవారం జిల్లాలో కొవిడ్‌తో ఏకంగా పదిమంది కన్నుమూసినట్టు వైద్య, ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. దీంతో మొత్తం కొవిడ్‌ మృతుల సంఖ్య 819కు చేరింది. 


394 కొవిడ్‌ ఉల్లంఘన కేసులు

కాకినాడ క్రైం, మే 14: జిల్లాలో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన 394 మంది వాహనచోదకులపై కేసులు నమోదు చేసి రూ.32 వేలు జరిమానా విధించినట్టు ఎస్పీ అద్నాన్‌  నయీం అస్మీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.


గడిచిన 24 గంటల్లో తర్పుగోదావరి జిల్లాలో

కొవిడ్‌ కొత్త పాజిటివ్‌ కేసులు : 3,432

మొత్తం పాజిటివ్‌ కేసులు : 1,76,803

జిల్లావ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు : 28,130

కోలుకున్న వారి సంఖ్య : 1,47,854

మొత్తం మరణాల సంఖ్య: 819

Advertisement