కేసుల కల్లోలం

ABN , First Publish Date - 2021-05-13T05:50:32+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కేసుల కల్లోలం కొనసాగుతోంది. ఎక్కడికక్కడ మహమ్మారి చాలా మందిని కబళిస్తోంది. పల్లె, పట్నం, నగరం తేడా లేకుండా వైరస్‌ అల్లుకుపోతోంది. నిత్యం వేలల్లో పాజిటివ్‌లు కమ్మేస్తుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు.

కేసుల కల్లోలం

  • జిల్లాలో కొనసాగుతున్న కొవిడ్‌ ఉధృతి
  • రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించి వారంపైనే  పూర్తి
  • అయినా ఎక్కడా తగ్గని పాజిటివ్‌లు
  • కర్ఫ్యూ ప్రభావం పెద్దగా చూపకపోవడంతో తలలు పట్టుకుంటున్న అధికారులు
  • మంగళవారం కేసులు కాస్త తగ్గడంతో వైరస్‌ నెమ్మదిస్తోందని ప్రకటించిన కలెక్టర్‌
  • బుధవారం యథాతథంగా 2,927 మందికి వైరస్‌ నిర్ధారణ
  • రాష్ట్రం మొత్తం మీద జిల్లాలోనే అత్యధిక కేసుల నమోదు
  • జిల్లాలో 800 దాటిన అధికారిక మరణాలు

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కొవిడ్‌ కేసుల కల్లోలం కొనసాగుతోంది. ఎక్కడికక్కడ మహమ్మారి చాలా మందిని కబళిస్తోంది. పల్లె, పట్నం, నగరం తేడా లేకుండా వైరస్‌ అల్లుకుపోతోంది. నిత్యం వేలల్లో పాజిటివ్‌లు కమ్మేస్తుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. కేసుల ఉధృతి నేపథ్యంలో వాటిని కట్టడిచేయడానికి రాష్ట్రప్రభుత్వం విధించిన పగటి కర్ప్యూ జిల్లాలో పెద్దగా ప్రభావం చూపడం లేదని రోజూ నమోదవుతున్న కేసులు తేటతెల్లం చేస్తున్నాయి. కర్ఫ్యూ విధించడానికి ముందున్న నాటి కేసుల తీవ్రతే ఇంకా కొనసాగుతుండడం అధికారులను కలవరపెడుతోంది. ఇప్పటికే పగటి కర్ప్యూ విధించి వారం దాటిపోతోంది. ఈ నెల 18వ తేదీతో రెండు వారాల కర్ప్యూ పూర్తికానుంది. దీంతో పాజిటివ్‌లు నియంత్రణలోకి వస్తాయని అధికారులు వేసుకున్న అంచనాలు పటాపంచలవుతున్నాయి. దీనికి నిదర్శనమే బుధవారం జిల్లాలో నిర్ధారణ అయిన 2,927 పాజిటివ్‌లు. ఒక్కరోజులో ఇన్ని కేసులు రాష్ట్రం మొత్తం మీద జిల్లాలోనే నమోదవ్వడం మహమ్మారి తీవ్రతను చాటుతోంది. అయితే మంగళవారం జిల్లాలో 1,527 పాజిటివ్‌లు నమోదయ్యాయి. అంతకు ముందు రోజులతో పోల్చితే ఆ ఒక్క రోజు పాజిటివ్‌లు వెయ్యి వరకు తగ్గాయి. దీన్ని ఆధారంగా చేసుకుని జిల్లాలో కేసులు తగ్గిపోతున్నాయని, వైరస్‌ ప్రభావం లహీనపడుతుందని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఘనంగా ప్రకటించేశారు. తీరా 24 గంటలు గడిచేసరికి బుధవారం జిల్లాలో వచ్చిన పాజిటివ్‌లు రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో నమోదయ్యాయి. 

కాగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన పగటి కర్ప్యూ  ఈ నెల 5 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో జనం రద్దీ తగ్గి కేసులు అదుపులోకి వస్తాయని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అంచనా వేసింది. అయితే అవన్నీ పటాపంచలవడంతో ఆందోళన పెరుగుతోంది. ఈ నెల ఐదో తేదీకి ముందు అంటే మే1 న జిల్లాలో 2679, 2న 2,831, 3న 1914, 4న 1075 చొప్పున పాజిటివ్‌లు గుర్తించారు. కర్ప్యూ అమల్లోకి వచ్చిన 5వ తేదీన 2344, 6న 3531, 7న 1823, 8న 2370, 9న 2844, 10న 2352, 11న 1527, 12న 2927 చొప్పున కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కర్ప్యూ ముందు కంటే ఆ తర్వాత కూడా పాజిటివ్‌ల సంఖ్యలో పెద్దగా మార్పు రాలేదు సరికదా కొంతవరకు పెరగడం కలవరపరుస్తోంది. అయితే జిల్లాలో పాజిటివిటీ శాతం అధికంగా ఉన్నందు వలనే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు విశ్లేషిస్తున్నారు. మరోపక్క జిల్లాల్లో కేసుల పాజిటివిటీ పది శాతం వరకు ఉంటే ఆరు నుంచి ఎనిమిది వారాల లాక్‌డౌన్‌ విధించాలని జాతీయ వైద్య పరిశోధనా మండలి బుధవారం సిఫార్సు చేసింది. దీని ప్రకారం చూసినా జిల్లాలో రోజువారీ కేసుల పాజిటివిటీ దాదాపు 40శాతం వరకు ఉంటుందని అధికారులే ప్రకటించారు. సాధారణ స్థాయి పాజిటివిటీ 15శాతం లోపు ఉంది. ఇదిలా ఉంటే బుధవారం కొవిడ్‌తో తొమ్మిది మంది కన్నుమూసినట్టు ప్రభుత్వం బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో అధికారిక మరణాలు జిల్లాలో 800కు చేరుకున్నాయి. అత్యధిక కొవిడ్‌ మరణాల్లో చిత్తూరు, కృష్ణ, గుంటూరు జిల్లాల తర్వాత తూర్పు నాలుగో స్థానంలో ఉంది. అయితే అనధికారిక మరణాలు మాత్రం వేలల్లోనే ఉన్నాయి.

Updated Date - 2021-05-13T05:50:32+05:30 IST