మళ్లీ చుట్టేస్తోంది!

ABN , First Publish Date - 2021-04-14T05:56:44+05:30 IST

జిల్లాను కొవిడ్‌ మహమ్మారి మళ్లీ చుట్టేస్తోంది. పల్లెలు, పట్టణాలు, నగరాలు తేడా లేకుండా అంతటా విస్తరించేస్తోంది. ఎక్కడికక్కడ ప్రతి ప్రాంతాన్ని వైరస్‌ కమ్మేస్తోంది. తెలియకుండానే, లక్షణాలేవీ బయటకు చూపించకుండానే వేలాది మందిని మంచం పట్టేలా చేస్తోంది. గతేడాది లక్షమందికిపైగా కొవిడ్‌ బారిన పడగా, వేలాది మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరి నుంచి వైరస్‌ తీవ్రత కాస్త తగ్గుముఖం ప

మళ్లీ చుట్టేస్తోంది!

మళ్లీ అంతకంతకూ జిల్లాను కమ్మేస్తున్న కొవిడ్‌

పదుల సంఖ్య స్థాయి దాటిపోయి 

ఏకంగా వందల్లో పుట్టుకొస్తున్న పాజిటివ్‌లు

మంగళవారం జిల్లావ్యాప్తంగా 538 మందికి వైరస్‌ నిర్ధారణ

అత్యధికంగా కాకినాడలో 154, రాజమహేంద్రవరం 51, అనపర్తిలో 41

ఈ ఏడాదిలో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి

ఈ నెలలో అప్పుడే 1,126కి చేరుకున్న కేసులు

అటు ఒక్కరోజు కేసుల్లో చిత్తూరు, 

గుంటూరు తర్వాత మూడో స్థానంలో తూర్పు

1,26,489కి చేరుకున్న కేసులు.. 

ఇందులో 1,558 మందికి ప్రస్తుతం చికిత్స


జిల్లాను కొవిడ్‌ మహమ్మారి మళ్లీ చుట్టేస్తోంది. పల్లెలు, పట్టణాలు, నగరాలు తేడా లేకుండా అంతటా విస్తరించేస్తోంది. ఎక్కడికక్కడ ప్రతి ప్రాంతాన్ని వైరస్‌ కమ్మేస్తోంది. తెలియకుండానే, లక్షణాలేవీ బయటకు చూపించకుండానే వేలాది మందిని మంచం పట్టేలా చేస్తోంది. గతేడాది లక్షమందికిపైగా కొవిడ్‌ బారిన పడగా, వేలాది మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరి నుంచి వైరస్‌ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టిందని అంతా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కేసులు మళ్లీ అంతకంతకూ విజృంభిస్తున్నాయి. గత నెల మార్చిలో రోజుకు అయిదు నుంచి పది వరకు వచ్చే కేసులు కాస్తా ఏప్రిల్‌ వచ్చేసరికి పదింతలు పెరిగిపోయాయి. ఏకంగా వందల్లో పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. మంగళవారం ఏకంగా జిల్లాలో 538 మందికి వైరస్‌ సోకింది. ఈ ఏడాదిలో ఇన్ని కేసులు రావడం జిల్లాలో ఇదే తొలిసారి. ఈ కేసుల్లో అత్యధికంగా కాకినాడ నగరంలో 154 నమోదగా, రాజమహేంద్రవరం నగరంలో 51 వెలుగుచూశాయి. ఒకరోజు కేసుల్లో రాష్ట్రంలో తూర్పుది మూడో స్థానం.


(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌ వైరస్‌ జిల్లా అంతటా విస్తరించేస్తోంది. మార్చి వరకు కేవలం అక్కడక్కడ అడపాదడపా అయిదు నుంచి ఏడు వరకు పాజిటివ్‌లు నమోదవగా, ఇప్పుడు ఏకంగా వందల్లో వెలుగులోకి వస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే గడచిన మార్చిలో జిల్లాలో కేవలం ఏడు నుంచి పది మండలాలకే స్వల్ప సంఖ్యలో పరిమితమైన కొవిడ్‌ కేసులు ఇప్పుడు దాదాపు జిల్లా అంతటా కమ్మేశాయి. పదుల సంఖ్య దాటిపోయి ఏకంగా వందల్లో వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ పాజిటివ్‌లు లెక్కకుమిక్కిలి నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడంతో ఆసుపత్రులు సైతం బాధితులతో నిండిపోతున్నాయి. కాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన కొవిడ్‌ బులిటెన్‌లో జిల్లాలో ఏకంగా 538 పాజిటివ్‌లు నమోదైనట్టు వెల్లడించింది. దీన్ని బట్టి వైరస్‌ ఏ స్థాయిలో జిల్లాను చుట్టుముట్టేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఒక్క రోజులో జిల్లాలో ఇన్ని కేసులు నమోదవడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి. గత నెల మార్చి 23న ఒకేరోజులో 168 పాజిటివ్‌లు లెక్క తేలగా ఇప్పటివరకు ఒక్కరోజులో ఈ కేసులే అత్యధికం. కానీ మంగళవారం నమోదైన పాజిటివ్‌లు ఈ లెక్కను తుడిచిపెట్టేసింది. గుర్తించిన మొత్తం 538 కేసుల్లో అత్యధికంగా కాకినాడ నగరంలో 154 ఉండడం ఇక్కడ కొవిడ్‌ ముప్పును వెల్లడిస్తోంది. అటు రాజమహేంద్రవరం నగరం 51, అనపర్తి 41, బిక్కవోలు 33, అమలాపురం 21, ఆలమూరు 18, అల్లవరం 6, దేవీపట్నం 6, కపిలేశ్వరపురం 5, కె.గంగవరం 14, కాజులూరు 10, కాకినాడ రూరల్‌ 15, కరప 7, కాట్రేనికోన 1, కిర్లంపూడి 5, కోటనందూరు 3, కొత్తపేట 5, మలికిపు రం 8, మామిడికుదురు 7, మండపేట 6, ముమ్మిడివరం 5, పెదపూడి 7, పిఠాపురం 2, రాజవొమ్మంగి 4, రామచంద్రపురం 10, రంపచోడవరం 6, రావులపాలెం 16, రాయవరం 14, రాజోలు 11, రాజానగరం 2, సఖినేటిపల్లి 8, సామర్లకోట 5, శంఖవరం 3, తొండంగి 6, తుని 8, యు.కొత్తపల్లి 6, ఏల్వేరంలో 3 చొప్పున కేసులు నిర్థారణ అయ్యాయి. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో చిత్తూరు, గుంటూరు తర్వాత తూర్పుగోదావరి మూడో స్థానంలో ఉంది. 


పట్టించుకుంటేగా...

జిల్లాలో అంతకంతకూ పెరిగిపోతున్న కేసులతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒకపక్క కొవిడ్‌ తీవ్రత పెరిగిపోతున్నా క్షేత్రస్థాయిలో అందుకుతగ్గ జాగ్రత్తలు అధికారుల నుంచి ఉండడం లేదు. ఎక్కడికక్కడ పాజిటివ్‌లు వచ్చిన చోట్ల ఇదివరకటిలా రెడ్‌ జోన్‌లు ఏర్పాటు చేసి కంటైన్మెంట్‌ కేంద్రాలు పెద్దగా నిర్వహించడం లేదు. అక్కడక్కడా వీటిని ఏర్పాటుచేస్తున్నా పేరుకు మాత్రమే అవి ఉంటున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక వీటి పరిధిలో జనం వివిధ అవసరాల పేరుతో యథావిధిగా బయట సంచరించేస్తున్నారు. దీంతో వైరస్‌ వ్యాప్తి రెట్టింపు అవుతోంది. ఎలాగూ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందనే ధీమాతోను విచ్చలవిడితనం పెరిగింది. చాలామంది ఇప్పటికీ మాస్క్‌లు ధరించడం లేదు. అటు జిల్లాలో కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ అధికార పార్టీ నేతలు మాత్రం ఇదేదీ పట్టించుకోవడం లేదు. సభలు, సమావేశాలతోపాటు జాతరల పేరుతో వేలాదిమంది ఒకేచోట గుమిగూడేలా చేస్తున్నారు.


ఇది వందలాది కేసులు పెరగడానికి దారితీస్తోంది. అటు పోలీసులు సైతం పలుచోట్ల అధికార పార్టీ నేతల పనులకు వత్తాసు పలుకుతుండడం కేసులు అడ్డుఅదుపు లేకుండా పెరగడానికి దోహదపడుతోంది. ముఖ్యంగా ఇటీవల తుని,ప్రత్తిపాడు తదితర నియోజకవర్గాల్లో జాతర పేరుతో ఎక్కడికక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, కోడిపందేలు, గుండాట భారీగా జరిగాయి. వందలాదిమంది మాస్కులు లేకుండా గుంపులుగా సంచరించారు. ఇదేకాదు.. అనేకచోట్ల ఇదీ తీరు. వాస్తవానికి జిల్లాలో గడచిన మార్చి నెల అంతా కలిపి కేవలం 879 పాజిటివ్‌లు నిర్థారణ అయ్యాయి. కానీ ఏప్రిల్‌ వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాజిటివ్‌లు రయ్‌ మంటూ పరుగులు తీశాయి. ఏకంగా ఈనెలలో ఇప్పటివరకు 1,126 మంది వైరస్‌ బారినపడ్డారు. దీన్నిబట్టి వైరస్‌ వేగం ఎలా ఉం దనేది ఊహించుకుంటేనే భయం గొల్పుతోంది. ఈనెల్లో నమోదైన మొత్తం కేసుల్లో వందకుపైగా పాజిటివ్‌లు మూడుసార్లు వచ్చాయి. తాజా కేసులతో జిల్లాలో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 1,26,489కు చేరుకున్నాయి. ఇందులో 1,558 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.


గడిచిన 24 గంటల్లో..

కొవిడ్‌ కొత్త పాజిటివ్‌ కేసులు : 538

మొత్తం పాజిటివ్‌ కేసులు : 1,26,489

జిల్లావ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు : 1558

కోలుకున్న వారి సంఖ్య : 1,24,294

తాజాగా మరణాలు : లేవు

Updated Date - 2021-04-14T05:56:44+05:30 IST