కొవిడ్‌ కొరలు చాస్తున్నా తగ్గేదేలా!

ABN , First Publish Date - 2022-01-25T05:01:32+05:30 IST

కొవిడ్‌ రోజురోజుకు విజృంభిస్తున్నా... తగ్గేదేలే అంటూ జనం నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు.

కొవిడ్‌ కొరలు చాస్తున్నా తగ్గేదేలా!
మాస్క్‌లు లేకుండా పట్టణంలో తిరుగుతున్న ప్రజలు

నిర్లక్ష్యంగా తిరుగుతున్న ప్రజలు 

ఆదివారం అత్యధికంగా 182 కేసుల నమోదు 

సూళ్లూరుపేట, జనవరి 24 : కొవిడ్‌ రోజురోజుకు విజృంభిస్తున్నా... తగ్గేదేలే అంటూ జనం నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు. సూళ్లూరుపేటలో కరోనా బ్రేకులులేని వాహనంలా దూసుకుపోతోంది. అధికారిక లెక్కల ప్రకారమే వారంలో 745 మంది కొవిడ్‌బారినపడ్డారు. అనధికారికంగా వేలాదిమంది బాధితులు ఉన్నారు. ప్రైవేట్‌గా పరీక్షలు చేయించుకొని మాత్రలు వాడుతున్నారు. స్థానికంగా ఓ అపార్ట్‌మెంట్‌లోని అన్ని గృహాల్లో కొవిడ్‌ వ్యాపించడంతో ఆ అపార్ట్‌మెంట్‌ వారే రాకపోకలు లేకుండా లిఫ్ట్‌ను ఆపివేసి, మెట్లపై ఎవరిని రానీవ్వకుండా కట్టడిచేసుకోవడం విశేషం. ఆదివారం ఒక్కరోజు పట్టణంలో 122 మంది, గ్రామాల్లో 60 మందికి పాజిటివ్‌ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. థర్డ్‌వేవ్‌లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఈ నెల 17న గ్రామాల్లో 3, పట్టణంలో 3 కేసులు,  18న పట్టణంలో 74,  గ్రామాల్లో 34,  19న పట్టణంలో 77 , గ్రామాల్లో 44 , 20న పట్టణంలో 138 , గ్రామాల్లో 29 కేసులు నమోదయ్యాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 21న పట్టణంలో 20, గ్రామాల్లో 44, 22న పట్టణంలో 48, గ్రామాల్లో 52,  23న పట్టణంలో 122 మంది,  గ్రామాల్లో 60 మంది కోవిడ్‌ భారీనపడినట్లు అధికారులు ప్రకటించారు. ఇలా కరోనా రోజురోజుకూ కరోనా వ్యాపిస్తున్నా జనం మాస్క్‌లు కూడా ధరించకుండా తిరుగుతున్నారు. అధికారులు మాస్క్‌లు ధరించకుంటే ఫైన్‌ వేస్తామని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికైనా మున్సిపల్‌,  రెవెన్యూ, పోలీస్‌శాఖలు సంఘటితమై  ప్రజలు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టకపోతే కొవిడ్‌ సూళ్లూరుపేటను పూర్తిగా కబళించే ప్రమాదం ఉంది. 

Updated Date - 2022-01-25T05:01:32+05:30 IST