కమ్మేస్తోంది!

ABN , First Publish Date - 2022-01-18T06:22:50+05:30 IST

కరోనా వైరస్‌ కమ్ముకొస్తోంది.

కమ్మేస్తోంది!

2 రోజుల పసికందుకు.. రెండున్నర నెలల పాపకూ పాజిటివ్‌

15 మంది గర్భిణులకూ కరోనా వైద్యులకూ వైరస్‌

జీజీహెచ్‌లో సూపరింటెండెంట్‌ సహా 50 మందికి.. 

వైద్య సేవలపై ప్రభావం


కరోనా వైరస్‌ కమ్ముకొస్తోంది. కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపక్క కరోనా బాధితులు పెరుగుతుండగా, మరోపక్క వారికి వైద్యసేవలందిస్తున్న వైద్యులు, సిబ్బంది కొవిడ్‌ బారినపడుతున్నారు. ఇంకోపక్క రెండు రోజుల పసికందు కరోనా మహమ్మారితో పోరాటం చేస్తోంది.. రెండున్నర నెలల పసిపాప వైరస్‌ బారిన పడింది. వీరిని కన్న తల్లులతోపాటు మరో 13 మంది గర్భిణులు కరోనా బారినపడి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ వేరియంట్‌ అంత ప్రమాదకారి కాకున్నా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ, గర్భిణుల ఆరోగ్యంపై జీజీహెచ్‌ వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గడిచిన 15 రోజుల్లో దాదాపు 50 మందికిపైగా జూనియర్‌ వైద్యులు, సిబ్బంది కరోనా బారినపడగా, తాజాగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌,  పరిపాలన విభాగంలోని మరో కీలక అధికారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వీరంతా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.  ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న పారామెడికల్‌ సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులు కూడా వైరస్‌ బారినపడి, క్వారంటైన్‌లో ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రభావం ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్లుగా ఉన్న పాజిటివ్‌ బాధితులకు వైద్యసేవలందించడంపై పడుతోంది. మరోపక్క పసికందులు, గర్భిణులు కూడా కొవిడ్‌ బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 


కాన్పుకు ముందే కరోనా పరీక్షలు

పసికందులు, గర్భిణులూ కూడా కొవిడ్‌ బారిన పడుతుండడంతో పాత ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో కాన్పుల కోసం వచ్చే గర్భిణులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వై.కిరణ్‌కుమార్‌ నిర్ణయించారు. ఇందుకోసం ఆసుపత్రిలో ఇంతకు పూర్వం ఉన్న క్యాంటీన్‌ను ఖాళీ చేయించి.. అందులో ఆరు పడకలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. ప్రసవాల కోసం వచ్చే గర్భిణులకు ముందుగా కరోనా నిర్ధారణ పరీక్షలకు శాంపిల్స్‌ తీసుకుంటున్నారు. ఆ రిపోర్టులు వచ్చిన తర్వాత నెగెటివ్‌ వచ్చిన గర్భిణులను పాత ప్రభుత్వాసుపత్రిలోని మాతాశిశు విభాగంలో ప్రసవం కోసం అడ్మిట్‌ చేస్తున్నారు. పాజిటివ్‌ వచ్చినవారిని కొత్త ప్రభుత్వాసుపత్రికి తరలించి, అక్కడ 25 పడకలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. కొవిడ్‌ వైరస్‌ పూర్తిగా తగ్గిన తర్వాత వారికి కాన్పు చేయించేలా ఏర్పాట్లు చేశారు. ఒకవేళ అత్యవసరంగా ప్రసవాలు చేయాల్సి వస్తే, అక్కడే సిజేరియన్‌ చేసేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించి, వైద్యనిపుణులను అందుబాటులో ఉంచారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన గర్భిణులకు పుట్టే పిల్లలకు కూడా పాజిటివ్‌ వస్తుండటంతో వారికి కూడా కొవిడ్‌ చికిత్స అందించేందుకు వీలుగా మరో 25 పడకలతో ప్రత్యేక పీడియాట్రిక్‌ వార్డును ఏర్పాటు చేసి.. చిన్నపిల్లల వైద్యనిపుణులను అందుబాటులో ఉంచారు. ప్రసవం తర్వాత తల్లి, బిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచేలా చర్యలు తీసుకుంటున్నారు.  


ప్రైవేటు ఆసుపత్రుల్లో తగ్గిన కాన్పులు 

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవాలు చేయడం బాగా తగ్గించేశారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవాలు చేస్తున్నా, ఖర్చులు భారీస్థాయిలో ఉండడంతో తట్టుకోలేక పేదలు, మధ్యతరగతి వర్గాలకు చెందిన గర్భిణులు విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రికే వస్తున్నారు. దీంతో ఇక్కడ అత్యధికంగా రోజుకు 25 నుంచి 30 వరకు కాన్పులు జరుగుతున్నాయి.. 


జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డులు

ఒమైక్రాన్‌ రూపంలో థర్డ్‌వేవ్‌ మొదలు కావడంతో జీజీహెచ్‌కు కరోనా బాధితుల తాకిడి పెరుగుతోంది. సోమవారం నాటికి సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లోని కొవిడ్‌ వార్డుల్లో 40 మంది పాజిటివ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో మళ్లీ బాధితుల తాకిడి ఒక్కసారిగా పెరిగే అవకాశముందని భావించిన జిల్లా అధికారులు జీజీహెచ్‌ను మళ్లీ పూర్తిస్థాయి కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లో ఉన్న నాలుగు ఐసీయూల్లో 90 వెంటిలేటర్‌ పడకలను, వాటితోపాటు అదే బ్లాక్‌లో మరో 300 ఆక్సిజన్‌ పడకలను కొవిడ్‌ బాధితుల కోసం సిద్ధం చేశారు. వీటిలోనే 25 పడకలతో కొవిడ్‌ గైనిక్‌ వార్డును, మరో 25 పడకలతో కొవిడ్‌ పీడియాట్రిక్‌ వార్డును ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. సెకండ్‌ వేవ్‌ తరహాలో ఇప్పుడు కూడా  కేసులు ఒక్కసారిగా పెరిగితే.. సమర్థంగా ఎదుర్కొనేందుకు ఎ, బి, సి బ్లాకుల్లోని దాదాపు 800 పడకలను కూడా కొవిడ్‌ బాధితులకు వినియోగించేందుకు వీలుగా అన్ని పడకలకు ఆక్సిజన్‌ సరఫరాకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆసుపత్రిలో ట్రయేజ్‌ సెంటర్‌ను, కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. అవసరమైన వైద్య పరికరాలు, మందులను కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచారు. ఆక్సిజన్‌ కొరత, సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ట్రయేజ్‌, కంట్రోల్‌ రూముల్లో నిపుణులైన వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉండేలా రోజుకు మూడు షిప్టుల్లో డ్యూటీలు వేశారు. 


ఓపీ విభాగం వద్ద రోగుల రద్దీ 

జీజీహెచ్‌లో కొవిడ్‌ బాధితులకు సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ వద్ద, సాధారణ రోగులకు ’ఎ’ బ్లాక్‌లోను విడివిడిగా ఓపీ విభాగాలను ఏర్పాటు చేసినా.. ఆ విషయం తెలియక రోగులందరూ ఎదురుగా కనిపిస్తున్న సాధారణ ఓపీ వద్దకే వెళుతున్నారు. వచ్చినవారిలో సాధారణ రోగులెవరో.. కరోనా బాధితులు ఎవరో తెలియదు. ఎవరూ భౌతిక దూరం పాటించడం లేదు. ఓపీ చీటీల కోసం నెట్టుకునే వారే అందరూ. వారిలో బాధితులుంటే అక్కడున్న వారందరికీ వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉంది. ఆసుపత్రి అధికారులు ఓపీ విభాగాల వద్ద కొవిడ్‌ నిబంధనలు అమలు చేసేలా ఏర్పాట్లు చేయకపోవడంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. జీజీహెచ్‌లో వైరస్‌ వ్యాప్తికి ఇది కూడా ఒక కారణమని ఆసుపత్రి వర్గాలు భావిస్తున్నాయి. 


ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం

తల్లి బిడ్డల ప్రాణాలు ప్రమాదంలో పడకుండా కాపాడేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాన్పుల కోసం వచ్చే గర్భిణులకు కరోనా పరీక్షలు నిర్వహించి..  రిపోర్టులు వచ్చే వరకు ప్రత్యేక గదిలో ఉంచాలని నిర్ణయించాం. గర్భిణులు జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు ఉంటే వెంటనే కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలి. కరోనా సోకినా చాలామంది ఇంటి వద్దనే ఉంటూ కోలుకుంటున్నారు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆక్సిజన్‌ తగ్గడం లాంటి పరిస్థితులు ఉత్పన్నమైతే నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రిలో చేరాలి. - డాక్టర్‌ వై.కిరణ్‌కుమార్‌, సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌  


కరోనా కేసులు 170

 విజయవాడ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 170 మందికి వైరస్‌ సోకింది. కొత్తగా మరణాలు నమోదు కాకపోవడం ఊరటనిచ్చే అంశం. కొత్త వాటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసులు 1,22,767కు పెరిగాయి. మరణాలు 1,482 వద్ద నిలకడగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,19,365 మంది కోలుకున్నారు. 1,920 మంది బాధితులు ప్రస్తుతం కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2022-01-18T06:22:50+05:30 IST