వేరియంట్‌ ఏదైనా.. భయం వద్దు

ABN , First Publish Date - 2022-01-17T06:36:54+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది.

వేరియంట్‌ ఏదైనా.. భయం వద్దు

కరోనాపై వైద్యుల భరోసా

అయినా అప్రమత్తంగా ఉండాల్సిందే 

పెరిగిన పాజిటివిటీ రేటు


జిల్లాలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం రోజువారీ కేసులు 200కు పైగా నమోదవుతున్నాయి. గడిచిన 15 రోజుల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య దాదాపు పది రెట్లు పెరిగింది. పాజిటివిటీ రేటు కూడా దాదాపు నాలుగు శాతానికి చేరుకుంది. గత ఏడాది సెకండ్‌ వేవ్‌లో ఉధృతంగా వచ్చిన కొవిడ్‌ డెల్టా వేరియంట్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా,  చాపకింద నీరులా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం జిల్లాలో డెల్టా వైరస్‌ కంటే ఒమైక్రాన్‌ వైరస్‌ వేగంగా విస్తరిస్తున్నట్లు వైద్యనిపుణులు భావిస్తున్నారు. ఒమైక్రాన్‌లో వైరస్‌ లక్షణాల్లో తీవ్రత తక్కువగా ఉంటుందని, అలా అని తేలిగ్గా తీసుకోవద్దని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. సెకండ్‌ వేవ్‌లో వణికించిన డెల్టా వేరియంట్‌ తీవ్రత తగ్గినా, చాపకింద నీరులా కొనసాగుతూనే ఉంది. దీనికి ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ తోడయింది. అయితే దీని లక్షణాలు తీవ్రంగా లేకపోవడం కాస్త ఊరటనిస్తోంది. ఇటీవల విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన ముగ్గురికి ఒమైక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి వస్తున్న వారిలోనే ఒమైక్రాన్‌ వేరియంట్‌ బయటపడుతుండటంతో ప్రస్తుతం వారికే జీనోమ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మిగిలిన వారికి ఈ పరీక్షలు చేయడం లేదు. దీంతో ప్రస్తుతం ప్రతిరోజూ కరోనా బారినపడుతున్న వందల మందిలో డెల్టా వేరియంట్‌ బాధితులు ఎందరో.. ఒమైక్రాన్‌ బాధితులు ఎందరో తెలియడం లేదు. కొవిడ్‌ వేరియంట్‌ ఏదైనా దాదాపు చికిత్స మాత్రం ఒకటేనంటూ గతం నుంచి అనుసరిస్తున్న కొవిడ్‌ ట్రీట్‌మెంట్‌ ప్రొటోకాల్‌ ప్రకారమే వైద్యులు బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో డెల్టా వైరస్‌ కంటే ఒమైక్రాన్‌ వైరస్‌ వేగంగా విస్తరిస్తున్నట్లు వైద్యనిపుణులు భావిస్తున్నారు. ఒమైక్రాన్‌ బారినపడుతున్నవారిలో లక్షణాలు కనిపించడం లేదు. దీంతో బాధితులు బయట తిరిగేస్తున్నారు. ఈ కారణంగానే ఒమైక్రాన్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్‌ బారినపడుతున్నవారికి ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రుల్లో చేరడం మొదలైతే.. సెకండ్‌ వేవ్‌ కంటే ఎక్కువ స్థాయిలో ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే బయట తిరగకుండా హోం ఐసొలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. రెండు వేరియంట్లలో డెల్టాతో పోలిస్తే ఒమైక్రాన్‌లో వైరస్‌ లక్షణాల్లో తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ తేలిగ్గా తీసుకోవద్దని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.


వణికించిన సెకండ్‌ వేవ్‌

కరోనా సెకండ్‌ వేవ్‌లో డెల్టా వేరియంట్‌ ప్రభావమే ఎక్కువగా కనిపించింది. చాలామందికి దగ్గు, ఆయాసం, ఊపిరి ఆడకపోవడం వంటి ప్రమాదకరమైన లక్షణాలు కనిపించాయి. ఎక్కువ మంది బాధితులను ఐసీయూలో ఉంచి చికిత్స అందించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఆసుపత్రుల్లో చేరేవారిలో చాలామందికి ఆక్సిజన్‌ స్థాయిలు వేగంగా పడిపోవడంతో వేలాది మంది మరణించారు. ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో పడకలు దొరకక, ఆక్సిజన్‌ సరపరా లేక బాధితులు నరకయాతనను అనుభవించారు. కొవిడ్‌ వైరస్‌కు విరుగుడుగా వినియోగించే రెమ్‌డెసివిర్‌, టోసిలిజుమాబ్‌ వంటి స్టెరాయిడ్స్‌ ధరలు బ్లాక్‌ మార్కెట్‌లో రూ. 50 వేల నుంచి లక్షల్లో పలికింది. రూ.లక్షలు ధారపోసి కరోనా నుంచి కోలుకున్నా, తర్వాత బ్లాక్‌ ఫంగస్‌ రూపంలో కొందరికి అనారోగ్య సమస్యలు వెంటాడాయి. సెకండ్‌ వేవ్‌లో ఎదురైన భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే ప్రజలు సాధారణ జీవనానికి అలవాటు పడుతున్న తరుణంలో మళ్లీ ఒమైక్రాన్‌ వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. 


ఒమైక్రాన్‌ ఇలా.. 

డెల్టా వేరియంట్‌లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన నాటి నుంచి 14 రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండి మందులు వాడితే నెగెటివ్‌ రిపోర్టులు వచ్చేవి. వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించినవారికి ప్రాణాపాయ పరిస్థితులు ఎదురయ్యేవి. ఇప్పుడు కొత్తగా విస్తరిస్తున్న ఒమైక్రాన్‌ లక్షణాలు అంత తీవ్రంగా లేకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఒమైక్రాన్‌ బారినపడుతున్న బాధితుల్లో గొంతునొప్పి, ముక్కులో ఇన్‌ఫెక్షన్‌, జలుబు, దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులు తదితర సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పటికీ.. వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం లేదని, అందువల్లనే బాధితుల్లో ఆయాసం, ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవడం వంటి పరిణామాలు కనిపించడం లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం 30 మంది కొవిడ్‌ బాధితులు మాత్రమే చికిత్స పొందుతున్నారు. వారం నుంచి ప్రతిరోజూ 60 నుంచి 70 మంది వరకు కొవిడ్‌ బాధితులు జీజీహెచ్‌కు వస్తున్నారు. వారిలో చాలామందికి స్వల్ప లక్షణాలే కనిపిస్తుండటంతో హోం ఐసోలేషన్‌ ఉండి మందులు వాడితే సరిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. 


భయం వద్దు 

కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారికి సోకింది ఏ వేరియంట్‌ అయినా భయపడాల్సిన అవసరం లేదు. అలాగని నిర్లక్ష్యంగా ఉండటమూ మంచిది కాదు. ఇప్పుడు కొవిడ్‌ బారినపడుతున్నవారిలో ఎక్కువమందికి లక్షణాలు కనిపించడం లేదు. దీంతో బయట తిరిగేస్తున్నారు. దీనివల్ల వైరస్‌ వ్యాప్తి మరింత తీవ్రతరమవతుంది. ఇది చాలా ప్రమాదకరం. టీకా వేసుకోనివారికి కరోనా సోకితే బయట ఉన్న వైరస్‌తో అది మ్యూటెంట్‌ అయి, మరో కొత్త వేరియంట్‌ పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటే బాధితులు కుటుంబ సభ్యులకు దూరంగా, హోం ఐసొలేషన్‌లోనే ఉండాలి. ఒళ్లు నొప్పులు, నీరసం ఉన్నా, వైద్యుల సూచనల మేరకు మందులు వాడితే నాలుగైదు రోజుల్లోనే వైరస్‌ తగ్గిపోయి నెగెటివ్‌ వస్తుంది. - డాక్టర్‌ వెంకటకృష్ణ, జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి, జీజీహెచ్‌

--------

48 గంటలు.. 410 కేసులు 

 విజయవాడ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గడిచిన 48 గంటల్లో 410 మందికి కరోనా వైరస్‌ సోకింది. కొత్తగా మరణాలు నమోదు కాకపోవడం ఊరటనిచ్చే అంశం. కొత్త వాటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసులు 1,22,597కు పెరిగాయి. మరణాలు 1,482 వద్ద నిలకడగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,19,347 మంది కోలుకున్నారు. 1,760 మంది బాధితులు ప్రస్తుతం కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


దుర్గగుడిలో కొవిడ్‌ కలకలం 

ఇంద్రకీలాదిప్రై కరోనా మళ్లీ కలకలం సృష్టిస్తోంది. దుర్గగుడిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు అర్చకులు, మరో ఇద్దరు ఉద్యోగులు వైరస్‌ బారిన పడటంతో ఆలయంలోని ఇతర ఉద్యోగులు, సిబ్బందితోపాటు భక్తులు సైతం ఆందోళన చెందుతున్నారు. గతంలో మాదిరిగా ఆలయ ఉద్యోగులందరికీ కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తే మరిన్ని పాజిటివ్‌ కేసులు వెలుగుచూసే అవకాశముందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. 


విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన

ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్నా, ప్రభుత్వం పాఠశాలలకు సెలవలు ప్రకటించకపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఉన్న డెల్టా వేరియంట్‌కు తోడు ఒమైక్రాన్‌ కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోగా, సంక్రాంతి సెలవల అనంతరం పాఠశాలలు యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. పాత వేరియంట్ల కంటే వేగంగా ఒమైక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో పాఠశాలలకు సెలవలు ఇవ్వకపోవడం సమంజసమేనా? అని ప్రశ్నిస్తున్నారు. పిల్లలకు ఇంత వరకు వ్యాక్సిన్‌ ఇవ్వడం మొదలు పెట్టలేదు. దీంతో వైరస్‌ ప్రభావం వీరిపైనే ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే వీరి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో మాదిరిగా ఇక్కడ కూడా కొన్ని రోజులు విద్యాసంస్థలకు సెలవలు ప్రకటించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - 2022-01-17T06:36:54+05:30 IST