ఒమైక్రాన్‌ వేరియంట్‌ దెబ్బ.. విలవిలలాడుతున్న యూరప్ దేశాలు

ABN , First Publish Date - 2021-12-20T13:52:50+05:30 IST

ఒమైక్రాన్‌ వేరియంట్‌ దెబ్బకు యూరప్‌ దేశాలు విలవిల్లాడుతున్నాయి. క్రిస్మస్‌ పండుగ సందర్భంగా ప్రజలు పెద్దఎత్తున ప్రయాణాలు చేసే అవకాశం ఉండడంతో వైరస్‌ తీవ్రత పెరుగుతుందని

ఒమైక్రాన్‌ వేరియంట్‌ దెబ్బ.. విలవిలలాడుతున్న యూరప్ దేశాలు

నెదర్లాండ్స్‌లో మళ్లీ లాక్‌డౌన్‌.. 

యూకేలో రోజుకు 60 వేల ఒమైక్రాన్‌ కేసులు

లండన్‌, న్యూయార్క్‌, డిసెంబరు 19: ఒమైక్రాన్‌ వేరియంట్‌ దెబ్బకు యూరప్‌ దేశాలు విలవిల్లాడుతున్నాయి. క్రిస్మస్‌ పండుగ సందర్భంగా ప్రజలు పెద్దఎత్తున ప్రయాణాలు చేసే అవకాశం ఉండడంతో వైరస్‌ తీవ్రత పెరుగుతుందని భయపడుతున్నాయి. దీంతో మళ్లీ ఆంక్షల బాట పడుతున్నాయి. ముఖ్యంగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దేశమంతా కొత్త వేరియంట్‌ వ్యాపించింది.   ప్రపంచంలో ఒమైక్రాన్‌తో ఇప్పటివరకు ఏడు మరణాలు సంభవించగా అన్నీ బ్రిటన్‌లోనే నమోదవడం గమనార్హం. దేశంలో రోజుకు 90 వేల పైగా కేసులు వస్తుండగా 60 శాతం ఒమైక్రాన్‌వేనని యూకే ఆరోగ్య మంత్రి సాజిద్‌ జావిద్‌ పేర్కొన్నారు. నిత్యం రద్దీగా ఉండే లండన్‌లో ఒమైక్రాన్‌ వ్యాప్తి రేటు కలకలం రేపుతోంది. నగరంలో తాజా కేసుల్లో 80 శాతం కొత్త వేరియంట్‌వే ఉంటున్నాయి. 


గత వారంతో పోలిస్తే ఆస్పత్రుల్లో రోగుల చేరిక 30 శాతం పెరగడం పట్ల మేయర్‌ సాధిక్‌ ఖాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది కొత్త వేరియంట్‌ బారిన పడుతున్నారని.. వారి విరాలు రికార్డుల్లోకి రావడం లేదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. క్రిస్మస్‌ తరువాత గనుక లాక్‌డౌన్‌ విధించకుంటే రోజుకు 3 వేలమందిపైగా ఆస్పత్రుల పాలవుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గంట గంటకు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఆరోగ్య మంత్రి సాజిద్‌ చెప్పారు. క్రిస్మస్‌ అనంతరం లేదా జనవరి 1 నుంచి రెండువారాల లాక్‌డౌన్‌ ప్రకటించాలని ఆలోచన చేస్తున్నారు. అయితే, ఇన్‌డోర్‌లోనూ మాస్క్‌లు ధరించాలని, నైట్‌ క్లబ్‌లకు వెళ్తే కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువపత్రం చూపాలని తాజాగా విధించిన ఆంక్షల పట్ల యూకేలో కొందరు అసంతృప్తిగా ఉన్నారు. వీరంతా లండన్‌లో మాస్క్‌లు లేకుండా.. ఈలలు వేస్తూ.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు.



ఒకదాని వెంట ఒకటి

రోజుకు 15వేల పైగా కేసులు వస్తుండడంతో నెదర్లాండ్స్‌లో ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఇది జనవరి 14 వరకు కొనసాగనుంది. క్రిస్మస్‌ వేడుకలకు నలుగురు అతిథులను మాత్రమే పిలవాలని నిబంధన విధించారు. జర్మనీలో ఇప్పటికే వైద్య వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఐమైక్రాన్‌ రూపంలో ఐదో వేవ్‌ రాబోతోందని ఆరోగ్య మంత్రి కార్ల్‌ లాటెర్‌బ్యాచ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశ పౌరులు తప్ప యూకే నుంచి ఎవరూ రాకుండా నిబంధనలు తెచ్చింది. జర్మనీ పౌరులు యూకే నుంచి వస్తే టీకా పొందారా? లేదా? అనేదానితో సంబంధం లేకుండా రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొవిడ్‌ టెస్టును తప్పినిసరి చేసింది. ఫ్రాన్స్‌ కూడా యూకే నుంచి రాకపోకలను రద్దు చేసింది. కొత్త సంవత్సరం సందర్భంగా బాణసంచా కాల్చడంపై నిషేధం విధించింది. డెన్మార్క్‌లో మ్యూజియంలు, పార్కులు, థియేటర్లను మూసివేశారు. ఐర్లాండ్‌లో రాత్రి 8 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి తెచ్చారు. ఇన్‌డోర్‌, ఔట్‌డోర్‌ కార్యక్రమాలకు హాజరుపై పరిమితి విధించారు. స్పెయిన్‌లోనూ కొవిడ్‌ తీవ్రంగా ఉన్నప్పటికీ.. ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.


న్యూయార్క్‌లో 22 వేల కేసులు

అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్రంలో వరుసగా రెండో రోజూ 22 వేల పైగా కేసులు వచ్చాయి. సిబ్బంది కొవిడ్‌ బారినపడుతుండడంతో బార్లు,  రెస్టారెంట్లను మూసివేస్తున్నారు. కొవిడ్‌ పరీక్షలకు ప్రజలు పెద్దఎత్తున బారులు తీరుతున్నారు. మొత్తమ్మీద కొవిడ్‌ తొలి రోజుల పరిస్థితి కనిపిస్తోంది.



Updated Date - 2021-12-20T13:52:50+05:30 IST