దేశంలో 2.09 లక్షల కొత్త కేసులు

ABN , First Publish Date - 2022-02-01T07:24:03+05:30 IST

దేశంలో కొవిడ్‌ కొత్త కేసులు ఇంకాస్త తగ్గాయి. ఆదివారం 2,09,918 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది.

దేశంలో 2.09 లక్షల కొత్త కేసులు

పరీక్షలు తగ్గడంతో ఆ మేరకు పాజిటివ్‌లు

959 మరణాలు నమోదు.. కేరళలోనే 475

మరికొన్ని రాష్ట్రాల్లోనూ భారీగానే నమోదు

రాష్ట్రంలో రెండో రోజూ కోలుకున్నవారే అధికం

81 వేల టెస్టులు.. 2861 కేసులు

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రకు కరోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ, జనవరి 31: దేశంలో కొవిడ్‌ కొత్త కేసులు ఇంకాస్త తగ్గాయి. ఆదివారం 2,09,918 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. గత కొన్ని రోజులుగా దేశంలో కొవిడ్‌ టెస్టులు తగ్గుతుండడంతో అందుకు తగినట్లే పాజిటివ్‌ల సంఖ్య ఉంటోంది. మరోవైపు కొత్తగా 959 మరణాలను కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాటి గణాంకాల్లో పేర్కొంది. ఇందులో 475 కేరళ నుంచే ఉన్నాయి. ప్రస్తుతం 18.31 లక్షల యాక్టివ్‌ కేసులున్నాయి.


ఎవరికీ ఉద్యోగాలు పోలేదు: కేంద్రం

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలనే నిబంధనల కారణంగా ఎవరికీ ఉద్యోగాలు పోలేదని, రేషన్లు రద్దుకాలేదని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. వ్యాక్సినేషన్‌ నిబంధనల వల్ల తమకు నష్టం జరిగిందంటూ ఎవరూ కోర్టులను ఆశ్రయించలేదని పేర్కొంది. కొవిడ్‌ వ్యాక్సిన్ల క్లినికల్‌ ట్రయల్స్‌, కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ నిబంధనలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బీఆర్‌ గవాయి ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపిస్తూ... వ్యాక్సినేషన్‌ విషయంలో కొన్ని రాష్ట్రాలు పెడుతున్న నిబంధనలు ప్రజల ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయని కోర్టుకు తెలిపారు.


వ్యాక్సినేషన్‌ వేయించుకోని కారణంగా కొంతమంది ఉద్యోగాలు కోల్పోతున్నారని, రేషన్లు అందడం లేదని, నలుగురిలో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారని తెలిపారు. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా పిటిషనర్‌ వాదనలను తిరస్కరించారు. వాదనలు విన్న ధర్మాసనం... పిటిషనర్‌ చెబుతున్న అంశాలు రకరకాల పరిస్థితులకు సంబంధించినవని, వాటిపై కోర్టు నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ఈ అంశంపై చివరి దఫా వాదనల అనంతరం తీర్పు వెలువరిస్తామని స్పష్టం చేసింది.

Updated Date - 2022-02-01T07:24:03+05:30 IST