నాలుగు రోజుల్లో నాలుగింతలు...

ABN , First Publish Date - 2022-01-06T17:46:12+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు కేవలం నాలుగు రోజుల్లోనే నాలుగింతలు పెరిగాయి. ఈనెల 1న 1033 కేసులు నమోదు కాగా బుధవారం ఏకంగా 4,246 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 3,605 మందికి,

నాలుగు రోజుల్లో నాలుగింతలు...

-  అమాంతం పెరిగిన కొవిడ్‌ కేసులు

-   వారాంతపు కర్ఫ్యూలోనూ రవాణా సౌలభ్యం 

-  అమల్లోకి మరిన్ని ఆంక్షలు

- తాజాగా 4,246 మందికి పాజిటివ్‌ నిర్ధారణ


బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు కేవలం నాలుగు రోజుల్లోనే నాలుగింతలు పెరిగాయి. ఈనెల 1న 1033 కేసులు నమోదు కాగా బుధవారం ఏకంగా 4,246 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 3,605 మందికి, దక్షిణకన్నడలో 112, ఉడుపిలో 88, మైసూరులో 59 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా నాలుగు జిల్లాల్లో ఒకకేసు కూడా నమోదు కాలేదు. 8 జిల్లాల్లో పదిలోపు కేసులు నమోదయ్యాయి. 14 జిల్లాల్లో 50లోపు కేసులు పెరిగాయి. దాదాపు 20 జిల్లాల్లో కొవిడ్‌ ప్రభావం మూడు రోజుల్లోనే తీవ్రరూపం దాలుస్తోంది. 362 మంది కోలుకోగా బెంగళూరుకు చెందిన ఇద్దరు మృతిచెందారు. 29 జిల్లాల్లో మృతులు నమోదు కాలేదు. ప్రస్తుతం 30 జిల్లాల్లో 17,414 మంది చికిత్సలు పొందుతున్నారు. పది రోజుల క్రితం 7వేలకు చేరువలో యాక్టివ్‌ కేసులు కొనసాగగా ప్రస్తుతానికి పదివేలు అదనం అయ్యాయి. 


గోవా నుంచి వచ్చే వారికి మరిన్ని ఆంక్షలు 

గోవా రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తీవ్రంగా ఉన్నందున ఆ రాష్ట్రం నుంచి కర్ణాటకకు వచ్చే ప్రయాణికులపై పలు ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. విమానం, రైలు, బస్సు లేదా సొంత వాహనాలలో గోవా నుంచి వచ్చేవారు 72 గంటలలోపు ఆర్‌టీపీసీఆర్‌ నెగటివ్‌ రిపోర్టు తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. గోవా నుంచి కర్ణాటకకు వచ్చే విద్యార్థులు ప్రతి 15రోజులకోసారి నెగటివ్‌ రిపోర్టు సమర్పించడంతోపాటు రాష్ట్రంలో అమలయ్యే నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 


వారాంతపు కర్ఫ్యూలోనూ రవాణా సౌకర్యం

రాష్ట్రంలో కరోనా తీవ్రరూపం దాలుస్తున్న తరుణంలో ప్రభుత్వం ప్రకటించిన వారాంతపు కర్ఫ్యూలోనూ ప్రజా రవాణా సౌలభ్యం కల్పించనుంది. ప్రత్యేకించి బెంగళూరులో బీఎంటీసీ, కేఎస్ ఆర్టీసీతోపాటు మెట్రో రైలు సేవలు కొనసాగనున్నాయి. కర్ఫ్యూ వేళ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా బీఎంటీసీ బస్సులు సంచరించనున్నాయి. కానీ అత్యవసర సిబ్బందికి మాత్రమే సౌలభ్యాలు కల్పిస్తారు. కర్ఫ్యూ రోజున ప్రయాణించే ఉద్యోగులు తప్పనిసరిగా గుర్తింపుకార్డు కల్గి ఉండాలి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఐడీతోపాటు హాల్‌టికెట్‌ కలిగి ఉంటే ప్రయాణించవచ్చు. వైద్య సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేటు, బీమా కంపెనీలలో పనిచేసేవారికి అవకాశం ఉంటుంది. వారాంతంలో 10 శాతం బస్సులు మాత్రమే సంచరించనున్నాయి. బెంగళూరులో కంటైన్‌మెంట్‌ జోన్లకు బస్సు సేవలు ఉండవు. బస్సులో ప్రయాణించేవారు మాస్కు ధరించడం తప్పనిసరి. రైళ్లు, విమానాలలో ప్రయాణించదలిచినవారు టికెట్‌ చూపి బీఎంటీసీలలో తిరగవచ్చు. ఆసుపత్రులకు వెళ్లేవారు, సహాయకులకు అవకాశం ఉంటుంది. వీకెండ్‌ కర్ఫ్యూలో కేఎస్ ఆర్టీసీ బస్సులు యథావిధిగా కొనసాగుతాయి. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను కుదించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాలు గోవా, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు ప్రయాణికులకు నెగటివ్‌ రిపోర్టు తప్పనిసరి. వీకెండ్‌ కర్ఫ్యూలో నమ్మమెట్రో సంచారం యథావిధిగా ఉంటుంది. 50 శాతం మాత్రమే అనుమతించనున్నారు. ప్రస్తుతం మెట్రోలో 1800-1900 మంది దాకా ప్రయాణించేందుకు వీలుండగా 800-900 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. 15 నిమిషాలకు బదులు వీకెండ్‌ కర్ఫ్యూ రెండు రోజులు అరగంటకోసారి మెట్రో సంచారం కొనసాగనుంది. 

Updated Date - 2022-01-06T17:46:12+05:30 IST