ఎడా పెడా .. కేసుల దడ!

ABN , First Publish Date - 2021-04-11T06:53:22+05:30 IST

కొవిడ్‌ వైరస్‌ జిల్లాను కమ్మేస్తోంది. మహమ్మారి అంతకంతకూ మళ్లీ విజృంభిస్తోంది.

ఎడా పెడా .. కేసుల దడ!
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో కొవిడ్‌ పరీక్షా కేంద్రం వద్ద అనుమానితుల క్యూ.. పరీక్ష చేస్తున్న దృశ్యం

 జిల్లాలో మళ్లీ జడలు విప్పుతున్న కొవిడ్‌ 

శనివారం ఒక్కరోజే 111 పాజిటివ్‌ కేసులు

గత నెల 168 కేసుల తర్వాత ఇవే అత్యధికం

 అటు ఈనెల తొలి పది రోజుల్లో ఏకంగా 413 మందికి వైరస్‌.. గత నెలంతా కలిపి 879

 పాజిటివ్‌లతో కిక్కిరిసిపోతున్న జీజీహెచ్‌ 

 వ్యాక్సిన్‌ వచ్చేసిందన్న ధీమాతో అధికారులు, వైద్యఆరోగ్యశాఖ నిర్లక్ష్యం

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌ వైరస్‌ జిల్లాను కమ్మేస్తోంది. మహమ్మారి అంతకంతకూ మళ్లీ విజృంభిస్తోంది. ఆగినట్టే ఆగి మళ్లీ కేసులు విరుచుకుపడుతున్నాయి. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ జిల్లాలో మొన్న మార్చి నుంచి నెమ్మది నెమ్మదిగా మొదలవగా, ఏప్రిల్‌ వచ్చేసరికి మళ్లీ పాజిటివ్‌లు జడ లు విప్పుతున్నాయి. ఎక్కడికక్కడ పదుల సంఖ్యలో కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించిన కొవిడ్‌ బులిటెన్‌లో జిల్లాలో ఒక్క రోజులో 111 పాజిటివ్‌లు నమోదైనట్టు వెల్లడించింది. దీంతో మళ్లీ పెరిగిపోతున్న వైరస్‌ జాడలు భయపెడుతున్నాయి. కాగా గత నెల 23న ఒక్కరోజులో 168 కేసులు నిర్థారణ అయ్యాయి. ఆ తర్వాత మళ్లీ వందకుపైగా దాటిన కేసులు నమోదవడం ఇది రెండోసారి. మరోపక్క ఈనెల తొలి పది రోజుల్లో ఏకంగా 413 మందికి వైరస్‌ సోకింది. అటు అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్న పాజిటివ్‌లతో మళ్లీ కాకినాడ జీజీహెచ్‌ బాధితులతో నిండిపోతోంది. గత వారం వరకు రోజుకు రెండు లేదా మూడు మాత్రమే పాజిటివ్‌ కేసులు రాగా, గడచిన అయిదు రోజుల నుంచి నిత్యం ముఫ్పై మంది వరకు కొవిడ్‌ బాధితులు ఆసుపత్రిలో చేరుతున్నారు. దీంతో గతేడాది తరహాలో మళ్లీ జీజీహెచ్‌ కొవిడ్‌ బాధితులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో వెల్లువలా వచ్చిపడుతున్న కేసులతో తిరిగి పెద్దఎత్తున బాధి తుల కోసం పడకలు సిద్ధం చేస్తున్నారు. కొవిడ్‌ మొదటి విడతలో జీజీహెచ్‌లో పడకలు చాలక ఆసుపత్రి మొత్తాన్ని ఖాళీ చేయించి కేవలం కొవిడ్‌ బాధితుల కోసమే వినియోగించారు. ఆ తర్వాత గతేడాది డిసెంబర్‌ నుంచి జిల్లాలో కేసులు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ యఽథావిధిగా ఇతర రోగులకు సేవలు అందిస్తున్నారు. కేసులు పూర్తిగా తగ్గిపోయాయని ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో మళ్లీ బాధితులు పెద్దఎత్తున వచ్చిపడుతుండడంతో వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అటు వరుసగా పెరుగుతున్న కేసులతో జిల్లా కలెక్టర్‌ సైతం పరిస్థితి మళ్లీ మునుపటిలా చేయిదాటిపోకుండా ఉండేందుకు ముందుగానే క్వారంటైన్‌ కేంద్రాలు తెరిచే దిశగా ఆలో చిస్తున్నారు. ఇందుకోసం రాజమహేంద్రవరంలోని బొమ్మూరులో గతంలోలాగే క్వారంటైన్‌ కేంద్రాలు సిద్ధం చేయనున్నారు. 

10 రోజులు... 413 కేసులు

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ జిల్లాపై స్పష్టంగా కనిపిస్తోంది. తగ్గిపోయాయనుకున్న పాజిటివ్‌లు మళ్లీ అంతకంతకు పెరిగిపోతున్నాయి. తెలియకుండానే చాలామందిని వైరస్‌ చుట్టేస్తోంది. మునుపు కొవిడ్‌ సోకితే జ్వరం, శ్వాస సమస్యలు తలెత్తేవి. కానీ ఇప్పుడు ఏ లక్షణం కూడా బయటకు కనిపించడం లేదు. దీంతో ఇది చాలా ముప్పుగా పరిణమించిందని వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నా రు. అయితే జిల్లాలో రెండో దశ కొవిడ్‌ కేసులు ఈ గతేడాది డిసెంబర్‌ నుంచి క్రమేపీ తగ్గుముఖం పట్టాయి. అందులోభాగంగా ఈ ఏడాది జనవరిలో జిల్లా అంతా కలిపి 520 నిర్థారణ అయ్యాయి. ఫిబ్రవరిలో మొత్తం 174కు తగ్గాయి. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇంతలో మళ్లీ మార్చి నుంచి కేసులు పెరుగు తూ వస్తున్నాయి. ఆరంభంలో రోజుకు నాలుగు లేదా అయిదు కేసులు రాగా, మూడో వారంలో 20కి పైగా పెరిగాయి. నాలుగో వారం వచ్చేసరికి రోజుకు యాభైల్లో వస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కేసులు అంతకుముందు వారానికంటే రెట్టింపవుతున్నాయి. ఇందుకు నిదర్శనమే ఫిబ్రవరిలో కేసులు మార్చి కి వచ్చేసరికి అయిదింతలు పెరగడం. తిరిగి ఇప్పుడు ఏప్రిల్‌కు వచ్చేసరికి వైరస్‌ వేగం ఇంకా ఎక్కువ పుంజుకుంది. ఈనెల తొలి పది రోజుల్లో ఏకంగా 413 మం దికి వైరస్‌ వ్యాప్తించింది. ఈనెల 1న జిల్లాలో మొత్తం పాజిటివ్‌లు 1,25,363 కాగా పదోతేదీకి వచ్చేసరికి ఇవి 1,25,776కు చేరుకున్నాయి. ఈ లెక్కన కేసులు పెరుగుతూ ఉంటే మార్చిలో మొత్తం నమోదైన పాజిటివ్‌ల సంఖ్య ఏప్రిల్‌ పూర్తయ్యేసరికి మరింత భారీగా పెరిగిపోయేలా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అటు కొవిడ్‌ జడలు విప్పుతున్నా అధికారులు, వైద్యఆరోగ్యశాఖ మునుపటి తరహా అప్ర మత్తతతో వ్యవహరించడం లేదు. గతానికి భిన్నంగా పాజిటివ్‌ వచ్చినచోట కేవలం టెస్ట్‌లు చేసి సరిపెడుతున్నారు. ఎలాగూ వ్యాక్సిన్‌ వచ్చిందనే ధీమాతో అసలు పాజిటివ్‌ కేసులను సమస్యగా పరిగణించకపోవడం విశేషం. కంటైన్మెంట్‌ల్లో పరిస్థితిపై కనీసం అధికారులు సమీక్షించడం లేదు. దీంతో ఆ పరిధిలోని స్థానికులు విచ్చలవిడిగా బయట సంచరిస్తున్నారు.



Updated Date - 2021-04-11T06:53:22+05:30 IST