అన్ని వసతులతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2021-05-17T04:31:28+05:30 IST

హోమ్‌ క్వారంటైన్‌లో ఉండడానికి అవకాశం లేని వారికోసం పద్మనాభంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అన్ని వసతులతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి పీఎస్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు.

అన్ని వసతులతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌
సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో సూర్యనారాయణ

డీఎంహెచ్‌వో సూర్యనారాయణ

పద్మనాభం, మే 16: హోమ్‌ క్వారంటైన్‌లో ఉండడానికి అవకాశం లేని వారికోసం పద్మనాభంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అన్ని వసతులతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి పీఎస్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని కృష్ణాపురంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మండల పరిషత్తు అధికారి, దివీస్‌ ప్రతినిధులు, రేవిడి పీహెచ్‌సీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు దివిస్‌ కంపెనీ సహకారంతో ఈకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక్కడ 50 పడలతో పాటు ఆక్సిజన్‌ను కూడా సిద్ధం చేయాలని దివీస్‌ ప్రతినిధులకు సూచించారు. కరోనా బాధితులకు అవసరమైన భోజన, వసతి సౌకర్యాలను ప్రభుత్వపరంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఆక్సిజన్‌ రీ ఫిల్లింగ్‌ కూడా సకాలంలో జరిగేలా చూడాలన్నారు. కేర్‌ ఇండియా నుంచి ఈ కేంద్రానికి అవసరమైన వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందిని తాము ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్‌ నర్సింహమూర్తి పేర్కొన్నారు. ఇప్పటికే బెడ్లను సిద్ధం చేశామని, ఆక్సిజన్‌ సిలిండర్లను కూడా ఏర్పాటు చేస్తామని దివీస్‌ సీఎస్‌ఆర్‌ మేనేజర్‌ సురేశ్‌కుమార్‌  డీఎంహెచ్‌వోకు వివరించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో జీవీ చిట్టిరాజు, వైద్యాధికారి డాక్టర్‌ ఎన్‌వీ సమత, దివీస్‌ ప్రతినిధి శేఖర్‌బాబు, కేర్‌ ఇండియా రాష్ట్ర కార్యదర్శి గాయత్రి, ఎంపీహెచ్‌ఈవో పి.రాము, వైసీపీ నాయకుడు ఎం.అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-17T04:31:28+05:30 IST