Abn logo
Sep 22 2021 @ 00:55AM

1918 ఫ్లూ మరణాల సంఖ్యను దాటేసిన Covid మరణాల లెక్క.. America చరిత్రలో కరోనానే అత్యంత దారుణమైన మహమ్మారి..! శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..

వాషింగ్టన్: ఆధునిక అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణమైన మహమ్మారిగా కోవిడ్‌ స్థానం సంపాదించుకుంది. 1918లో అమెరికాలో విజృంభించిన ఫ్లూ వల్ల చనిపోయిన వారి సంఖ్య కంటే గత రెండేళ్లలో కోవిడ్ వల్ల చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు శాస్త్రవేత్తలు అంచనా వేసి మరీ చెబుతున్నారు. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ చేసిన అధ్యయనం ప్రకారం.. కోవిడ్ వల్ల అమెరికాలో సోమవారం వరకు 6,75వేల మంది మరణించారు. అంతేకాకుండా మరణాల సంఖ్య సగటున రోజుకు 19 వందల వరకు ఉంటోంది. ఇది చాలదన్నట్లు ప్రస్తుతం డెల్టా వేరియంట్ వల్ల అమెరికాలో కోవిడ్ మరో దశ ప్రవేశించినట్లు అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలోనే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(ఎస్‌డీసీపీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. కోవిడ్ కంటే ముందు అమెరికాను అల్లకల్లోలం చేసిన మహమ్మారి ఫ్లూ. 1918లో వచ్చిన ఈ మహమ్మారి మొత్తం మూడు దశల్లో 6,75వేల మంది అమెరికన్లను పొట్టన పెట్టుకుంది. ఇప్పటివరకు ఇదే అమెరికా చరిత్రలో అత్యంత దారుణమైన మహమ్మారిగా అధికారికంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని కోవిడ్ మహమ్మారి అధిగమించబోతోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

అయితే దీనిపై మిచిగన్ యూనివర్సిటీకి చెందిన వైద్య చరిత్రకారుడు, డాక్టర్ హోవర్డ్ మార్కెల్ మాట్లాడుతూ.. అమెరికా చరిత్రలో వైద్య పరిణామాలను చక్కగా అంచనా వేసినట్లే భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి కోవిడ్‌ను ఎదుర్కోవడానికి 1918లోని ఫ్లూ పరిస్థితులను అంచనా వేయడం అనవసరమని, కొత్త విధానాలను అవలంబించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఈ రెండు మహమ్మారులను పోల్చి చూస్తే మరణాల సంఖ్యతోనే రెండింటీ తీవ్రతను అంచనా వేయలేమని పేర్కొన్నారు. ‘ఈ మహమ్మారుల తీవ్రతను తెలుసుకోవాలంటే గత వందేళ్లలో వచ్చిన వైద్య, ఆరోగ్య పరిస్థితుల్లోని మార్పులు, సాంకేతికతలో సాధించిన అభివృద్ధి, సంస్కృతి-సంప్రదాయాల్లో వచ్చిన మార్పులను కూడా పరిగణలోకి తీసుకుని అంచనా వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా జనసాంద్రతను కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటేనే సరైన అంచనా వేయగలుగుతా’మని చెప్పుకొచ్చారు.

హోవర్డ్ మార్కెల్ అధ్యయనం ప్రకారం.. 1918లో అమెరికా జనాభా కేవలం 103 మిలియన్లు(10 కోట్ల 3 లక్షలు) మాత్రమే. కానీ ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 330 మిలియన్లు(33 కోట్లు) వరకు ఉంది. దీని ప్రకారం చూస్తే అప్పట్లో ఫ్లూ ప్రతి 150 మందిలో ఒకరి ప్రాణాలు తీయగా.. ప్రస్తుతం కోవిడ్ వల్ల ప్రతి 500 మందికి ఒక్కరే చననిపోయారు. అంతేకాదు అప్పటి ఫ్లూ మహమ్మారి చిన్న, పెద్ద, యువత అనే తేడా లేకుండా అందరినీ కబళించింది. కానీ ఇప్పడు కోవిడ్ వల్ల కేవలం వయసు మీదపడి వారు, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రమే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసినా ఇప్పటి కోవిడ్ కంటే అప్పటి ఫ్లూనే తీవ్ర ప్రభావం చూపినట్లు అర్థమవుతోంది. ఫ్లూ వల్ల ప్రపంచ దేశాల్లో దాదాపు 20 నుంచి 30 మిలియన్లు(2 కోట్ల నుంచి 3 కోట్ల మంది) మరణిస్తే ఇప్పుడు కోవిడ్ వల్ల కేవలం 47 లక్షల మంది మాత్రమే మృత్యువాత పడ్డారు. 

అంతేకాకుండా ఇప్పటిలా అప్పట్లో ఫ్లూ వైరస్‌ను నిరోధించేందుకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఎలాంటి ప్రజా వైద్య చికిత్స విభాగాలు అందుబాటులో లేవు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఉన్నా చాలా తక్కువ మందికే పరిమితమైపోయింది. యాంటీ బయాటిక్స్, ఇన్‌టెన్సివ్ కేర్ యూనిట్లు, వెంటిలేటర్లు, ఐవీ ఫ్లూయిడ్లు.. ఇలా ఏ ఒక్కటి ఆ కాలంలో అందుబాటులో లేదు. అన్నింటికంటే పెద్ద సమస్య అప్పటివరకు సైంటిస్టులు ఒక్కసారి కూడా వైరస్‌ను చూడలేదు. అప్పట్లో అంత టెక్నాలజీ కూడా శాస్త్రవేత్తల వద్ద లేదు. అందువల్లనే అప్పటితో పోల్చితే 100 ఏళ్ల తర్వాత ఇప్పుడు విజృంభిస్తున్న కోవిడ్‌ను ఎదుర్కోవడానికి మన వద్ద చాలా అవకాశాలు అందుబాటులో ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అప్పటి ఫ్లూతో పోల్చితే కోవిడ్‌ను దీటుగానే ఎదుర్కొన్నామని ధీమాగా చెబుతున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...