Abn logo
May 16 2021 @ 00:02AM

కొవిడ్‌ అనుభవం అనూహ్యం... భయానకం

అనుభవం అన్నిటికంటే గొప్పది! కొన్ని విషయాలు అనుభవమైతేనే గానీ అర్థం కావు. కుటుంబమంతా కరోనాతో చేసిన పోరాటం కావచ్చు... స్టార్‌ కిడ్‌గా తెరంగేట్రం, చిత్ర పరిశ్రమలో పరిస్థితులు కావచ్చు... రాజశేఖర్‌-జీవిత దంపతుల రెండో కుమార్తె శివాత్మికకు అనుభవమే. ‘నవ్య’కు వాటిని వివరించారిలా...


హాయ్‌ శివాత్మిక! ఎలా ఉన్నారు?

బావున్నానండీ. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాను. లాక్‌డౌన్‌కి ముందు చెన్నైలో నా తమిళ సినిమా (గౌతమ్‌ కార్తీక్‌తో ‘ఆనందం విలయాడుమ్‌ వీడు’) చిత్రీకరణ చేశా.


గతంలో మీరు ‘దొరసాని’ చేశారు. అయితే, ఈ కొవిడ్‌ టైమ్‌లో చిత్రీకరణ చేయడం ఎలా ఉంది?

నిజాయతీగా చెప్పాలంటే... వెరీ స్కేరీ(చాలా భయంగా ఉంది). ఎందుకంటే? గతంలో నాకు ఓసారి కరోనా వచ్చింది. అది మనల్ని ఎంతదూరం తీసుకువెళ్తుంది? పరిణామాలు ఎలా ఉంటాయి? అన్నది తెలుసు. ఇప్పుడు మన దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ టైమ్‌లో ‘షూటింగ్స్‌ ఎందుకు చేస్తున్నారు? మానేయొచ్చు కదా!’ అంటారు కొందరు. కానీ, నిర్మాతల పెట్టుబడి గురించీ మనం ఆలోచించాలి. సినిమాపై జీవితాలు ఆధారపడి ఉన్నాయి. కరోనా నేపథ్యంలో తెలుగులో ‘పంచతంత్రం’ ప్రొడక్షన్‌ గానీ, తమిళ్‌లో ‘ఆనందం విలయాడుమ్‌ వీడు’ ప్రొడక్షన్‌ గానీ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా తమిళ్‌లో యూనిట్‌ అందర్నీ ఓ హోటల్‌లో ఉంచారు. ఎప్పటికప్పుడు టెస్ట్‌లు చేయిస్తూ, సెట్‌లో మాస్క్‌లు-శానిటైజర్లు తప్పనిసరి చేస్తూ చిత్రీకరణ చేశారు. ఆ విషయంలో హ్యాపీ. ఐ లవ్‌ మై వర్క్‌. అయితే, పరిస్థితుల వల్ల ఇంట్లో ఉంటే బావుంటుందని అనిపిస్తుంది.


మీ కుటుంబమంతా కొవిడ్‌ బారిన పడి కోలుకున్నారు కదా..! 

అది అనూహ్యం! భయానకం!! కానీ, మేమంతా వెరీ లక్కీ. మాకు కరోనా వచ్చినప్పుడు కేసుల సంఖ్య తక్కువ. వైద్య సదుపాయాలు ఉన్నాయి. చికిత్స, అవసరమైనవన్నీ దొరికాయి. ముందు అక్కకు కొవిడ్‌ వచ్చింది. ఓ వారంలో తగ్గింది. తర్వాత నాన్నకు వచ్చింది. సడన్‌గా సీరియస్‌ అవుతుందని ఊహించలేదు. నాన్న హెల్దీ పర్సన్‌. పైగా, ఆయనో డాక్టర్‌! మాకు అవగాహన ఉంది. ప్రాక్టికల్‌గా ఉన్నాం. ట్రీట్మెంట్‌ తీసుకున్నారు. అయినా సీరియస్‌ అవ్వడంతో ఓ నెల ఐసీయూలో ఉన్నారు. నా జీవితంలోనే ఎంతో ఆందోళనకు గురైన రోజులవి. నాన్న ఆరోగ్యంగా తిరిగొచ్చారు. చికిత్స అందించిన వైద్యులు, ఇతర సిబ్బందికి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు చెబుతున్నా. నిజం చెప్పాలంటే... నాన్నకు కరోనా వచ్చి ఆస్పత్రిలో చేరే ముందు వరకూ, ఆరోగ్యవంతులపై అంత ప్రభావం చూపదని చెప్పారు కదా! కానీ, అందరిపై ఎఫెక్ట్‌ చూపిస్తుందని తెలిసింది. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ మరింత తీవ్రంగా ఉంది. పరిస్థితులు చూస్తుంటే... బాధగా, భయంగా ఉంది. ప్రజలందరికీ ఎప్పుడు వ్యాక్సిన్‌ వస్తుంది? ఏమవుతోంది? - వెయ్యి ఆలోచనలు. మా వంతు సాయం మేం చేస్తూ, సేఫ్‌గా ఉంటున్నాం.


ఇప్పుడు మీరు, అక్క(శివాని), మీ నాన్నగారు - షూటింగ్స్‌ చేస్తున్నారు. ఒకరినొకరు కలిసే సమయం లభిస్తుందా?

సాధారణంగా మేం కలిసే ఉంటాం. బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ కలిసి చేయడం రొటీన్‌. ఇటీవల నాన్నగారు ‘శేఖర్‌’, అక్క రెండుమూడు చిత్రాలు, నేను ‘ఆనందం విలయాడుమ్‌ వీడు’ - ముగ్గురం చిత్రీకరణల్లో ఉన్నాం. తొలిసారి తల్లితండ్రులకు దూరంగా నా పుట్టినరోజు జరిగింది. దిండిగల్‌లో ‘ఆనందం విలయాడుమ్‌ వీడు’ చిత్రీకరణలో ఉన్నాను. అక్క సినిమా షూటింగ్‌ రెండు గంటల దూరంలో ఉన్న మరో సిటీ కోయంబత్తూర్‌లో జరుగుతోంది. తను నేనున్న హోటల్‌కు వచ్చి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. మీరు అడిగినట్టు... ఈమధ్య మేం కలిసే సమయం ఉండటం లేదు. నలుగురం నాలుగుచోట్ల ఉంటున్నాం. లాక్‌డౌన్‌ ముందువరకూ... రెండు రోజులు ఇంట్లో, పది రోజులు షూటింగ్‌లో ఉన్నాం.


ప్రజలకు మీరు చెప్పేది?

లాక్‌డౌన్‌ తర్వాత నటీనటులుగా మేం సెట్‌కు వెళ్లక తప్పదు! ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం ఉంటే చేయండి. తప్పనిసరైతేనే ఆఫీసుకు వెళ్లండి. రెస్టారెంట్లు, హాలిడే టూర్లు, ఎక్కువమంది గుమిగూడే మతపరమైన కార్యక్రమాలకు కొన్నాళ్లు దూరం పాటించడం మంచిది. ఆస్పత్రుల్లో బెడ్స్‌ దొరకడం కష్టమవుతోంది. అనవసరంగా బయటకు వెళ్లి ప్రమాదం కొని తెచ్చుకోవడం ఎందుకు? స్టే హోమ్‌. స్టే సేఫ్‌!కమర్షియల్‌ హీరోయిన్‌ అనిపించుకుంటా..

సినిమా ప్రపంచంలో పెరిగాం కాబట్టి... అన్ని జానర్‌ చిత్రాలు ఇష్టమే. ఓ సినిమా చేస్తే... అందరికీ నచ్చేస్తుందని చెప్పలేం. కొన్ని సినిమాలు కొంతమందిని దృష్టిలో పెట్టుకుని చేస్తాం. అందుకని, అన్ని జానర్‌ చిత్రాలు చేయాలనుంది. కమర్షియల్‌ హీరోయిన్‌ అనిపించుకోవాలనుంది. శక్తిమంతమైన పాత్రలు, ప్రయోగాలు చేయడానికీ సిద్ధమే. విభిన్న, విలక్షణ పాత్రల్లో నటిస్తా. ఒకే తరహా పాత్రలు, చిత్రాలు చేస్తే నటిగా నాకు ఛాలెంజ్‌ ఏముంటుంది? రెండు మూడు చిత్రాల తర్వాత ‘ఈ పిల్ల చేసిందే చేస్తుంది’ అని ప్రేక్షకులంటారు. నాకు ఇలాంటి చిత్రాలే చేయాలనే పట్టింపులేం లేవు. ప్రేమకథలు, యాక్షన్‌ చిత్రాలంటే కొంచెం ఎక్కువ ఇష్టం.అమ్మ చీరల్ని అలా చేశాం

చాలామంది మా అమ్మలా ఉన్నానని చెప్పారు. ఇప్పుడూ సెట్‌లో కొందరు ‘మీ అమ్మలా ఉన్నావమ్మా’ అంటుంటారు. ‘దొరసాని’ లుక్‌కి మా అమ్మే స్ఫూర్తి. తన టీనేజ్‌ ఫొటోలు, హెయిర్‌ స్టయిల్‌ అవీ చూసి ఆ లుక్‌ డిజైన్‌ చేసుకున్నాం. అందులో నేను వేసుకున్న పట్టులంగా-జాకెట్‌లు చాలావరకూ అమ్మ చీరలే. తను 90లలో కట్టిన చీరలు తీసుకుని డ్రస్‌లు కుట్టించుకున్నా.


బంధుప్రీతి ఎక్కడుంది?

‘బంధుప్రీతి’ లేదంటే ‘నెపొటిజమ్‌’ అని చాలామంది ఈజీగా మాట్లాడతారు. తెలుగులో శివానీ రాజశేఖర్‌, శివాత్మికా రాజశేఖర్‌ అని ఇద్దరు ఉన్నారని ప్రతి ఒక్కరికీ తెలుసు. వారసత్వంతో ఆ గుర్తింపు వస్తుంది. అంతకు మించి ఏమీ రాదు. రాజశేఖర్‌-జీవిత పిల్లలం కాబట్టే కొంతమంది దర్శకులు కావాలని మమ్మల్ని సంప్రతించడం లేదు. మాతో పని చేయడం కష్టమనీ, మా పేరెంట్స్‌ జోక్యం చేసుకుంటారనీ, మేం అమ్మానాన్న చేతిలో ఉంటామని ఏదేదో ఊహించుకుంటున్నారు. తెలుగులో ప్రముఖ దర్శకుడు ‘అమ్మానాన్న పేర్లు మీ ఫోన్లు లిఫ్ట్‌ చేయడం వరకే. అవకాశాలు ఇవ్వరు’ అని చెప్పారు. ఇప్పటివరకూ మేం రాజశేఖర్‌-జీవిత పిల్లలం అని ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. స్టార్‌ కిడ్స్‌ కాబట్టి మేం తెలుస్తాం. కానీ, సినిమా అవకాశాలు అంత సులభంగా రావు. బంధుప్రీతి నిజమైతే... ‘దొరసాని’ తర్వాత నాకు మరో అవకాశం రావడానికి రెండేళ్లు, శివానీ మొదటి సినిమా చేయడానికి ఆరేళ్లు ఎందుకు పడుతుంది? మనుషి మనస్తత్వం ఎలా ఉంటుందంటే... ‘మనకు సక్సెస్‌ వచ్చేవరకూ మనం చెప్పేది ఎవరూ నమ్మరు. వచ్చిన తర్వాత ఏం చెప్పినా నమ్ముతారు’. ఒక రోజు తప్పకుండా... నేను, శివాని మేం ఎన్ని ఆడిషన్లు ఇచ్చామో చెబుతాం. ప్రతి ఒక్కరికీ వాళ్ల స్ట్రగుల్స్‌, కష్టాలు ఉంటాయి. సౌత్‌ ఇండస్ట్రీలో సినీ కుటుంబం నుంచి వచ్చిన ఏ అమ్మాయిని అడిగినా... ఈ విషయం చెబుతుంది. ‘ప్రతిభను ఎవరూ ఆపలేరు’ అని మా నాన్న చెబుతుంటారు. అదే నిజం! స్టార్‌ కిడ్స్‌ అయినా ప్రతిభ ఉంటేనే ప్రేక్షకులకు నచ్చుతారు. 

- సత్య పులగంAdvertisement
Advertisement
Advertisement