ఇద్దరు బాధితులు మృతి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాల్లో బుధవారం 117 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు బాధితులు కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45,675కి చేరుకుంది. కరోనా మరణాలు అధికారికంగా 639కి పెరిగాయి. కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 145 మంది గడచిన 24 గంటల్లో వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకోగా, ఇంకా 1,233 మంది ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు.
జీజీహెచ్ ప్రొఫెసర్ మృతి
విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చర్మవ్యాధుల విభాగాధిపతి డాక్టర్ నరసింహారావు బుధవారం తెల్లవారుజామున మరణించారు. కరోనా బారినపడిన డాక్టర్ నరసింహారావు చికిత్స తీసుకుని ఇటీవలే తిరిగి విధులకు హాజరయ్యారని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గకుండానే మళ్లీ విధులకు హాజరవడంతో కరోనా మళ్లీ తిరగబెట్టినట్లు భావిస్తున్నారు.