ముంచేస్తోన్న.. మహమ్మారి

ABN , First Publish Date - 2021-05-17T05:45:43+05:30 IST

జిల్లాపై కరోనా విరుచుకుపడుతోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు నిత్యం పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి.

ముంచేస్తోన్న.. మహమ్మారి

జిల్లాలో ఆల్‌టైం హైకి కేసులు

16 రోజుల్లో 28,344 మందికి వైరస్‌

గుంటూరు సహా గ్రామాల్లోనూ తగ్గని తీవ్రత

ఇలాగే కొనసాగితే ఈ నెలలో 50 వేలు దాటే అవకాశం


జిల్లాను కరోనా మహమ్మారి ముంచేస్తోంది. గుంటూరు సహా పట్టణాలు, గ్రామాలపై కొవిడ్‌-19  ప్రళయంలా విరుచుకుపడుతోంది. ఫస్టువేవ్‌లో అత్యధికంగా గత ఏడాది ఆగస్టులో 21,443 కేసులు నమోదయ్యాయి. సెకండ్‌ వేవ్‌లో ఆ సంఖ్యని ఈ ఏడాది ఏప్రిల్‌ నెల అధిగమించేసి 26,878 రికార్డు అయ్యాయి. గత నెలలో నమోదైన కేసులే ఎక్కువ అని అంతా భావిస్తుంటే ఈ నెల ఆల్‌టైం హైకి చేరుకున్నది. కేవలం 16 రోజుల వ్యవధిలో 28,344  కేసులు నమోదయ్యాయి. రెండు వారాల కర్ఫ్యూ మరో రెండు రోజుల్లో ముగియనుండగా నిత్యం భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగులోకి వస్తోన్నాయి. ఈ నెలలో ఇంకా 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే మే నెల ముగిసేసరికి 50 వేలు కేసులు దాటిపోయే అవకాశం లేకపోలేదని అందరూ భావిస్తున్నారు. 


గుంటూరు, మే 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాపై కరోనా విరుచుకుపడుతోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు నిత్యం పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి.  అయినా తూతూమంత్రంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు వైరస్‌ వ్యాప్తి లోపాన్ని గుర్తించలేకపోతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో తీవ్రత ఏమాత్రం తగ్గకపోగా ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాలకు భారీగా వైరస్‌ విస్తరిస్తోంది. ఈ పరిస్థితుల్లో వైరస్‌ వ్యాప్తి ఎప్పటికి అదుపులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో నమోదు అవుతోన్న పాజిటివ్‌ కేసుల్లో ఇంచుమించు 40 నుంచి 50 శాతం గుంటూరు నగరంలోనే ఉంటున్నాయి. ఇక్కడ వైరస్‌ వ్యాప్తిని అరికట్టగలిగితే జిల్లా అంతటా అదుపులోకి వస్తుందని పలువురు సూచిస్తున్నారు. ఈ దృష్ట్యా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉన్నది. కాగా ప్రస్తుతం గుంటూరు నగరంలో 3,838 క్లస్టర్లలో జరుగుతోన్న ఫీవర్‌ సర్వేపై ప్రధానంగా ఆశలు పెట్టుకున్నారు. ఈ సర్వేలో ఎవరెవరికి అనారోగ్య లక్షణాలు ఉన్నాయో తేలిపోతుందని, అలాంటి వారందరికీ టెస్టులు చేయించి వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలని నగరపాలకసంస్థ అధికారులు భావిస్తున్నారు. అయితే గత ఏడాది జరిగిన రీతిలో సర్వే పకడ్బందీగా జరగాలి. ప్రస్తుతం వలంటీర్లు కేవలం ఇంటింటికి వెళ్లి ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉన్నాయా అని అడిగి వెళ్లిపోతున్నారు. అలా కాకుండా థర్మల్‌ స్కానర్లు పెట్టి స్ర్కీనింగ్‌ చేస్తేనే సర్వే ఫలితాలు పక్కాగా వస్తాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.


19 వేలకు సమీపంలో యాక్టివ్‌ కేసులు

జిల్లాలో కరోనా వైరస్‌ యాక్టివ్‌ కేసులు 18,933కు చేరుకున్నాయి. రోజుకు 2 వేలకు దగ్గరగా కొత్త కేసులు నమోదు అవుతుంటే డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య 800 నుంచి 900 మధ్యలోనే ఉంటున్నది. దీంతో ఇంచుమించుగా వెయ్యి కేసుల వ్యత్యాసం ఉంటున్నది. ఈ కారణంగానే యాక్టివ్‌ కేసులు కొండలా పెరిగిపోతున్నాయి. ఇవి పెరిగే కొద్ది ఆస్పత్రులపై భారం పెరుగుతుంది. అలానే మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైనా అదనపు భారం పడుతుంది. ఇప్పటికే భారీ స్థాయిలో ఆక్సిజన్‌ అవసరం అవుతుంది. ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేయలేని స్థితిలో ఉన్నాయి. 


పాజిటివ్‌రేట్‌ 19.39 శాతం

1,787 మందికి కరోన పాజిటివ్‌

మరో తొమ్మిది మంది మృత్యువాత


కరోనా వైరస్‌ తీవ్రత జిల్లాలో ఏమాత్రం తగ్గడం లేదు. ఏ రోజుకు ఆ రోజు కేసులు, పాజిటివ్‌ శాతం తగ్గుతాయేమోనని అటు జిల్లా యంత్రాంగం, ఇటు ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే ఏ రోజు కూడా 2 వేలకు అటు, ఇటుగా పాజిటివ్‌ కేసులు తగ్గడంలేదు. ఆదివారం 9,217 శాంపిల్స్‌ ఫలితాలు రాగా అందులో 1,787 మందికి వైరస్‌ సోకింది. పాజిటివ్‌ శాతం 19.39గా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోన్నది. ఆదివారం 9 మంది కరోనాతో మరణించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గుంటూరులో నలుగురు, ఫిరంగిపురం, తాడేపల్లి, ముప్పాళ్ల, మేడికొండూరు, మంగళగిరిలో ఒక్కొక్కరు చనిపోయారు. కొవిడ్‌ నుంచి కోలుకుని 875 మంది డిశ్చార్జి అయ్యారు. గుంటూరు నగరంలో కొత్తగా 578 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. ఏటీ అగ్రహారంలో 17, ఎన్‌జీవో కాలనీలో 17, పాతగుంటూరులో 13, ఆటోనగర్‌లో 13, బృందావన్‌గార్డెన్స్‌లో 12, ఎస్‌వీఎన్‌ కాలనీలో 11, బ్రాడీపేటలో 10, రామిరెడ్డినగర్‌లో 10 కేసులు వచ్చాయి. వీటితో కలిపి మొత్తం 121 ప్రాంతాల్లో కేసులు వచ్చాయని నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ తెలిపారు. మంగళగిరిలో 130, నరసరావుపేటలో 111, తాడేపల్లిలో 98, బాపట్లలో 62, మాచర్లలో 61, చిలకలూరిపేటలో 53, పెదకాకానిలో 51, తెనాలిలో 46, సత్తెనపల్లిలో 45, అమరావతిలో 31, క్రోసూరులో 4, గుంటూరు రూరల్‌లో 26, మేడికొండూరులో 16, ముప్పాళ్లలో 6, పెదనందిపాడులో 4, ప్రత్తిపాడులో 6, పెదకూరపాడులో 39, తాడికొండలో 13, తుళ్లూరులో 27, వట్టిచెరుకూరులో 4, ఫిరంగిపురంలో 21, అచ్చంపేటలో 4, బెల్లంకొండలో 2, రాజుపాలెంలో 5, వెల్దుర్తిలో 4, పిడుగురాళ్లలో 13, రెంటచింతలలో 19, కారంపూడిలో 14, దుర్గిలో 12, దాచేపల్లిలో 19, మాచవరంలో 3, గురజాలలో 8, యడ్లపాడులో 12, ఈపూరులో 2, రొంపిచర్లలో 16, నూజెండ్లలో 4, నకరికల్లులో 15, వినుకొండలో 12, శావల్యాపురంలో 4, నాదెండ్లలో 22, బొల్లాపల్లిలో 3, పిట్టలవానిపాలెంలో 7, భట్టిప్రోలులో 2, చేబ్రోలులో 11, చెరుకుపల్లిలో 7, దుగ్గిరాలలో 20, కాకుమానులో 5, కొల్లిపరలో 4, కొల్లూరులో 5, రేపల్లెలో 28, పొన్నూరులో 22, చుండూరులో 5, వేమూరులో 2, కర్లపాలెంలో 4, నగరంలో 10, నిజాంపట్నంలో 21, అమర్తలూరులో 9 కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు.


7,468 మందికి టీకా 

ఆదివారం సెలవుదినం అయినప్పటికీ గుంటూరు నగరం మినహా గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియని కొనసాగించారు. మొత్తం 7,468 మందికి కరోనా సెకండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ వేసినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. 2,01,972 మందికి సెకండ్‌ డోస్‌ వేయాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 1,79,405 మందికి వేసినట్లు పేర్కొన్నారు.


హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

నకరికల్లు, రెంటచింతల, కారంపూడి: కరోనా లక్షణాలతో చికిత్స పొందుతూ నకరికల్లు స్టేషన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ కంచర్ల సీతారామరాజు(52) ఆదివారం మృతి చెందినట్లు ఎస్‌ఐ ఉదయబాబు తెలిపారు. సీతారామరాజు ఈ నెల 8న కొవిడ్‌ లక్షణాలతో నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేరారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం మృతి చెందాడు. సీతారామరాజు స్వగ్రామం పొన్నూరు మండలం దొప్పలపూడి. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రెంటచింతలలోని వడ్డెర బావి సమీపంలో 65 ఏళ్ల మహిళ కరోనా లక్షణాలతో మృతి చెందింది.  కారంపూడికి చెందిన వైసీపీ నేత కప్పెర రమణయ్య కరోనా లక్షణాలతో మృతి చెందారు. పది రోజుల క్రితం జ్వరం రావడంతో గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.  


కరోనా.. పరామర్శలు

వైరస్‌ విస్తరణకు ప్రధాన కారణం

ఫస్టువేవ్‌లో రక్త సంబంధీకులు కూడా దూరం

నేడు కొవిడ్‌ సోకిన వారికి సమీపంగా బంధువులు, స్నేహితులు

  

మొదటి విడతలో ఎవరికైనా కరోనా అంటే జనం భయాందోళనలు చెందారు. చివరకు కుటుంబసభ్యులు కూడా దగ్గరకు వచ్చే వారు కాదు.  అయితే రెండో విడతలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. వైరస్‌ ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. మరణాల శాతం కూడా అధికంగా ఉంది. అయినా ప్రజల్లో ఎటువంటి ఆందోళన ఉండటంలేదు. కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ సోకిన వ్యక్తిని పరామర్శించేందుకు  బంధువులు, స్నేహితులు బారులు తీరుతున్నారు. ఈ కారణంగా వైరస్‌ మరింతగా విస్తరిస్తోన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు గుర్తించాయి. గత ఏడాది కరోనా ఫస్టు వేవ్‌ సమయంలో ఎవరికైనా కొవిడ్‌ సోకిందంటే ఆ దరిదాపులకు కనీసం రక్తసంబంధీకులు కూడా వెళ్లేవారు కాదు. ఫోన్లలోనే పరామర్శించి ధైర్యం చెప్పేవారు. దాంతో వైరస్‌ వ్యాప్తి జరిగేది కాదు. ఎప్పుడైతే కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టడంతో.. దానిపై ప్రజల్లో నెలకొన్న భయం పోయింది. నేడు కరోనా సోకిన వారి వద్దకు ఏ మాత్రం ఆలోచన చేయకుండా పలువురు వెళుతున్నారు. వీరి పరామర్శల వల్ల కొవిడ్‌ సోకిన వ్యక్తికి ఒరిగేది ఏమి ఉండదు. అయినప్పటికీ వారు వెళుతోండటంతో వైరస్‌ వ్యాప్తి జరుగుతున్నది. ఇది కూడా జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడానికి ఒక కారణంగా పలువురు భావిస్తున్నారు. కరోనా సోకిన వ్యక్తి పూర్తిగా ఐసోలేషన్‌లో ఉండాలి. అతడు విశ్రాంతి తీసుకునే గది వేరుగా ఉండాలి. అక్కడికి ఎవరూ వెళ్లకూడదు. ఏమైనా ఆహార పదార్థాలు, మాత్రలు ఇవ్వాల్సి వస్తే ఒక టేబుల్‌పై పెట్టి తలుపునకు సమీపంలో ఉంచాలి. బాధితుడు ఎట్టి పరిస్థితుల్లో మాస్కు తీయకూడదు. అలాంటిది ఇప్పుడు హోం సోలేషన్‌/ఆస్పత్రి/కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఉన్న వారిని పరామర్శించేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు వెళుతున్నారు. అక్కడికి వెళ్లినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. మొక్కుబడిగా మాస్కు ధరించి భౌతిక దూరం పాటించకుండా గంటల తరబడి కూర్చుంటున్నారు. కొందరైతే తమ సొంత వాహనాల్లో కరోనా సోకిన వారిని ఆస్పత్రులకు తిప్పుతున్నారు. గుంటూరులోని కొన్ని ఆస్పత్రుల్లో కొవిడ్‌ సోకిన వారికి ఓపీ చూస్తున్నారు. దాంతో వారి వద్దకు తీసుకెళుతున్నారు. అలానే కరోనా లక్షణాలున్న వారిని వెంటబెట్టుకుని ల్యాబ్‌లకు తీసుకెళ్లి టెస్టులు చేయిస్తున్నారు. ఇలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కొవిడ్‌ సోకిన వారితో కలిసి మెలిసి ఉంటుండటంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎక్కువ సంఖ్యలో కరోనా సెకండ్‌ వేవ్‌ బారిన పడుతున్నారు. ఈ కారణంగానే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వైరస్‌ వ్యాప్తి చెందుతున్నది. దీని వల్ల కేసుల సంఖ్య పెరిగిపోతున్నది. ఆంక్షలు, కర్ఫ్యూ పెట్టినా జిల్లాలో కరోనా అదుపులోకి రాకపోవడానికి ఈ పరామర్శలు కూడా ఒక కారణంగా అధికారులు భావిస్తున్నారు. ఈ విషయంలో ప్రజలే స్వచ్ఛందంగా కరోనా సోకిన వారికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి సేవలు చేయాల్సి వస్తే అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. 

 


Updated Date - 2021-05-17T05:45:43+05:30 IST