వేగంగా.. వైరస్‌

ABN , First Publish Date - 2021-05-10T05:30:00+05:30 IST

కరోనా సెకండ్‌వేవ్‌ నిండు ప్రాణాలను కబళించేస్తోన్నది. వయస్సుతో సంబంధం లేకుండా అందరిపై దాడి చేస్తోన్నది. కరోనా సోకిందని నిర్ధారణకు వచ్చే సరికే పరిస్థితి చేయి దాటిపోతోన్నది.

వేగంగా.. వైరస్‌
వ్యాక్సిన్‌ కోసం మున్సిపల్‌ బాలికల ఉన్నత పాఠశాల వద్ద పడిగాపులు

పాజిటివ్‌ రేట్‌ పైపైకి

6,462 శాంపిల్స్‌.. 1,575 కేసులు

తాజాగా 24.37 శాతంగా నమోదు

అధికారికంగా 12 మంది మృత్యువాత


కరోనా సెకండ్‌ వేవ్‌ జిల్లాలో వాయువేగంలా విస్తరిస్తోన్నది. కేవలం 10 రోజుల్లో 17,178 మందికి వైరస్‌ సోకింది. రోజుకు సగటున 17 వందల మందికి పైగానే వైరస్‌ బారిన పడుతున్నారు. ఫిబ్రవరిలో రోజుకు కనీసం 10 మందికి కూడా వైరస్‌ వ్యాప్తి చెందని పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే ఇప్పుడు ఎన్ని వందల రెట్లు పెరిగిపోయిందో అంచనా వేయడానికే భయపడే పరిస్థితిని నెలకొంది. మరణాలు కూడా ఈ నెల ప్రారంభమైనప్పటి నుంచి పెరిగిపోయాయి. రోజుకు సగటున అధికారికంగా ఆరుగురు పైనే చనిపోతున్నారు. ఇప్పటివరకు 66 మంది మృత్యువాత పడ్డారు. ఇక అనధికారికంగా కొవిడ్‌ కేసులు, ఆ లక్షణాలతో చనిపోతున్న వారి సంఖ్య అంచనాలకు అందడంలేదు. పాజిటివ్‌ రేట్‌ తొలిసారిగా జిల్లాలో 20 దాటింది.  



గుంటూరు, మే 10 (ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌వేవ్‌ నిండు ప్రాణాలను కబళించేస్తోన్నది. వయస్సుతో సంబంధం లేకుండా అందరిపై దాడి చేస్తోన్నది. కరోనా సోకిందని నిర్ధారణకు వచ్చే సరికే పరిస్థితి చేయి దాటిపోతోన్నది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు అత్యవసర చికిత్స కోసం తీసుకొస్తోన్న బాధితుల్లో చాలామంది చనిపోతున్నారు. వారు ఆస్పత్రులకు వచ్చేసరికే ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో ఉంటోన్నారు. కృత్రిమంగా ఎంత ఆక్సిజన్‌ అందించినా గంటల వ్యవధిలోనే శ్వాస ఆగిపోతున్నది. వరుసగా రెండో రోజు(సోమవారం) కూడా అధికారికంగానే 12 మంది కొవిడ్‌తో చనిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో ఒక్క గుంటూరులోనే ఐదుగురు, మంగళగిరిలో ఇద్దరు, ఫిరంగిపురం, తాడేపల్లి, దాచేపల్లి, దుగ్గిరాల, కొల్లూరులో ఒక్కొక్కరు చనిపోయారు. అనధికారికంగా కొవిడ్‌-19 లక్షణాలతో చనిపోతున్న వారి సంఖ్య మూడు, నాలుగు రెట్లు అధికంగా ఉంటున్నది. గుంటూరు నగరంలోని శ్మశాన వాటికల్లో ఉదయం 6 గంటల నుంచే చితిమంటలు వెలుగుతున్నాయి. కాగా సోమవారం ఉదయం వరకు 6,462 శాంపిల్స్‌ ఫలితాలు రాగా వాటిల్లో 1,575 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ జరిగింది. ఆదివారంతో పోల్చి చూస్తే కేసుల సంఖ్య తక్కువే అయినప్పటికీ పాజిటివ్‌ రేట్‌ తొలిసారిగా జిల్లాలో 20 దాటింది. 24.37 శాతంగా పాజిటివ్‌ రేట్‌ నమోదు కావడం ఆందోళన కలిగిస్తోన్నది. ఈ స్థాయిలో పాజిటివ్‌ రేట్‌ ఢిల్లీ, మహారాష్ట్రలో నమోదైంది. సోమవారం కోవిడ్‌ నుంచి ,1227 మంది కోలుకొన్నారు. యాక్టివ్‌ కేసులు 17,575గా కొనసాగుతున్నాయి. కొత్తగా గుంటూరు నగరంలో 611 మందికి వైరస్‌ సోకింది. శ్రీనగర్‌లో 25, శారదాకాలనీలో 24, ఆటోనగర్‌లో 18, ఎన్‌టీఆర్‌ నగర్‌లో 17, అరండల్‌పేటలో 16, బృందావన్‌గార్డెన్స్‌లో 15, అమరావతిరోడ్డులో 14, బ్రాడీపేటలో 13, వసంతరాయపురంలో 13, ఐపీడీకాలనీలో 13, పట్టాభిపురంలో 13, నెహ్రూనగర్‌లో 11, విద్యానగర్‌లో 11, వెంగళరావునగర్‌లో 10 కలిపి మొత్తం 129 కాలనీల్లో కొత్త కేసులు వచ్చినట్లు నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ తెలిపారు.


మంగళగిరిలో 138, తుళ్లూరులో 101 కేసులు

ఇక జిల్లాలోని మిగిలిన మండలాలను చూస్తే మంగళగిరిలో 138, తుళ్లూరులో 101, బాపట్లలో 89, నరసరావుపేటలో 72, మాచర్లలో 57, తాడేపల్లిలో 52, తెనాలిలో 42, పెదకాకానిలో 41, అమరావతిలో 24, అచ్చంపేటలో 2, బెల్లంకొండలో 3, గుంటూరు రూరల్‌లో 4, క్రోసూరులో 8, మేడికొండూరులో 3, ముప్పాళ్లలో 4, పెదకూరపాడులో 11, పెదనందిపాడులో 6, ఫిరంగిపురంలో 12, ప్రత్తిపాడులో 11, రాజుపాలెంలో 2, సత్తెనపల్లిలో 19, తాడికొండలో 7, వట్టిచెరుకూరులో 9, దాచేపల్లిలో 6, దుర్గిలో 9, గురజాలలో 1, కారంపూడిలో 5, మాచవరంలో 5, పిడుగురాళ్లలో 20, రెంటచింతలలో 11, వెల్దుర్తిలో 5, బొల్లాపల్లిలో 3, చిలకలూరిపేటలో 37, యడ్లపాడులో 5, ఈపూరులో 2, నాదెండ్లలో 8, నూజెండ్లలో 6, నకరికల్లులో 11, రొంపిచర్లలో 5, శావల్యాపురంలో 19, వినుకొండలో 7, అమర్తలూరులో 3, భట్టిప్రోలులో 1, చేబ్రోలులో 9, చెరుకుపల్లిలో 2, దుగ్గిరాలలో 11, కాకుమానులో 5, కర్లపాలెంలో 8, కొల్లిపరలో 4, కొల్లూరులో 1, నగరంలో 1, నిజాంపట్నంలో 1, పిట్టలవానిపాలెంలో 9, పొన్నూరులో 14, రేపల్లెలో 7, చుండూరులో 4, వేమూరులో 2 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు  డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు.


కొవిడ్‌-19 హెల్ప్‌లైన్‌

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు  

గుంటూరు: కొవిడ్‌-19 బాధితులకు అండగా కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసినట్లు ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి తెలిపారు. బాధితులకు మనోధైర్యం కల్పించడం, హోం ఐసోలేషన్‌లో ఉండేవారికి  ఉచితంగా మందులు అందించటం, ఆక్సిజన్‌ బెడ్స్‌ అవసరమైన వారికి ఏర్పాటు, అత్యవసరమైతే ఉచితంగా వాహన సౌకర్యం కల్పిస్తామన్నారు. జిల్లా హెల్ప్‌లైన్‌ ఇన్‌చార్జిలుగా యువజన కాంగ్రెస్‌ నాయకులు పాలపాటి అనీల్‌, బుర్రి ప్రదీప్‌(బన్నీ)లు వ్యవహరిస్తారని తెలిపారు. సహాయం కావాల్సిన వారు 8179689180, 9966556419 నెంబర్లకు ఫోన్‌ చేసి సేవలు పొందాలని ఆయన కోరారు. 


ఇద్దరు ఉద్యోగుల మృతి

చిలకలూరిపేట: చిలకలూరిపేటలో సోమవారం ఇద్దరు ఉద్యోగులు కరోనా లక్షణాలతో మృతి చెందారు. ప్రస్తుతం గుంటూరు చానల్‌ ఏఈగా పని చేస్తున్న, గతంలో మండల మైనర్‌ ఇరిగేషన్‌ ఏఈగా, రాజాపేట ప్రత్యేకాధికారిగా పనిచేసిన ప్రసాద్‌(45)  చికిత్స పొందుతూ మృతి చెందారు. చిలకలూరిపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కాలేషావలి(47) చిలకలూరిపేటలోని ఓ ఆసుపత్రిలో ఐదు రోజుల క్రితం పాజిటివ్‌తో చేరాడు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఆర్టీసీ డీఎం, కార్మిక నాయకులు ప్రసాద్‌ మృతిపట్ల సంతాపం తెలిపారు.


55 టన్నుల ఆక్సిజన్‌ సరఫరా 

గుంటూరు(తూర్పు): జిల్లాకు సోమవారం 55 టన్నుల ఆక్సిజన్‌ వచ్చినట్లు డ్రగ్‌ కంట్రోలర్‌ ఏడీ అనిల్‌కుమార్‌ తెలిపారు. జిల్లాలోని 15 ప్రైవేటు ఆస్పత్రులకు 1574 డోసుల రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్లు అందజేసినట్లు తెలిపారు. జీజీహెచ్‌కు 450 డోసుల రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లు సరఫరా చేసినట్టు ఈఈ శ్రీనివాసరావు తెలిపారు. ఇవిగాక నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి 30, గుంటూరు జ్వరాల ఆస్పత్రికి 6, తెనాలి ఆస్పత్రికి 48 ఇంజెక్షన్లు సరఫరా చేసినట్టు తెలిపారు.  


వ్యాక్సిన్లు వచ్చేశాయ్‌

6 వేల కోవీషీల్డ్‌, 2 వేల కోవాగ్జిన్‌ డోస్‌ల రాక

శాశ్వత కేంద్రాల్లో నేటి నుంచి వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు

మొబైల్‌ నెంబర్‌కు ఫోన్‌కాల్‌/ఎస్‌ఎంఎస్‌ వచ్చిన వారికే అనుమతి


గుంటూరు, మే 10 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాక్సిన్‌ రెండో డోస్‌ కోసం ఎదురు చూస్తోన్న వారికి మంగళవారం నుంచి వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాకు సోమవారం 6 వేల కోవీషీల్డ్‌, 2 వేల కోవాగ్జిన్‌ డోస్‌లు వచ్చాయి. దీంతో వాటిని శాశ్వత వ్యాక్సిన్‌ కేంద్రాలకు కోటా ప్రకారం కేటాయించారు. ఒక్కో కేంద్రానికి 60 నుంచి 125 వరకు వయల్స్‌ కేటాయించారు. ఆయా కేంద్రం పరిధిలో ఉన్న వారి సంఖ్య ఆధారంగా కేటాయింపులు జరిపారు. సీనియారిటీ ప్రకారం డోస్‌ తీసుకోవాల్సిన వారి జాబితాలను సిద్ధం చేసి ఏ తేదీన ఏ సమయంలో రెండో డోస్‌ వ్యాక్సిన్‌ వేసుకోవాలో ఫోన్‌లకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందించారు. ఎవరికైతే ఎస్‌ఎంఎస్‌లు/ఫోన్‌కాల్స్‌ వచ్చాయో వారు మాత్రమే రెండో డోస్‌ తీసుకోవడానికి ఆయా కేంద్రాలకు రావాలని మునిసిపల్‌ కమిషనర్లు/ఎంపీడీవోలు స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద రద్దీ నియంత్రణకు బ్యారికేడింగ్‌ ఏర్పాటు చేశారు. పోలీసు కానిస్టేబుళ్లు, వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, సెక్రటరీలకు విధులు కేటాయించారు. టోకెన్‌ సిస్టమ్‌ని అమలు చేయనున్నారు. ఈ విధానం ఎంతమేరకు సత్ఫలితాన్ని ఇస్తుందో మంగళవారం తెలిసిపోనుంది. 


 

Updated Date - 2021-05-10T05:30:00+05:30 IST