Abn logo
May 6 2021 @ 00:22AM

కరోనా.. కర్ఫ్యూ

మధ్యాహ్నం 12 గంటలకు నిర్మానుష్యంగా గుంటూరు మార్కెట్‌ సెంటర్‌

లాక్‌డౌన్‌ ఆంక్షలతో నిర్మానుష్యం

అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి

జిల్లా వ్యాప్తంగా స్తంభించిన జన సంచారం

తొలిరోజు హెచ్చరికలతో సరిపెట్టిన పోలీసులు

సడలింపు సమయంలో తొక్కిసలాటలా జనం రద్దీకరోనా కర్ఫ్యూ జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. లాక్‌డౌన్‌ ఆంక్షలతో గుంటూరు సహా పలు పట్టణాలు, గ్రామాల్లో కూడా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్నం  12 గంటలకల్లా దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, ప్రైవేటు సంస్థలన్నీ మూతపడ్డాయి. 12 గంటల తర్వాత అత్యవసర సర్వీసులు మాత్రమే రోడ్లపై కనిపించాయి. ఎక్కడి కక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే తొలి రోజు అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి హెచ్చరికలతో సరిపెట్టారు. ఇక ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు, వ్యాపార కేంద్రాలు జనంతో కిటకిటలాడాయి. వ్యాపారులు కర్ఫ్యూలో భాగస్వామ్యమై 12 గంటలకు వ్యాపార కలాపాలను స్వచ్ఛం దంగా నిలిపివే శారు. కర్ఫ్యూ సమయా నికంటే రెండు గంటల ముందు గానే ఆర్టీసీ అధికారులు బస్సులు నిలివేశారు.  


రెండు గంటల ముందే బస్సుల నిలిపివేత

గుంటూరు బస్టాండ్‌లో ఆర్టీసీ అధికారులు కర్ఫ్యూ సమయానికంటే రెండు గంటల ముందుగానే బస్సులు నిలివేసారు. దీంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకునేందుకు అనేక ఇబ్బందులు పడ్డారు. సుదూర ప్రాంతాల నుండి గుంటూరు నగరానికి వైద్యానికి వచ్చిన రోగులు, వారి సహాయకులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పంది గంటల తరువాత దూరప్రాంతాలకు వెళ్లే బస్సులు నిలిచిపోవటం, బయట ప్రైవేటు వాహనాలు లేకపోవడంతో ఏమీ చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. దుకాణాల మూతతో బస్టాండ్ల వద్ద నిలిచిపోయిన వారు ఆకలికి అలమటించారు. 


(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌)

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బుధవారం కర్ఫ్యూ కొనసాగింది. అత్యవసర సర్వీసులకు మాత్రమే ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ తొలిరోజు కట్టుదిట్టంగా అమలైంది. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు. అత్యవసర విధుల్లో ఉన్న వారి గుర్తింపు కార్డులను చూసి పోలీసులు అనుమతించారు. అయితే జిల్లాలో కర్ఫ్యూ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచే మార్కెట్లు, దుకాణాలు, మాల్స్‌ కిటకిటలాడాయి. ఉదయం 11 గంటల వరకు రద్దీ వాతావరణం కనిపించింది. కర్ఫ్యూకు ముందు మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు తెరచి ఉండేవి. బుధవారం 12 గంటలకే మూసివేస్తారని ముందుగానే ప్రకటించడంతో ఎక్కువమంది ఒకేసారిగా రోడ్లపైకి రావడంతో రోడ్లు కూడా కిటకిటలాడాయి. దుకాణాల వద్ద వినియోగదారులు భౌతికదూరాన్ని పెద్దగా పాటించకున్నా.. అధిక శాతం మంది మాస్కులతోనే కనిపించారు. మద్యం దుకాణాల వద్ద మందుబాబులు ఉదయం 10 నుంచి 11.45 వరకు పెద్దసంఖ్యలో బారులు తీరారు. 12 గంటల తర్వాత కూడా అక్కడక్కడ జనం కనిపించటంతో తొలిరోజు కావటంతో పోలీసులు హెచ్చరికలతో వదిలేశారు. రెండో రోజు నుంచి ఉపేక్షించేదిలేదని తెలిపారు. ఆస్పత్రులకు, మందుల దుకాణాలకు వెళ్లే వారిని మాత్రం తనిఖీలు చేసి పంపించారు.  గ్రామాలలో కూడా ప్రజలు 12 గంటల తరువాత ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజలు అందరూ దాదాపుగా కర్ఫ్యూకు సహకరించారు.  

- కర్ఫ్యూతో వస్తువుల కొనుగోళ్లకు తెనాలి పట్టణవాసులతో పాటు, చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా రావటంతో మార్కెట్‌ రోడ్డు తొక్కిసలాట తరహాలో తయారైంది. కిరాణా, మందుల దుకాణాలు కిక్కిరిసిపోయాయి. కొనుగోలుదారుల రద్దీతో కొవిడ్‌ నిబంధనలు గాలిలో కలిసిపోయాయి. బోస్‌ రోడ్డు, బుర్రిపాలెం రోడ్డు, ఓవర్‌ బ్రిడ్జి, ప్రకాశం రోడ్డు వాహనాలు, జన సంచారంతో నిండిపోయాయి. 12 గంటల తర్వాత తెనాలి-విజయవాడ, తెనాలి-గుంటూరు, తెనాలి-చందోలు రోడ్లు బోసిపోయాయి. మున్సిపల్‌ కార్యాలయం వెనుక రోడ్డులో ఉన్న ఓ దుకాణంలో మాత్రం మధ్యాహ్నం 1 గంట సమయంలో కూడా మద్యం అమ్మకాలు చేస్తుండటంతో పోలీసులు మూసివేయించారు.  జనం బయటకు రాకుండా ఇంటిదగ్గరే కూరగాయలు తీసుకునేలా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ బుధవారం సంచార రైతు బజార్‌ వాహనాన్ని ప్రారంభించారు. 

- తాడేపల్లిలో మధ్యాహ్నం 12 గంటలకు ముందు ఉండవల్లి ప్రధాన రహదారి, ఉండవల్లి కూడలి ప్రజలతో, దుకాణాలకు వచ్చి సరకులు కొనేవారితో రద్దీగా కనిపించింది. వాహనదారులు కూడా ఈ సమయంలో భారీగానే రహదారులపై కనిపించారు. తాడేపల్లి పట్టణంలో 12 తరువాత కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. 12 గంటల తర్వాత వాహనదారులను, ఆటోలను ఉండవల్లి కూడలిలో పోలీసులు అడ్డుకొని హెచ్చరికలు జారీ చేసి పంపివేశారు. పోలీసుల పహరా మధ్య ప్రకాశం బ్యారేజి కూడా నిర్మానుష్యంగా కనిపించింది. అనుమతులు ఉన్న వాహనదారులు మాత్రమే తమ అనుమతి పత్రాలు చూపించి ప్రయాణాలు చేశారు. 

- కరోనా కట్టడి కోసం కర్ఫ్యూ అమలు చేయడంతో నరసరావుపేట పట్టణంలో జన సంచారం స్తంభించింది.   సబ్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్‌, డీఎస్సీ విజయభాస్కర్‌ కర్ఫ్యూ ఆంక్షల అమలును పర్యవేక్షించారు. ప్రజలు రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. నకరికల్లులో  కరోనా నిబందనలు అమలు చేసేందుకు ఎస్‌ఐ పీ ఉదయబాబుతో పాటు పోలీసు సిబ్బంది పహారా నిర్వహించారు.  

- మాచర్ల నియోజకవర్గంలో మధ్యాహ్నం 12 గంటల తరువాత ప్రజలు గృహాలకే పరిమితమయ్యారు. ఉదయం 8 నుంచి 10 గంటల ప్రాంతంలో మాచర్లలోని రద్దీ ప్రాంతాలైనా పార్కు సెంటర్‌ రామాటాకీస్‌లైన్‌ జనాలతో రద్దీగా మారింది. విజయపురిసౌత్‌లోని అంతరాష్ట్ర చెక్‌పోస్టు మధ్యాహ్నం సమయంలో నిర్మానుషంగా మారింది. 

- చిలకలూరిపేట నియోజకవర్గంలో పోలీసులు, మునిసిపల్‌, రెవెన్యూ అధికారులు ముందుగానే అన్ని వ్యాపారసంస్థల వారిని హెచ్చరించడంతో 12 గంటల కల్లా దుకాణ సముదాయాలను మూసివేశారు. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం నుంచి డిపోకే పరిమితమయ్యాయి. అర్బన్‌ సీఐ షేక్‌ బిలాలుద్దీన్‌, ఎస్‌ఐ నరసదాసులు పట్టణంలో కర్ఫ్యూను పర్యవేక్షించారు. జాతీయ రహదారిపై బొప్పూడి ఆంజనేయస్వామి గుడివద్ద రూరల్‌ సీఐ ఎం సుబ్బారావు, ఎస్‌ఐ భాస్కర్‌ల ఆధ్వర్యంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. అయితే తొలిరోజు కావడంతో అన్ని వాహనాలను అనుమతించారు.  

- పిడుగురాళ్ల మాయబజార్‌ వీధి, జానపాడు రోడ్డు, దాచేపల్లి కొట్లబజార్‌, మెయిన్‌రోడ్డుతోపాటు గురజాలలోని కారంపూడి రోడ్డు, ఆర్డీవో ఆఫీస్‌ సెంటర్‌ జనసంచారంతో నిండిపోయింది. పిడుగురాళ్ల, గురజాల పట్టణాల్లోని పలు బ్యాంకుల్లో నగదు విత్‌డ్రా చేసుకునేందుకు  జనం ఎక్కువ సేపు వేచి ఉండాల్సి వచ్చింది. అద్దంకి- నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారి కూడా  12 తరువాత వాహనాల రాకపోకలు పెద్దగా లేవు. పిడుగురాళ్ల ఆర్టీసీ డిపో పరిధిలోని బస్సులన్నీ సమీప గ్రామాలకే ట్రిప్పులు వేసి 12 గంటలకే డిపోకు చేరుకున్నాయి.  

- సత్తెనపల్లి పట్టణంలో మధ్యాహ్నం 12 తర్వాత 80 శాతం మంది వ్యాపారులు దుకాణాలు మూసేశారు. మిగితా 20శాతం షాపులను సీఐ విజయ్‌చంద్ర ఆధ్వర్యంలో పోలీసులు మూసివేయించారు.  

- మంగళగిరిలో ఉదయం మెయిన్‌బజారుతోపాటు గౌతమబుద్ధరోడ్డు, షరాబ్‌బజారు, తెనాలి రోడ్డు వంటి వాణిజ్య వీధులన్నీ సాధారణ జనసందోహంతో కనిపించాయి. 12 గంటల తరువాత కూడ అక్కడక్కడ చిన్నచిన్న వీఽధుల్లో బడ్డీకొట్లు తెరిచివుంచడం కనిపించింది. అయితే ప్రధాన వీధుల్లో మాత్రం దాదాపు అన్నీ వ్యాపార దుకాణాలను ఒంటిగంటకల్లా మూసివేశారు. అయితే, ఆర్టీసీ బస్సులు మినహా ఆటోల వంటి ప్రైవేటు వాహనాలకు మాత్రం ఎక్కడా కళ్లం పడలేదు. 

- తాడికొండ మండలంలో ఉదయం 10 గంటల వరకు మాత్రమే వ్యాపార కార్యాకలాపాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 12 గంటల వరకు దుకాణాల నిర్వహణకు అనుమతించింది. అయితే మండలంలో మాత్రం యథావిధిగా 10 గంటలకే దుకాణాలను మూసివేశారు. గతంలో పేర్కొన్న విధంగా ఉదయం 6 నుంచి 10 గంటల వరకే వ్యాపారాలు కొనసాగించాలని తహసీల్దార్‌ వైవీబీ కుటుంబరావు తెలిపారు.  


సరిహద్దు చెక్‌పోస్టులో తనిఖీలు

కరోనా కర్ఫ్యూతో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని  పొందుగుల, విజయపురిసౌత్‌ చెక్‌పోస్టుల వద్ద బుధవారం పోలీసులు వాహనాల రాకపోకలను నియత్రించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు అన్ని వాహనాలకు  అనుమతి ఇచ్చారు. 12 గంటల తర్వాత అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతించారు. ఎప్పుడూ వాహనాల రాకతో రద్దీగా ఉండే విజయపురిసౌత్‌ చెక్‌పోస్టు వద్ద మధ్యాహ్నం 12 గంటల తర్వాత  నిర్మానుషంగా మారింది. తంగెడ వద్ద కృష్ణానదిపై నిర్మించిన బ్రిడ్జిపై కూడా వాహనాల రాకపోకలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పల్నాడు పల్లెల్లో మిర్చి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కూలి పనులకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన దామరచర్ల, మేళ్లచెరువు, హుజూర్‌నగర్‌ తదితర మండలాల నుంచి లారీలు, ట్రాక్టర్లు, ఆట్లోల్లో కూలీలు తరలివస్తారు.  కర్ఫ్యూ కారణంగా పొందుగల చెక్‌పోస్టు వద్ద వీరిని పోలీసులు అడ్డుకున్నారు. కూలీలు రాలేక పోవడంతో కాయలు కోసేవారు లేక రైతులు కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఒకవైపు ఆకాశం మబ్బులు కమ్మి ఉండటంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. 

 


గుంటూరులో వైన్‌ షాపు ముందు జనం బారులు

అదే ఉధృతి

11,841 శాంపిల్స్‌.. 1,972 కేసులు

16.65 శాతంగా పాజిటివ్‌ రేటు

కొవిడ్‌-19తో ఐదుగురు మృతి


గుంటూరు, మే 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. బుధవారం ఉదయం వరకు వచ్చిన 11,841 శాంపిల్స్‌ ఫలితాల్లో 1,972 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో పాజిటివ్‌ రేట్‌ 16.65 శాతంగా నమోదైంది. కొవిడ్‌ బారిన పడి కేవలం 370 మంది మాత్రమే కోలుకోవడంతో యాక్టివ్‌ కేసులు 17,477కు పెరిగాయి. కొవిడ్‌-19 లక్షణాలతో బుధవారం 11,271 మంది టెస్టులు చేయించుకున్నారు. గుంటూరు ఆకులవారితోటకు చెందిన 49 ఏళ్ల పురుషుడు, దుగ్గిరాల మండలంలోని గొడవర్రుకి చెందిన 45 ఏళ్ల పురుషుడు, గుంటూరు ఆర్‌ అగ్రహారంలో 50 ఏళ్ల పురుషుడు, తాడేపల్లిలోని పోలకంపాడులో 43 ఏళ్ల పురుషుడు, దుగ్గిరాల మండలం పెరికలపూడికి చెందిన 46 ఏళ్ల పురుషుడు కొవిడ్‌తో మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. కొత్తగా గుంటూరు నగరంలో అత్యధికంగా 745 మందికి వైరస్‌ సోకింది. గోరంట్లలో 57, పాతగుంటూరులో 21, ఆర్టీసీ కాలనీలో 17, ఆటోనగర్‌లో 17, శ్రీనగర్‌లో 16, రైల్‌పేటలో 16, గుజ్జనగుళ్లలో 16, స్తంభాలగరువులో 15, ఎన్‌జీవో కాలనీలో 14, అన్నపూర్ణనగర్‌లో 14, కొత్తపేటలో 13, బ్రాడీపేటలో 13, కొరిటెపాడులో 12, శ్యామలానగర్‌లో 12, స్వర్ణభారతీనగర్‌లో 12, అమరావతిరోడ్డులో 12, అరండల్‌పేటలో 12, ముత్యాలరెడ్డినగర్‌లో 12, పట్టాభిపురంలో 11, పలకలూరులో 10, బాలాజీనగర్‌లో 10తో పాటు మొత్తం 157 కాలనీల్లో కొత్త కేసులు వచ్చినట్లు నగరపాలకసంస్థ కమిషనర్‌ అనురాధ తెలిపారు. నరసరావుపేటలో 103, తాడికొండలో 101, మంగళగిరిలో 92, పెదకాకానిలో 91, మాచర్లలో 82, తెనాలిలో 80, తాడేపల్లిలో 72, గుంటూరు రూరల్‌లో 19, మేడికొండూరులో 15, ఫిరంగిపురంలో 10, ప్రత్తిపాడులో 11, రాజుపాలెంలో 11, సత్తెనపల్లిలో 58, వట్టిచెరుకూరులో 11, దాచేపల్లిలో 11, గురజాలలో 11, కారంపూడిలో 16, రెంటచింతలలో 15, చిలకలూరిపేటలో 37, ఈపూరులో 12, నాదెండ్లలో 14,  రొంపిచర్లలో 12, అమర్తలూరులో 14, బాపట్లలో 35, చేబ్రోలులో 15, చెరుకుపల్లిలో 14, దుగ్గిరాలలో 33,   కొల్లిపరలో 14, పొన్నూరులో 26, రేపల్లెలో 34, చుండూరులో 13 మందికి వైరస్‌ సోకినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు.


లక్షణాలతో పలువురి మృతి

కరోనా లక్షణాలతో బుధవారం జిల్లాలో పలువురు మృతి చెందారు. గుంటూరులోని శ్రీనివాసరావుపేట మాచర్లవారి వీధికి చెందిన సాఫ్టువేర్‌ ఇంజనీర్‌ నజీర్‌ కరోనా లక్షణాలతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కారంపూడి స్థానిక బంగారం వ్యాపారి యేచూరి సర్వేశ్వరరావు కరోనా లక్షణాలతో మృతి చెందారు. గుంటూరు నగరపాలక సంస్థలో కౌన్సిల్‌ సూపరింటెండెంట్‌ యలమందమ్మ కరోనా లక్షణాలతో మృతి చెందారు.  క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామానికి చెందిన దేవళ్ల వెంకటేశ్వర్లు(60) బుధవారం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతూ కరోనా లక్షణాలతో మృతి చెందాడు. 


 కఠినంగా కర్ఫ్యూ

అత్యవసరమైతేనే బయటకు రావాలి

కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

గుంటూరు(తూర్పు): జిల్లాలో కరోనా కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని శంకరన్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యవసరమైతే తప్ప బయట తిరగొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా విపత్కర సమయంలో అధికారులకు ప్రజల సహకారం ముఖ్యమన్నారు. సరుకుల రవాణాకు, వాణిజ్య కార్యకలపాలకు ఇబ్బంది లేకుండా అవసరమైన మినహాయింపులు ఇచ్చామన్నారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు అన్ని కార్యకలపాలు నిర్వహించుకోవచ్చని, ఆ సమయంలో  దుకాణాల వద్ద కొవిడ్‌ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. కర్ఫ్యూ సమయంలో ఏదైనా సమస్యలు ఉంటే జిల్లా స్థాయి కంట్రోల్‌ రూంను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. జేసీ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఆస్పత్రులపై అనవసర ఒత్తిడి తగ్గించేందుకు కొవిడ్‌ తీవ్ర లక్షణాలు నుంచి కోలుకున్న వారి ఆరోగ్యాన్ని ర క్షించేందుకు గుంటూరు రైల్‌ మహల్లో 40 బెడ్లతో, జీజీహెచ్‌ ఓపీ విభాగంలో 100 బెడ్లతో స్టెప్‌డౌన్‌ సెంటర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో డీఆర్వో కొండయ్య తదితరులు పాల్గొన్నారు.


ఆటోలకు పాసులు జారీ 

కర్ఫ్యూ సమయంలో అత్యవసర రాకపోకలకు ఇబ్బంది లేకుండా కొన్ని ముఖ్య కూడళ్లలో ఆటోలు అందుబాటులో ఉండేలా వారికి పాసులు జారీ చేస్తామని అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. గుంటూరులోని పీవీకే నాయుడు కూరగాయలు మార్కెట్‌ రద్దీని నియంత్రించేందుకు నగరపాలక సంస్ధ అధికారులతో కలసి క్యూ లైన్లు, బారికేడ్లను ఏర్పాటు చేశామన్నారు. మధ్యాహ్నం 12 తర్వాత రైల్వే స్టేషన్‌, జీజీహెచ్‌, ఇతర ముఖ్య కూడళ్ళ వద్ద పదికి మించకుండా ఆటోలు అందుబాటులో ఉంటాయన్నారు. తాము జారీ చేసే పాస్‌లు ఒక్క రోజు మాత్రమే పనిచేస్తాయన్నారు.


రాష్ట్ర సరిహద్దు వద్ద ఆంక్షలు

రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఆంక్షలు ఉంటాయని రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపే వాహనాలను అనుమతి ఉంటామన్నారు. అత్యవసర సేవలు, వైద్యానికి సంబంధించిన సేవలకు మాత్రం మధ్యాహ్నం తర్వాత కూడా ఆయా చెక్‌పోస్టుల వద్ద వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తామన్నారు. మాస్క్‌లు ధరించకపోతే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. నగరంపాలెంలోని పోలీస్‌ కల్యాణమండపంలో 30 పడకలతో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో 10 బెడ్లను జర్నలిస్టులకు కేటాయిస్తున్నట్టు తెలిపారు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించే విధంగా షాపు యజమానులు చర్యలు చేపట్టాలన్నారు. ఆయా నిబంధనలు అతిక్రమించే వారికి అపరాధ రుసుం విధిస్తామని తెలిపారు.   


ఉదయం 9 గంటల నుంచే బ్యాంక్‌లు

గుంటూరు(ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉండటం,   మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూను అమలు చేస్తోన్న నేపథ్యంలో గురువారం నుంచి బ్యాంక్‌లు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని ఎల్‌డీఎం రాంబాబు తెలిపారు.  జిల్లాలోని 850 ప్రభుత్వ, ప్రైవేట్‌, సహకార బ్యాంక్‌లు మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే పనిచేస్తాయన్నారు. ఈ పని వేళలు ఈ నెల 18వ తేదీ వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. 

 
Advertisement